సోమవారం 08 మార్చి 2021
Khammam - Jan 18, 2021 , 00:12:14

కొంగ.. చిట్టి కొంగ

కొంగ.. చిట్టి కొంగ

  • చింతపల్లికి విదేశీ అతిథులు
  • సంతానోత్పత్తికి అనుకూలంగా  వాతావరణం
  • ఏటా జనవరి నుంచి జూలై వరకు నివాసం
  • అతిథుల్లా చూసుకుంటున్న గ్రామస్తులు
  • పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని విన్నపం

ప్రకృతిలో ప్రతి జీవిది మనుగడ కోసం పోరాటమే. బతికినంత కాలం ఆహారం కోసం, నీళ్ల కోసం వేట తప్పదు. కొన్ని జంతువులు కిలోమీటర్లు నడుస్తాయి.. మరికొన్ని ప్రాంతాలు దాటి రోజుల తరబడి ఆహారం వెదుకుతాయి. తమకు అనుకూలమైన ప్రదేశాన్ని ఆవాసంగా చేసుకుంటాయి. కానీ కొన్ని రకాల పక్షులు మాత్రం ప్రపంచ నలు మూలలకూ వెళ్తాయి. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు, తూర్పు నుంచి పడమర వరకు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అతిథుల్లా పరాయి దేశాలకు వచ్చేస్తాయి. అలా ఖమ్మం జిల్లా రూరల్‌ మండల పరిధిలోని చింతపల్లికి సైబీరియా నుంచి ఏటా పేయింటెడ్‌ స్టోర్క్‌ (ఎర్రకాళ్ల) కొంగలు వస్తాయి. ఆరు మాసాలు ఇక్కడే ఉంటాయి. ఈ విదేశీ అతిథులపై ప్రత్యేక కథనం.

ఖమ్మం రూరల్‌, జనవరి 15: ఖమ్మం నగరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉందీ చింతపల్లి గ్రామం. ఈ పల్లెలోని చెరువుకు ఏటా డిసెంబర్‌లో సైబీరియా నుంచి ముందుగా 100కు పైగా ఎర్రకాళ్ల కొంగలు ఈ గ్రామానికి చేరుకుంటాయి. వీటిని పైలెట్‌ కొంగలు అంటారు. చుట్టుపక్కల పరిసరాలు సంచరించి నివాసాలకు అవసరమైన ప్రాంతాలను గుర్తించటం వీటి ప్రత్యేకత. వాతావరణాన్ని అంచనా వేస్తాయి. తమకు అవాసయోగ్యంగా ఉందని నిర్ధారించుకుంటే చాలు.. తిరిగి రెట్టించిన వేగంతో తిరిగి తమ సొంత ప్రదేశాలకు వెళ్తాయి. ముందు వచ్చిన పైలెట్‌ పక్షుల మార్గదర్శకాలతో వేలాదిగా ఎర్రకాళ్ల కొంగలు చింతపల్లి చేరుకుంటాయి.

సంతానోత్పత్తికి అనుకూల వాతావరణం..

చలికాలం పక్షులకు అనుకూలంగా వాతావరణం ఉండటంతో పక్షులు సంతానోత్పత్తికి పూనుకుంటాయి. ఈలోపు గూడు కూడా సిద్ధం చేసుకుంటాయి. ఒక్కసారి నిర్మించుకున్న గూడు ఆరు నెలల పాటు చెక్కుచెదరకుండా నిర్మిస్తాయి. ఇక్కడ సంతానోత్పత్తిని ప్రారంభించిన ఒక్కో ఆడ పక్షి గుడ్లను పొదుగుతుంది. ఈ ప్రక్రియలో కనీసం నాలుగు నుంచి ఐదు పక్షులకు ప్రాణం పోస్తాయి. ఇక తల్లిదండ్రులైన పక్షులు తాము ఆవాసం ఉంటున్న ప్రాంతం నుంచి 50 చదరపు కిలోమీటర్ల వరకు ఉన్న చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద ఆహారం కోసం వేట ఆరంభిస్తాయి. పేరెంట్స్‌ పక్షులు అవి తిన్నంత తిని గూటిలో ఉన్న పిల్ల పక్షుల కోసం తమ గొంతులోని ప్రత్యేక అరల్లో ఆహారాన్ని దాచి తెస్తాయి. ఇలా ఒక్కో పక్షి సుమారు అరకిలో వరకు చేప పిల్లలను సేకరించి సాయంత్రానికి గూటికి చేరుకుంటాయి. పక్షి పిల్లల నోటికి స్వయంగా తమ నోటి ద్వారా ఆహారాన్ని అందిస్తాయి.

