బుధవారం 20 జనవరి 2021
Khammam - Nov 30, 2020 , 00:43:12

కనులఎదుట కలల వారధి

కనులఎదుట కలల వారధి

  • రెండు రాష్ర్టాలకు  అనుసంధానంగా ధంసలాపురం ఆర్వోబీ
  •  రూ.77 కోట్ల నిధులతో  నిర్మాణం 
  • ముస్తాఫానగర్‌లో ‘ఫోర్‌లైన్‌' రహదారి 
  • మంత్రి అజయ్‌ చొరవతో  నెరవేరిన కల
  •  2వ తేదీన మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభోత్సవం

ఒకప్పుడు ముస్తఫానగర్‌కు వెళ్లాలంటే నగరవాసులు ఇబ్బందిపడేవారు.. అస్తవ్యస్తమైన రోడ్లతో అధ్వానంగా ఉండేది.. బోనకల్లు, చింతకానికి వెళ్లాలన్నా, ఆంధ్రాకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం. దీంతో ట్రాఫిక్‌ కూడా భారీగా ఉండేది.. ప్రయాణికులు నానా అవస్థలు పడి నగరం దాటేవారు.. ధంసలాపురం వద్ద ఆర్వోబీ పనులు ప్రారంభించాక ఇక ఈ ప్రాంతపు రూపురేఖలే  మారిపోయాయి.. అటు వెళ్లే రహదారి అంతా ఫోర్‌లైన్‌ అయింది.. సెంట్రల్‌ లైటింగ్‌ వచ్చింది.. డివైడర్లు ఏర్పడ్డాయి.. పచ్చదనం  పరుచుకుంటోంది.. దీంతో ఆ ప్రాంతవాసుల కష్టాలు తీరిపోయాయి.. కాగా ఈ నెల 2వ తేదీన మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఆర్వోబీ ప్రారంభం కానుంది.. అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు..   

 - ఖమ్మం

ఖమ్మం : ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయవాడ మార్గంలో ఖమ్మం రావడానికి ప్రధాన రహదారి అయిన ధంసలాపురం వద్ద రైల్వే గేటు వద్ద ఇరు ప్రాంతాలకు చెందిన వాహనదారులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ స్వరాష్ట్రం వచ్చినాకే ఈ రాష్ట్ర ప్రభుత్వం కలను సాకారం చేసింది. మూడేళ్ల నుంచి చేపట్టిన పనులన్నీ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం రూ.77 కోట్ల నిధులు విడుదల చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. నిర్మాణం కోసం అధికారులు పది ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. అదేవిధంగా అప్రోచ్‌రోడ్డు నిర్మాణానికి మరో 20 కుంటల భూమిని రైతుల నుంచి తీసుకున్నారు. 

అవరోధాలను అధిగమించి..

బ్రిడ్జి పనులు ప్రారంభించి మూడేండ్లు అయినా మధ్యలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు చేయించటానికి వెనుకంజ వేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అజయ్‌కుమార్‌ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి విషయం తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించారు. బిల్లులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పడంతో సదరు కాంట్రాక్టర్‌ తిరిగి పనులు ప్రారంభించారు.

మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

వచ్చే నెల 2న రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా బ్రిడ్జి ప్రారంభం కానుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ప్రచారంలో బిజీ, బిజీగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. 1న గ్రేటర్‌ ఎన్నికలు పూర్తి కాగానే మరుసటి రోజు మంత్రి కేటీఆర్‌ నగర పర్యటనకు రానున్నారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి అధికార శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.

జంక్షన్‌లో ప్రొఫెసర్‌  జయశంకర్‌ విగ్రహం


బిడ్జ్రి జంక్షన్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. స్వరాష్ట్ర సాధనలో ముఖ్యభూమిక పోషించిన సార్‌ విగ్రహం ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ వైతాళికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి విధితమే. దీనిలో భాగంగా నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. రెండు రాష్ర్టాలకు మధ్య ఉన్న ఈ వారధి సమీపంలో ప్రభుత్వం ఈ విగ్రహం ఏర్పాటు చేయడంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.

సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు..


బ్రిడ్జి నుంచి ముస్తాఫానగర్‌ సెంటర్‌ వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. అందమైన రోడ్డు, మధ్యలో డివైడర్లు, విశాలమైన ప్రాంతం, డివైడర్ల మధ్యలో ఆహ్లాదాన్ని పంచే మొక్కలతో అందంగా కనిపిస్తోంది. సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల నిర్మాణానికి అధికారులు రూ.2 కోట్ల నిధులను వెచ్చించారు. మంత్రి పువ్వాడ చొరవతో ముస్తాఫానగర్‌ వాసుల కష్టాలు తీరిపోయాయి.

విశాలమైన ‘ఫోర్‌లైన్‌'


బ్రిడ్జి నుంచి ముస్తాఫానగర్‌ సెంటర్‌ వరకు మూడు కిలోమీటర్ల మేర ఫోర్‌లైన్‌ రోడ్డు ఏర్పాటైంది. దీనికి ఇరువైపులా 8.75 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు నిర్మించడంతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి.రోడ్డు విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా స్థలాలను ప్రభుత్వానికి అప్పగించారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైన్‌కూడా నిర్మించడం వల్ల ఆ ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు కూడా పరిష్కారం లభించింది.

 ప్రజల బాధ తీరింది..  


ఇరుకైన రోడ్డు, గుంతల రోడ్డు నిత్యం మురికి నీటితో ఇబ్బంది పడిన మా ప్రాంత ప్రజలకు మంత్రి పువ్వాడ కృషి కారణంగా నాలుగులైన్ల రోడ్డు ఏర్పడింది. దీనివల్ల ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్ల ఏర్పాటుతో ఆప్రాంతం అందంగా రూపుదిద్దుకుంది. దీనివల్ల స్థలాల ధరలు పెరిగి మంచి డిమాండ్‌ వచ్చింది.ధంసలాపురం గేటువద్ద ఆర్‌వోబీ నిర్మించడం వల్ల దూరప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఆర్‌యూబీ వల్ల స్థానిక ప్రజలతో పాటు నగరానికి దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకు ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. మంత్రి పువ్వాడ కృషి వల్ల పనులు వేగంగా జరగడం సంతోషకరం. 
-రాచమళ్ల ప్రశాంత్‌ , స్థానికుడు


logo