శనివారం 27 ఫిబ్రవరి 2021
Khammam - Jan 16, 2021 , 01:02:12

నేడే వ్యాక్సినేషన్‌

నేడే వ్యాక్సినేషన్‌

  • ఖమ్మం జిల్లాలో ఆరు కేంద్రాల ఏర్పాటు
  • 12,000 మందికి కరోనా వ్యాక్సిన్‌
  • ప్రతి కేంద్రానికి ఐదుగురు సిబ్బంది సేవలు
  • నేడు ప్రధాని మోదీ సందేశం తర్వాత వాక్సినేషన్‌
  • జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ప్రారంభించనున్న మంత్రి అజయ్‌

ఖమ్మం, జనవరి 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజలంతా ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం దేశవ్యాప్తంగా తొలి దశలో హెల్త్‌ వర్కర్లకు టీకా అందనుంది. 14వ తేదీన డీఎంహెచ్‌వో కార్యాలయంలోని ప్రత్యేక గదికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 12,800 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు వ్యాక్సిన్‌ అందనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో శనివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. 


జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాలు..

హెల్త్‌కేర్‌ వర్కర్లకు ఒక్కో కేంద్రం నుంచి తొలిదశలో 30 మంది చొప్పున ఆరు కేంద్రాల్లో 180 మందికి టీకా ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని ఆయూష్‌ భవన విభాగం, ఓల్డ్‌ ఎన్‌ఆర్సీ విభాగ భవనం, నర్సింగ్‌ ట్రైనింగ్‌ విభాగ భవనాన్ని ఒక కేంద్రంగా చేశారు. అలాగే నగరంలోని ముస్తఫానగర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, వెంకటేశ్వరనగర్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, బోనకల్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, మధిర జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, సత్తుపల్లి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను కేంద్రాలుగా ఎంపిక చేశారు. 

కేంద్రానికి ఐదుగురు సిబ్బంది..

ప్రతి కేంద్రంలో ఐదుగురు చొప్పున ఆరు కేంద్రాల్లో 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారు. టీకా ఆఫీసర్‌గా వైద్యుడు, ఏఎన్‌ఎం, స్టాప్‌ నర్సు ఉంటారు.  ఆఫీసర్‌-1గా పోలీసు సిబ్బంది వచ్చిన వారిని వెరిఫికేషన్‌ చేస్తారు.  ఆఫీసర్‌-2 గా ఐసీడీఎస్‌ సిబ్బంది కొ-విన్‌ యాప్‌లో వారి డాక్యుమెంట్‌ను వెరి ఫై చేస్తారు.  ఆఫీసర్‌ -3 వైద్యారోగ్యశాఖ సిబ్బంది వచ్చిన లబ్ధిదారులను భౌతికదూరం (6 అడుగులు) కూర్చో బెడతారు. టీకా అనంతరం 30 నిమిషాల పాటు ఉండే విధంగా చూస్తారు. వ్యాక్సినేషన్‌ ఆఫీసర్‌ -4గా ఓవర్‌ లోడింగ్‌ లేకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్నెట్‌ సదుపాయం, ఇతర అంశాలను ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తారు. అనంతరం వ్యాక్సినేషన్‌ గదిలో ఏఎన్‌ఎం హెల్త్‌ వర్కర్స్‌కి వ్యాక్సిన్‌ ఇస్తారు. వ్యాక్సినేషన్‌ తర్వాత అబ్జర్వేషన్‌ హాలులో 30 నిమిషాల పాటు సదరు హెల్త్‌ వర్కర్‌ పర్యవేక్షణలో ఉంటారు. అనారోగ్య సమస్యలు (ఎలర్జీ, జ్వరం, ఇతర సమస్యలు) వస్తే వెంటనే అందుబాటులో ఉన్న వైద్యుడు చికిత్స అందిస్తారు. ఒకవేళ ఇంటికి వెళ్లాక ఏదైనా సమస్య తలెత్తితే 108కు కాల్‌ చేస్తే సమీప పీహెచ్‌సీలో చికిత్స అందుతుంది. 

అందుబాటులో 1,530 డోసులు

తొలి రోజు జిల్లాలోని ఆరు కేంద్రాల్లో 180 మందికి వ్యాక్సిన్‌ అందనుంది. ఒక్కో వయల్‌లో 10 డోసులు ఉంటాయి. ఇలా 153 వయళ్లలో 1,530 డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 17న వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రభుత్వం విరామం ఇవ్వగా, తిరిగి 18వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాల్లో, కేంద్రానికి వంద మంది చొప్పున వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. వ్యాక్సిన్లు రెండు రోజులకు ఒకసారి హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రానికి ప్రత్యేక వాహనంలో వస్తాయి. 

