అంతరపంట అదిరింది

- మమిడి తోటలో జామ తోట సాగు
- 14 నెలలకే దిగుబడి.. సిరులు కురిపిస్తున్న పంట
- ఉద్యాన శాఖ సూచనలు పాటించిన కొమరారం రైతు సక్సెస్
ఇల్లెందు రూరల్: సంప్రదాయ పంటల సాగుతో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించారు. ప్రభుత్వ సూచనలు, అందిస్తున్న ప్రోత్సాహంతో ఇల్లెందు ఏజెన్సీలో కూరగాయలు, పూలు, పండ్ల తోటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీనికి అనుగుణంగా ఉద్యాన శాఖ సైతం తరచూ కొత్త పంటలను పరిచయం చేస్తూ రైతులను చైతన్యపరుస్తున్న తీరు సత్ఫలితాలనిస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా కూరగాయల సాగుకు కేంద్ర బిందువుగా ఉన్న ఇల్లెందు ఏజెన్సీలో క్రమంగా పూలసాగు, పండ్ల తోటల సాగుపై రైతులు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే ఉద్యాన శాఖ ప్రకటనకు స్పందించిన కొమరారం ప్రాంత రైతు మామిడితోటలో అంతరపంటగా జామ సాగు చేపట్టి మంచి దిగుబడి సాధించాడు.
మూడు ఎకరాల విస్తీర్ణంలో..
కడెం నర్సరీ నుంచి 900 తైవాన్, సపేతా రకాలకు చెందిన జామ మొక్కలు కొనుగోలు చేశాడు. వీటిని మామిడి మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నాటాడు. ఉచిత కరెంట్ అందుబాటులో ఉండటంతో క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్లు పెట్టుకుంటూ ఉద్యాన శాఖ సూచన మేరకు మంచి ఫలితం సాధించాడు.
14 నెలలకే అద్భుత ఫలితాలు..
జామ మొక్క నాటిన ఆరు నెలలకే పూత వచ్చింది. కానీ మొక్క కొమ్మలు విరిగిపోతాయని అధికారులు సూచించడంతో పూత తొలగించాడు. మళ్లీ 14 నెలలకు పూత వచ్చింది. పూత నిలిచి ఉండేలా సమగ్రంగా యాజమాన్య పద్ధతులు పాటించాడు. ఒక్కో మొక్కకు వందకు మించి కాయలు కాయడం రైతుకు ఆనందాన్నిచ్చింది. అప్పటివరకు కూరగాయల సాగు చేసిన రైతు భూషయ్య జామ పంటను మార్కెట్ చేయడం ఎలాగో తెలియక తోటను ఓ చిరు వ్యాపారికి ఒక పంటకు రూ.లక్షకు విక్రయించాడు. కానీ సదరు వ్యాపారి ఇప్పటికే రూ.3 లక్షల ఆదాయం పొందాడు. చెట్లమీద ఉన్న కాయలను బట్టి మరో రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుందని వ్యాపారి పేర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా జామ పంట ఏడాదికి రెండు కాతలు కాస్తుంది. ఈ లెక్కన జామ సాగు చేస్తున్న రైతు స్వయంగా విక్రయాలు చేపడితే ఎటు లేదన్నా ఏడాదికి రూ.6 లక్షలకు మించి లాభాలు పొందే అవకాశం ఉంది.
మార్కెటింగ్ సౌకర్యం ఉంటే మరిన్ని లాభాలు
సంప్రదాయ పంటల సాగులో ఆశించిన మేర దిగుబడి లేకపోవడం, కూలీల వేతనాలు తలకు మించిన భారం కావడం వల్లే మూడు ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట వేశా. తోట కాపుకు వచ్చేందుకు నాలుగేళ్ల వ్యవధి ఉండటంతో ఖాళీగా ఉండలేక ఉద్యాన శాఖ సూచనతో అంతరపంటగా జామ సాగు ప్రారంభించా. కేవలం 14 నెలల వ్యవధిలోనే పంట చేతికొచ్చింది. పెట్టుబడి తక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన దానికంటే మంచి లాభాలు వచ్చాయి. మార్కెటింగ్ సౌకర్యం సక్రమంగా ఉంటే మరిన్ని లాభాలకు అవకాశం ఉంటుంది. మరింత మంది రైతులు జామ సాగు చేపడితే బాగుంటుంది.
- కరకపల్లి భూషయ్య, రైతు, కొమరారం, ఇల్లెందు మండలం
తాజావార్తలు
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు
- లోఫ్రెషర్ సమస్యకు శాశ్వత పరిష్కారం
- రోజు విడిచి రోజు నీరు: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
- బాలల పరిరక్షణకు చర్యలు
- మౌలిక వసతుల కల్పనకు కృషి
- రేణుకా ఎల్లమ్మదేవి కల్యాణ మహోత్సవం
- లాఠీ..సీటీతో చెత్తపై సమరం!
- ఏప్రిల్ 13 నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు