గురువారం 21 జనవరి 2021
Khammam - Dec 04, 2020 , 03:17:17

ఆనందంగా సాగుతూ..

ఆనందంగా సాగుతూ..

  • నేటి వరకు 8,582 ఎకరాల్లో పనులు ప్రారంభం
  • ఖమ్మం జిల్లాలో 2.78 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,07,265 ఎకరాలు 
  • టీ సీడ్స్‌ కార్పొరేషన్‌ ద్వారా విత్తనాల పంపిణీ 
  • సాగుకు సరిపడా నీటి వనరులు

ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడెం: ఒక వైపు వానకాలం సాగు చేసిన పంట చేతికి వస్తున్న తరుణంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు యాసాంగి సాగును షురూ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అదే విధంగా సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా జిల్లా రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేపట్టారు. వరిలో సన్నరకం సాగు అధికంగా జరగడం, మక్కకు దూరంగా ఉండడం విశేషం. ఒకవైపు విస్తారంగా వర్షాలు కురవడం, మరోవైపు సాగర్‌ నిరంతరం అందడం వంటి కారణాలతో అన్నదాతలు అడ్డమడి తప్పిపోకుండా సాగు చేశారు. దీంతో వానకాలం సీజన్‌లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5,60,375 ఎకరాల్లో సాగు జరిగింది. ఈ సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక తయారు చేసింది. 2,78,234 ఎకరాల్లో సాగు కావచ్చని అంచనా వేసింది. అందులో భాగంగానే ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 8,582 ఎకరాల్లో రైతులు సాగు మొదలు పెట్టడం విశేషం. వీటిలో పెసర 1,528 ఎకరాలు, వేరుశనగ 1,881 ఎకరాలు, ఇతర పంటలు మరో 4,933 ఎకరాలు ఉన్నాయి. సీజన్‌కు అవసరమైన పలు రకాల విత్తనాలు తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ ద్వారా, ఎరువులను మార్క్‌ఫెడ్‌ నుంచి ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నారు.ఖమ్మం జిల్లాలో 

2.78 లక్షల ఎకరాల సాగు లక్ష్యం

ఈ సంవత్సరం వానకాలం సీజన్‌లో మాదిరిగానే యాసంగి సీజన్‌లో సైతం వరి ప్రధాన పంటగా సాగు కానుంది. ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తయారు చేసిన యాసంగి సాగు కార్డు ప్రకారం వరి 2,25,387 లక్షల ఎకరాలు, జొన్న 1,357 ఎకరాలు, పెసర 21,124 ఎకరాలు, మినుము 6,081 ఎకరాలు, కంది 90 ఎకరాలు, బొబ్బర్లు 169 ఎకరాలు, జనుము 255 ఎకరాలు, వేరుశనగ 6,761 ఎకరాలు, ఆయిల్‌ఫాం 990 ఎకరాలు, మిర్చి 6,356 ఎకరాలు, చెరుకు 2,707 ఎకరాలు, కూరగాయలు 2,765 ఎకరాలు, పండ్లతోటలు 1,660 ఎకరాలు, ఇతర పంటలు మరో 15,512 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. 

పుష్కలంగా సాగునీటి వనరులు

ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం యాసంగికి సాగునీరు పుష్కలంగా ఉంది. వానకాలం ఆరంభంలో ఆశించిన మేర వర్షపాతం నమోదైంది. విస్తారంగా వర్షాలు కురవడంతో వానకాలం పంటలేగాక ఇప్పుడు యాసంగి పంటలు సైతం సాగు చేసుకునే పరిస్థితి ఉంది. అలాగే సాగర్‌ జలాల ద్వారా కూడా యాసంగి సీజన్‌కు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. భూగర్భ జలాలు పెరగడంతో బోరు బావులు, ఓపెన్‌ బావుల్లో సైతం ఊటలు పెరిగాయి. 

భద్రాద్రి జిల్లాలో 1,07,265 ఎకరాల లక్ష్యం

భద్రాద్రి జిల్లాలో వరి 74,650 ఎకరాలు, జొన్నలు 2653 ఎకరాలు, చిరుధాన్యాలు - 10 ఎకరాలు, పెసలు - 4569 ఎకరాలు, మినుములు 3380 ఎకరాలు, కందులు - 26 ఎకరాలు, బొబ్బర్లు - 23 ఎకరాలు, ఇతర ధాన్యాలు - 1486 ఎకరాలు, వేరుశనగలు - 4956 ఎకరాలు, నువ్వులు - 1821 ఎకరాలు, పామాయిల్‌ - 3700 ఎకరాలు, పొగాకు - 1621 ఎకరాలు, చెరుకు - 402 ఎకరాలు, మిర్చి - 4401 ఎకరాలు, కూరగాయలు - 3038 ఎకరాలు కలిపి మొత్తం 1,07,265 ఎకరాల్లో రైతులు యాసంగిలో పంటలు సాగు చేయనున్నారు.

యాసంగికి ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

వానకాలం కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే రైతులకు యాసంగిలో కూడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు సరిపడా నిల్వలు ఉండాలని సూచించారు. అవసరాలను బట్టి రైతులకు కూపన్లు అందజేయాలని సూచించారు.

చెరువుల్లో సరిపడా నీరు..

పంటలకు సరిపడా వర్షాలు కురవడంతో వానకాలం పంటలు ఈ ఏడాది పుష్కలంగా పండాయి. మిషన్‌కాకతీయ చెరువుల్లో ఇప్పటికే నీరు చేరడంతో అది యాసంగి పంటల సాగుకు సైతం ఉపయోగపడనుంది. భద్రాద్రి జిల్లాలో 2396 చెరువులు ఉండగా అందులో 1071 చెరువులు 75 శాతం నుంచి వంద శాతం నీటి సామర్థ్యం కలిగి ఉన్నాయి. మరో 362 చెరువులు పూర్తి స్థాయి నీటి మట్టం కలిగి ఉన్నాయి. ఇంకో 587 చెరువులు 50 శాతం నుంచి 75 శాతం నీటిని కలిగి ఉన్నాయి. ఇంకో 289 చెరువులు 25 శాతం నుంచి 50 శాతం లోపు నీటితో ఉన్నాయి. 25 శాతం లోపు నీటిని కలిగి ఉన్న చెరువులు 87 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం యాసంగికి రైతులు వేసే పంటలకు ఎలాంటి ఢోకాలేదు. 

యాసంగికి ఏర్పాట్లు చేశాం..

నిరుటితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 12 శాతం సాగు విస్తీర్ణాన్ని పెంచాం. రైతులకు ఎలాంటి సమస్యలూ లేకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. చెరువుల్లో యాసంగికి పుష్కలంగా సాగునీరు ఉంది.  

-కొర్సా అభిమన్యుడు. డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం


logo