జిల్లావ్యాప్తంగా ముసురు

- వర్షాలతో వరి, పత్తి చేలకు నష్టం
- కొనుగోలు కేంద్రాల్లోని పంటకు కూడా...
- మందస్తు హెచ్చరికలతో రైతులు అప్రమత్తం
- నేడు, రేపు ఖమ్మం మార్కెట్‌కు సెలవు
ఖమ్మం వ్యవసాయం: నివర్ తుఫాన్ ప్రభావం గురువారం జిల్లాపై స్పష్టంగా కనపడింది. తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటిన నేఫథ్యంలో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. ఖమ్మం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరు జల్లులు మొదలుకుని ఎడతెరిపి లేకుంగా వాన ముసురు పట్టింది. వరి, పత్తి పంటలు చేతికి వచ్చే తరుణంలో ఇలా వర్షాలు పడడంతో రైతులు కలవరపడ్డారు. తుపాన్ ప్రభావంతో వర్షాలు పడతాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని నాలుగు రోజుల నుంచి ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావు సూచించారు. వారి ఆదేశాలతో సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను కాపాడేందుకు రైతులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అక్కడక్కడా స్వల్పంగా మినహా పెద్దగా ప్రమాదమేమి జరగలేదు. అక్కడక్కడ మొదళ్లు వర్షంలోనే చిక్కుకున్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని పంట తడవకుండా నిర్వాహకులు, రైతులు టార్పాలిన్లు కప్పారు. మరో రెండు మూడు రోజులపాటు నివర్ తుఫాన్ ప్రభావం ఉండవచ్చని, ఈ కారణంగా మార్కెట్లో విక్రయాలు చేపట్టలేమని మార్కెట్ కమిటీకి వ్యాపారులు లేఖ ఇచ్చారు. దీంతో శుక్ర, శనివారాల్లో ఖమ్మం మార్కెట్‌కు చైర్మన్ మద్దినేని వెంకటరమణ సెలవు ప్రకటించారు. పంటను ఇళ్ల దగ్గరే నిల్వ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల సూచించారు. వర్షం పూర్తిగా తగ్గిన తరువాతనే పంట కోతలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతులకు అందుబాటులో ఉండాలని ఏఈఓలను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తొలిరోజున జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ ముందస్తు చర్యలతో పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిస్తే... ఇప్పటికే కోసి వరి పంటకు, పత్తి చేలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది.
వరి, పత్తి పంటలకు నష్టం
కొత్తగూడెం: నివర్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో జిల్లాలో పలుచోట్ల వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది వరి పంట నేలకొరిగింది. పత్తి కూడా రంగు మారుతుందేమోనని రైతులు ఆందోళన చెం దుతున్నారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉం డాలని, వరి కోతలు వాయిదా వేయాలని కేవీకే, వ్యవసాయ అధికారులు సూచించారు. ఇప్పటికే కోసిన వరిని ఎత్తైన ప్ర దేశాల్లో కుప్పలు వేయాలని చెప్పారు. కుప్పలకు 40 కేజీల గళ్లుప్పును ఓదెల మధ్యలో వేయాలని చెప్పారు. తడిచిన వరి పంట మొలకలు రాకుండా ఐదు గ్రాముల ద్రావణం పిచికారీ చేయాలని కేవీకే కోఆర్డినేటర్ వీరన్న చెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి
రానున్న 24 గంటల వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నందున పంటలపై టార్పాలిన్లు కప్పాలని పేర్కొన్నారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని, వరి కోతలు వాయిదా వేసుకోవాలని కోరారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు