సోమవారం 25 జనవరి 2021
Khammam - Dec 02, 2020 , 03:38:35

కూడళ్లకు కొత్తకళ..

కూడళ్లకు కొత్తకళ..

  • ‘పాలెం’ రోడ్డులో కనువిందు చేస్తున్న రైతు దంపతులు, యాపిల్‌ బొమ్మలు

ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలం రఘునాథపాలేనికి కొత్తందం వచ్చింది. మండల కేంద్రంగా ఇల్లెందు ప్రధాన రహదారి నూతన సొబగులను అద్దుకుంది. మంత్రి అజయ్‌ కుమార్‌ రఘునాథపాలేన్ని అందంగా ముస్తాబు చేశారు. మొన్నటి వరకూ డబుల్‌ రోడ్డుతో వాహనదారులను ఇక్కట్లకు గురిచేసిన రహదారి.. ఇప్పుడు నాలుగులైన్లుగా రూపుదిద్దుకుంది. అంతేకాదు ఫోర్‌లైన్‌కు మధ్యలో డివైడర్‌..

అందులో అందమైన పూలమొక్కలు.. రాత్రిళ్లు వాహనదారులకు వెలుగులను ప్రసాదించేందుకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు జరిగింది. వీటన్నింటితో రఘునాథపాలెం ప్రధాన రోడ్డుకే అందం వచ్చింది. ఇదంతా ఒక ఎత్తయితే.. రఘునాథపాలెం బైపాస్‌ సర్కిల్‌, కోయచలక క్రాస్‌ రోడ్డు కూడళ్లు కొత్త అందాలను రూపుదిద్దుకున్నాయి. ఆయా సర్కిళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా వాహనదారుల మనస్సులను దోచుకుంటున్నాయి. రఘునాథఫాలెం సర్కిల్‌లో యాపిల్‌ విగ్రహం. కోయచలక క్రాస్‌ రోడ్డులో రైతు దంపతులు కట్టెలకు వెళ్లొస్తూ కనిపించే విగ్రహాలకు వెనుక భాగంలో భారతదేశ చిత్రపటం ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంది. పట్టణాన్ని తలపించేలా రఘునాథపాలెం ముఖచిత్రం కనిపిస్తుండటంతో గత కొద్దిరోజులుగా అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు కూడళ్లలో ఆగి మరీ అక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆశ్చర్యంగా చూసి మురిసిపోతున్నారు. 

   -రఘునాథపాలెం 


logo