పీఎం మోదీ సందేశం తర్వాత ప్రారంభం..

దేశవ్యాప్తంగా హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వర్చువల్‌ వ్యాక్సిన్‌ పంపిణీపై శనివారం ఢిల్లీ నుంచి సందేశం ఇవ్వనున్నారు. ఈ సందేశం సామాజిక మాధ్యమాలు, టీవీల ద్వారా ప్రారంభం కానుంది. అనంతరం వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది.

జిల్లా ఆసుపత్రిలో పోస్ట్‌ వ్యాక్సినేషన్‌ వార్డ్డు..

వ్యాక్సినేషన్‌ అనంతరం ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారిని వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించనున్నారు. ఆరు అబ్జర్వేషన్‌ వార్డులతో పాటు పోస్ట్‌ వ్యాక్సినేషన్‌ ఎమర్జెన్సీ వార్డు అందుబాటులోకి ఉంది. దీనిలో పురుషుల కోసం ఎనిమిది పడకలు, మహిళలకు ఆరు పడకలు అందుబాటులో ఉన్నాయి. ఒక వైద్యుడు, నర్స్‌లు వైద్య సేవలందిస్తారు. తొలి డోస్‌ తీసుకున్న 30 రోజుల తరువాత రెండో డోసు తీసుకుంటారు.

అందుబాటులో అంబులెన్స్‌లు..

వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 108 వాహనాలు 13, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు నిధులతో ఏర్పాటు చేసిన 6 ప్రత్యేక అంబులెన్స్‌లు, 104 వాహనాలు, ఆర్బీఎస్‌కే వాహనాలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటాయి. 

వ్యాక్సినేషన్‌ కేంద్రాల పర్యవేక్షణ : మయూరిసెంటర్‌, జనవరి 15 : నగరంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, వెంకటేశ్వరనగర్‌ యూపీహెచ్‌సీ కేంద్రాలను శుక్రవారం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు సందర్శించారు. శనివారం లాంఛనంగా ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై ఆరా తీశారు. రిజిస్ట్రేషన్‌, వెయిటింగ్‌, వ్యాక్సినేషన్‌, అబ్జర్వేషన్‌ గదులను పరిశీలించారు. ప్రధాన మంత్రి మోదీ సందేశాన్ని తిలకించేందుకు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 108 అంబులెన్స్‌, రియాక్షన్‌ ట్రీట్‌మెంట్‌ కిట్‌ అందుబాటులో ఉంచాలన్నారు. తప్పనిసరిగా సీనియర్‌ వైద్యాధికారి పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తారన్నారు. వారి వెంట అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డీఎంహెచ్‌వో మాలతి, ప్రధాన ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి అలివేలు తదితరులున్నారు.

కరోనా వ్యాక్సినేషన్‌కు పక్కాగా ఏర్పాట్లు 

ఇల్లెందు, జనవరి 15: కరోనా వ్యాక్సినేషన్‌కు ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వరుణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లను ఆరా తీశారు. శనివారం 30 మందికి వాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్‌ అన్నారు. అనంతరం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. బుగ్గవాగు బ్రిడ్జి వద్ద చేపల విక్రయిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థి ప్రదీప్‌ను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. యువతకు ఆదర్శంగా నిలిచావంటూ కితాబిచ్చారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్‌ చైర్మన్‌ జానీపాష తదితరులున్నారు.

భద్రాద్రి జిల్లాలో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

కొత్తగూడెం, జనవరి 15 : భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించే కరోనా వ్యాక్సినేషన్‌కు వైద్యాధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. అదనపు కలెక్టర్‌ అనుదీప్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైద్యులు, వైద్యాధికారుల సమక్షంలో ప్రత్యేక అంబులెన్స్‌లో తీసుకొచ్చిన ఈ వ్యాక్సిన్‌ను బాక్సులను సురక్షితంగా జిల్లా ఆస్పత్రిలో భద్రపరిచారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పాత కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం కేంద్రాల్లో హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ అందనుంది. ఒక్కో సెంటర్‌లో 30 మందికి చొప్పున తొలిరోజు మొత్తం 120 మందికి టీకా అందనుంది.


VIDEOS

logo