జూలైలో తిరిగి ప్రయాణం..

ఈ పక్షులు ఏటా జనవరి మొదటి వారంలో ఇక్కడికి వస్తాయి. సంతానాన్ని పెంచుకుని తిరిగి జూలైలో తిరిగి సైబీరియా వెళ్లిపోతాయి. ఈ లోపు పిల్ల పక్షులు ఎదిగి తమంతట తాము ఆహారాన్ని సంపాదించుకోగలవు, వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు అనుకున్న తర్వాత తిరుగు ప్రయాణం మొదలెడతాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ పనులతో చెరువులు పటిష్టమయ్యాయి. దీంతో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. పక్షులకు తాగునీటి, ఆహారం ఇబ్బందులు లేకుండా ఉండటం కూడా పక్షులు ఇక్కడికి రావటానికి ఒక కారణం.     

పక్షులు రాకుంటే కరువు..

 గ్రామానికి వచ్చిన విదేశీ పక్షులను గ్రామస్తులు తమ పల్లెకు వచ్చిన అతిథుల్లా భావిస్తారు. వాటి జీవన శైలికి ఎలాంటి అవాంతరాలు కలిగించరు. పొలాలు, గట్ల మధ్య చెట్లు, నివాసాలు.. ఇలా ఎక్కడైన పక్షులు గూళ్లు నిర్మించుకుంటే వాటి జోలికి వెళ్లరు. ఏటా జనవరిలో పక్షులు గ్రామానికి వస్తే గ్రామస్తులు దాన్ని శుభసూచికంగా భావిస్తారు. రాకపోతే ఇక ఆ ఏడాదంతా కరువేనని నమ్ముతారు. పక్షుల వల్ల సాగు సమయంలో చీడ పీడల బాధ ఉండదని, పురుగు పుట్రను అవి ఆహారంగా తీసుకోవటం వల్ల పంటలకు మేలు జరుగుతుందని ఇక్కడి రైతులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఏడు దశాబ్దాల కింద నుంచే..

సంతానోత్పత్తి కోసం ఏటా చింతపల్లి గ్రామానికి సైబీరియన్‌ పక్షులు వస్తాయి. దాదాపు ఏడు దశాబ్దాల కింద నుంచే అవి ఏటా వస్తున్నట్లు ఫారెస్టు అధికారులు గుర్తించారు. పక్షులను చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు. వర్షాలు ముందుగా కురిస్తే చెరువులు నిండటం, చేప పిల్లలు పుష్కలంగా లభించటంతో ఇక్కడికి అతిథులుగా వచ్చిన పక్షులకు ఆహారం దొరుకుతుంది. ఈ ఏడాది కూడా పక్షులు వస్తున్నాయి.

-రాయపాటి రామకృష్ణ, బర్డ్‌ వాచర్‌, టూరిస్టు గైడ్‌, చింతపల్లి

కన్న బిడ్డలలాగే చూసుకుంటున్నాం..

మా గ్రామానికి వచ్చే సైబీరియా కొంగలను కన్న బిడ్డలలాగే చూసుకుంటున్నాం. పురుడు పోసుకోవడానికి వచ్చే బిడ్డల్లాగే జాగ్రత్తగా కాపాడుకుంటాం. వాటికి ఎలాంటి ఇబ్బంది కలుగనీయం. కొన్నిసార్లు పొలాల్లో క్రిమి సంహాకర మందు కలిసిన నీరు తాగి పక్షులు అనారోగ్యానికి గురవుతాయి. అటవీశాఖ అధికారులకు విషయం తెలిపి వాటిని కాపాడుతాం. 

- ముత్యం వెంకటేశ్వర్లు, చింతపల్లి గ్రామస్తుడు


VIDEOS

logo