ముంబై: సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడమంటే ఇదేనేమో. జనాల్లోకి బాగా చొచ్చుకుపోయిన వాటిపై వ్యంగ్య రీతిలో ఆసక్తికరంగా ప్రకటనలు రూపొందించడంలో కొన్ని కంపెనీలు ఎప్పుడు ముందుంటాయి. ఇటీవల పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన ముందున్న కోకాకోలా బాటిళ్లను తీసి నీళ్ల సీసాను చూపించాడు. దీంతో సదరు కంపెనీ ఏకంగా రూ. 29 వేల కోట్లు నష్టపోయింది. అయితే దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ ఫెవికాల్ కంపెనీ రూపొందించిన ప్రకటన ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నది. రెండు ఫెవికాల్ బాటిళ్లను టేబుల్‌పై ఉంచి ‘బాటిల్ కదలదు.. విలువ తరగదు’ అనే క్యాప్షన్‌ను ట్విట్టర్లో రాసుకొచ్చింది.