గురువారం 04 మార్చి 2021
Khammam - Jan 03, 2021 , 03:11:36

కాలువలను మింగేశారు..

కాలువలను మింగేశారు..

  • ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..
  • ‘మామూలు’గా తీసుకుంటున్న రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు
  • ఖమ్మం రూరల్‌ మండలంలో యథేచ్ఛగా ఆక్రమణలు 
  • ఇండ్లలోకి చేరుతున్న కాల్వ నీరు

ఖమ్మం, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఖమ్మం రూరల్‌ మండలంలో రియల్‌ ఎస్టేట్‌ మాఫియా కబ్జాలకు కేంద్రంగా మారింది. ప్రభుత్వ, అసైన్డ్‌, పంచరాయి, శిఖం, భూముల కబ్జాలే కాకుండా ఏకంగా ఎన్నెస్పీ, ఇరిగేషన్‌ శాఖల పరిధిలో ఉండే పంట కాలువలు, వాగులను సైతం మింగేస్తున్నారు. ఈ ఆక్రమణల విషయం రెవెన్యూ, ఇరిగేషన్‌, ఎన్నెస్పీ అధికారులకు తెలుస్తున్నప్పటికీ వారు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లను వేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లు అమ్మిన తర్వాత కొనుగోలు చేసిన వారికి సమస్యలు తలెత్తడంతో ఆక్రమణల, అక్రమాల తంతులు బయటపడుతున్నాయి. వ్యాపారులు తాము కొనుగోలు చేసిన భూముల్లో ఉండే ఎన్నెస్పీ, ఇరిగేషన్‌ కాలువలు సహజ సిద్ధంగా ఏర్పడే వాగులను కబ్జా చేసి వారు కొనుగోలు చేసిన భూముల్లో మట్టితో కప్పేస్తున్నారు. చెరువులు కింద రియల్‌ వ్యాపారం వెంచర్లు వేసేటప్పుడు చెరువు అలుగు ద్వారా లేదా తూముల ద్వారా వెళ్లే పంట కాలువలు, వాగులను మినహాయించాలని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ అవేవి పట్టని రియల్‌ వ్యాపారులు ఆయా చెరువుల కింద ఉండే అలుగు కాలువలు, తూము కాలువలను పూడ్చేస్తున్నారు. ఖమ్మం రూరల్‌ మండలంలోని ఏదులాపురం, పెద్దతండా, గుర్రాలపాడు, వెంకటగిరి, రెడ్డిపల్లి, మద్దులపల్లి, ఆరెంపుల, పోలేపల్లి, బారుగూడెం తదితర గ్రామాల్లో ప్రభుత్వ పంట కాలువలు, వాగులు చెరువు శిఖం భూములు కబ్జాలకు గురవుతున్నాయి. దీంతో నిబంధలకు విరుద్ధంగా చేసిన వెంచర్లలో ఇండ్ల స్థలాలు, ఇండ్లను కొనుగోలు చేసిన ప్రజలకు వర్షాకాలం, ఇతర ప్రత్యేక సందర్భాల్లో చెరువులను నీటితో నింపినప్పుడు రియల్టర్లు పూడ్చిన వాగుల్లో నీరు ముందుకు వెళ్లకుండా ఇండ్ల మధ్యలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఆ శాఖల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి చూసి ఆ సమస్యకు తాత్కలిక పరిష్కారం చూపి సరిపెడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని ఈ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. 

ఒకరిపై ఒకరు..

రెవెన్యూ అధికారులు ఐబీ అధికారుల మీద, ఐబీ అధికారులు రెవెన్యూ శాఖపై ఒకరిపై ఒకరు విషయాన్ని నెట్టుకుంటూ ఇన్నాళ్లూ  గుడుపుతున్నారు. ఈ గతంలో ఇక్కడ పనిచేసిన మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అక్రమ వెంచర్లు వెలిశాయని, కన్వర్షన్లు, లే - అవుట్లు లేకుండానే ఈ ప్రాంతంలో అక్రమాలు జరిగాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ భూమికి పక్కన కాలువ ఉందా? లేదా చెరువు ఉందా ? అనే విషయాన్ని చూడకుండానే అధికారులు అనుమతులు ఇచ్చినట్లు స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి.

కబ్జాకు గురైన పంట కాలువ 

ఖమ్మం రూరల్‌ మండలంలోని ఏదులాపురం రెవెన్యూ పరిధిలో 80 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఆ చెరువు అలుగు పోస్తే వరద నీరు మున్నేటిలో కలవడానికి 60 అడుగుల వెడల్పుతో రెండు వరద కాలువలు ఉండేవి. రియల్‌ వ్యాపారులు ఆ వరద కాలువను అక్రమించి వెంచర్లు వేసినట్లు, ఈ కాలువలపైనే పెద్ద పెద్ద బోర్లు వేసి ఇంటి నిర్మాణాలను చేపట్టారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఆక్రమణలను పరిశీలించిన అధికారులు..

 ఖమ్మం రూరల్‌ మండలంలోని ఏదులాపురం రెవెన్యూ పరిధిలో ఏదులాపురం చెరువు  నుంచి శుక్రవారం నీటిని దిగువకు పంట కాలువ ద్వారా వదలడంతో ఆ నీరు కబ్జాకు గురైన కాలనీ వరకు చేరాయి. నీరు ముందుకు కదలకపోవటంతో ఆ ప్రాంతమంత జలమయమైంది. దీంతో శనివారం అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చెరువు అలుగు కాలువలు రెండు కబ్జాకు గురైనట్లుగా గుర్తించారు. 

సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తాం 

పంట కాలువలు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించాం. ప్రభుత్వ నిబంధనల మేరకు రెవెన్యూ, సర్వే బృందంతో ప్రత్యేక సర్వేను నిర్వహిస్తాం. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని గుర్తిస్తాం. కట్టడాలు కానీ ఇతర ఏ ఆక్రమణలు ఉన్నా తొలగించి పంట కాలువను పునరుద్ధరిస్తాం.

- ఇరిగేషన్‌ డీఈ అర్జున్‌


VIDEOS

logo