ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Khammam - Jan 20, 2021 , 02:29:39

లక్ష్యంపై గురి!

లక్ష్యంపై గురి!

  • క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించిన గులాబీ దళం 
  • 50 ఓట్లకు ఒక ఇన్‌చార్జీ నియామకం
  • నేడు జిల్లా నేతలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం
  • ఖమ్మంలో డివిజన్ల వారీగా కమిటీలు 

ఖమ్మం, వరంగల్‌, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఎన్నికల సంఘం ఈ నెల 18వ తేదీన ఓటరు తుదిజాబితా విడుదల చేసింది. ఈ సారి నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గులాబీ పార్టీ విజయం ఖాయమని, మెజార్టీయే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని అధినేత కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట తారకరామారావు బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, చైర్మన్లతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. శాసనమండలి ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, దృష్టిసారించాల్సిన అంశాలపై నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్ధేశం చేయనున్నారు.  

ఖమ్మం, జనవరి 19 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) :

50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జి.. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నది. 50 ఓట్లకు ఒక ఇన్‌చార్జిని నియమించాలని భావిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 1,26,626 మంది ఓటర్లకు 2,535 మంది కార్యకర్తలను ఇంచార్జీలుగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అధికంగా ఉండటంతో ఇన్‌చార్జిల అవసరం ఉన్నదని నాయకులు భావిస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, యువకులు, విద్యావంతులు అధికంగా ఉంటారు. వారిని మెప్పించేలా బాధ్యులు వ్యవహరించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరికీ తెలిసేలా ప్రచారం నిర్వహించన్నునారు. దీనికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ప్రచార సామగ్రి ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరింది.  

జిల్లా నాయకులతో నేతలతో కేటీఆర్‌ భేటీ 

ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకులతో బుధవారం ప్రగతి భవన్‌లో యువనేత కేటీఆర్‌ భేటీ కానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేలా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక శాసన సభ్యులు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్‌, బానోత్‌ హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్లు లింగాల కమల్‌రాజ్‌, కోరం కనకయ్య, డీసీసీబీ చైర్మన్‌ నాగభూషణం, డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరుకానున్నారు. 

VIDEOS

logo