మంగళవారం 02 మార్చి 2021
Khammam - Jan 17, 2021 , 02:46:07

టీకా సక్సెస్..

టీకా సక్సెస్..

  • 290 మంది హెల్త్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌
  • వైద్యుల పర్యవేక్షణలో వ్యాక్సిన్‌ తీసుకున్నవారు..
  • వ్యాక్సినేషన్‌ నిరంతర ప్రక్రియ: మంత్రి అజయ్‌
  • త్వరలో ప్రజలందరికీ టీకా 
  • ఉమ్మడి జిల్లాలో పది కేంద్రాలు

ఖమ్మం, (జనవరి 16, నమస్తే తెలంగాణ ప్రతినిధి : ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వైరస్‌ పనిపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ విజయవంతమైంది.. టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రధానమంత్రి మోదీ సందేశం తర్వాత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది కేంద్రాల్లో హెల్త్‌ వర్కర్లు టీకాలు వేయించుకున్నారు. ఖమ్మం నగరంలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సినేషన్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ప్రారంభించారు. వైద్యుల సమక్షంలో తొలి టీకాను హెడ్‌ నర్స్‌ సూర్యపోగు మేరి వేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు కోవిన్‌ యాప్‌లో టీకా కోసం 15,975 మంది రిజిస్ట్రర్‌ చేయించుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రితో పాటు నగరంలోని ముస్తాఫానగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వెంకటేశ్వరనగర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, బోనకల్‌, మధిర, సత్తుపల్లి కేంద్రాల్లో మొత్తం 170 మంది తొలి రోజు టీకా వేయించుకున్నారు. ఎవరికీ ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదు. వ్యాక్సినేషన్‌ విజయవంతమైనందుకు గాను వైద్యారోగ్యశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

అదృష్టంగా భావిస్తున్నా..

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా తొలిదశ, తొలిరోజు టీకాకు నేను ఎంపిక కావటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. కోవిన్‌ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారందరిలో నా పేరు రావడం లక్‌. స్వతహాగా వైద్యుడినే కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా టీకా వేయించుకున్నా.  ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 

- డాక్టర్‌ క్రాంతికిరణ్‌, జిల్లా ప్రధాన ఆసుపత్రి, ఖమ్మం 

నిర్భయంగా టీకా తీసుకున్నా..

ఎలాంటి భయాందోళన లేకుండా నేను వ్యాక్సిన్‌ వేయించుకున్నా. నెల రోజుల లోపు రెండో డోసు కూడా వేయించుకుంటా. కొవిన్‌ యాప్‌లో గత నెలలో రిజిస్టర్‌ చేయించుకున్నా. ప్రజలు వ్యాక్సిన్‌ పట్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. 

- డాక్టర్‌ ప్రణవణ, ఖమ్మం జిల్లా ఆసుపత్రి, ఖమ్మం 

టీకా పై అనుమానాలు వద్దు..

కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విరుగుడు కోసం వ్యాక్సిన్‌ను తీసుకురావటం అందరి అదృష్టం. తొలిదశ వ్యాక్సినేషన్‌లోనూ ముందున్నాం. ప్రజల అనుమానాలు తొలగిపోవాలని మేం వ్యాక్సిన్‌ తీసుకుంటున్నాం. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఎవరికీ అనుమానాలు అవసరం లేదు.

- ఎన్‌.ఉమ, స్టాఫ్‌ నర్స్‌, జిల్లా ప్రధాన ఆసుపత్రి, ఖమ్మం

వైరస్‌ను అరికట్టే ఆయుధం..

కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటే ప్రతిఒక్కరూ ధైర్యంగా టీకా తీసుకోవాల్సిందే. ఇది వైరస్‌ను ఎదుర్కొనే ఆయుధం. టీవీలు, సామాజిక మాధ్యమాల్లో వ్యాక్సినేషన్‌ గురించి చాలా తెలుసుకున్నా. నాకు ఎలాంటి సమస్య తలెత్తలేదు. నిర్భయంగా టీకా వేయించుకున్నా. అందరం టీకా వేయించుకుంటేనే వైరస్‌ను అరికట్టగలం.

- రవికిరణ్‌, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌, జిల్లా ప్రధాన ఆసుపత్రి, ఖమ్మం 


VIDEOS

logo