ఆదివారం 24 జనవరి 2021
Khammam - Dec 03, 2020 , 02:36:29

కుట్రపూరితంగానే నాపై బీజేపీ కార్యకర్తల దాడి

కుట్రపూరితంగానే  నాపై బీజేపీ కార్యకర్తల దాడి

  • అబద్దాలను నిజం చేయడానికి కుట్రలు పన్నారు

u మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లోని కేపీహెచ్‌పీ కాలనీలో తనపై కుట్రపూరితంగానే బీజేపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆరోపించారు. బుధవారం ఖమ్మంలోని ఐటీ హబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బాచ్‌పల్లిలోని మెడికల్‌ కళాశాలకు వెళ్తుండగా ఒక్కసారిగా సుమారు రెండు వందల మంది బీజేపీకి చెందిన వ్యక్తులు దాడికి దిగారన్నారు. ఈ దాడి నుంచి తన సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తనను రక్షించారని చెప్పారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తాను వ్యవహరిస్తూ కళాశాలకు వెళ్తుండగా పోలింగ్‌ బూత్‌కు వెళ్తున్నానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దాడి చేయడం అమానుషమన్నారు. తాను ఎంతో సమయమనంతో ఉన్నానని అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వైరల్‌ చేశారని ఆరోపించారు. అబద్దాలను  నిజం చేయడానికి బీజేపీ కుట్రలు పన్నిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏ ఎన్నికల్లో జరగని విధంగా టెన్షన్‌ క్రియేట్‌ చేయడానికి కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే నిర్ణయంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడడం జరుగుతున్నదని అన్నారు. క్యాబినేట్‌ మంత్రిపై దాడి జరిగినా కూడా ఎన్నికల సంఘం పోలింగ్‌ను ప్ర శాంతంగానే నిర్వహించారన్నారు. సం ఘటనకు సంబంధించి ఎన్నికల అధికారులు, పో లీసులు, మీడియా మిత్రులు అక్కడ వీడియో తీశారని దారిలో వెళ్తున్న తనపై దాడి చేసిన క్లిపింగ్‌ పరిశీలిస్తే స్పష్టమవుతుందన్నారు.  తమ పార్టీ అప్పగించిన పనులను, ప్రభుత్వం ఇచ్చిన వ్యవహారాలను బాధ్యతగా నిర్వర్తిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

మగ్దూం భవన్‌లో బంట్రోతును కాను..  కేసీఆర్‌ క్యాబినేట్‌లో మంత్రిని 

తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాను మగ్దూం భవన్‌లో నారాయణ పెట్టిన బంట్రోతును కాదని సీఎం కేసీఆర్‌ క్యాబినేట్‌లో మంత్రినని అన్నారు. నారాయణ బీజేపీలో ఎప్పుడు చేరారో తనకు తెలియదని చురక వేశారు. ఆయన బీజీపీ దాడిని సమర్థిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. నేను బూత్‌ వద్ద ఉన్నానా లేదా అని తెలుసుకొని బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు. తాను రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చానని దానికణుగుణంగా వ్యవరిస్తానని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ డబ్బులు పంచాల్సిన అవసరం ఏమీ లేదని బీజేపీవాళ్లు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను రాష్ట్ర మంత్రినని తనకు హైదరాబాద్‌లో ప్రభుత్వం నివాసానికి అవసరమైన క్వార్టర్‌ను కేటాయించిందని అందువల్లనే తాను అ క్కడ ఉన్నానని చెప్పారు. తాను పోలింగ్‌ బూత్‌కి వెళ్లినట్లు నిరూపించాలి తప్ప కాన్వాయ్‌పై దాడికి దిగడం ఏమిటని ప్రశ్నించారు.

జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్‌దే..

బీజేపీ ఎన్ని కుట్రలకు పాల్పడినా జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ విజయం తథ్యమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ప్రజలు అభివృద్ధిని గుర్తించి తమకు అండగా నిలిచారని అన్నారు. అసహనంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా తాము సంయమనంతో వ్యవహరించి సామరస్యతను చాటామన్నారు. కుట్రలు చేయాలనే యోచనతో క్యాబినేట్‌ మంత్రినైన తనపైనే దాడికి దిగి విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నించినప్పటికీ బాధ్యతాయతంగా వ్యవహరించామన్నారు. గతంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా 49.27 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైందని అన్నారు. సాధారణ ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌ నగరంలో 50 శాతం పోలింగ్‌ మించిన సందర్భాలు లేవని అన్నారు. దీంతోనే ఈ సారి కూడా పోలింగ్‌ సరళిలో కొంత మార్పు చోటు చేసుకుందని అన్నారు. 

  ఎమ్మెల్సీ బాలసాని ఖండన

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై బీజేపీ కార్యకర్తల దాడిని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హక్కులను హరించే విధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదని, కావాలనే మంత్రులను అడ్డుకోవడం, దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పూనుకుంటున్నదని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీలో సీట్లు సాధించాలనే భ్రమలో బీజేపీ ఉందని వారికి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన చెప్పారు. సమావేశంలో నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, శిక్షణ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ ఇన్‌చార్జ్‌ ఆర్జేసీ కృష్ణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, పలువురు కార్పొరేటర్లు  పాల్గొన్నారు.logo