బుధవారం 20 జనవరి 2021
Khammam - Nov 27, 2020 , 02:33:02

సమ్మె సంపూర్ణం

సమ్మె సంపూర్ణం

  • సార్వత్రిక సమ్మె సక్సెస్‌.. 
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు
  •  ప్రదర్శనల్లో పాల్గొన్న  టీఆర్‌ఎస్‌  అనుబంధ సంఘాల  నాయకులు
  • సింగరేణి ఏరియాల్లో  నిలిచిన ఉత్పత్తి

కార్మికులు, ఉద్యోగులు, రైతుల హక్కులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విజయవంతమైంది.. రైతులు, ఉద్యోగ సంఘాల సభ్యులు, వామపక్షవాదులు, సింగరేణీయులు, టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొని మోడీ సర్కార్‌ వైఫల్యాన్ని ఎండగట్టారు.. రైతు వ్యతిరేక విధానాలపై నినదించారు.. వందలాది మందితో కలిసి భారీ ప్రదర్శనలు నిర్వహించారు.. మరోవైపు సమ్మె కారణంగా రవాణావ్యవస్థ నిలిచిపోయింది.. వ్యాపారులు స్వచ్ఛందంగా సమ్మెకు మద్దతు ఇచ్చి దుకాణాలు మూసివేశారు. 

ఖమ్మం ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జిల్లా కార్మిక లోకం ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్షకార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా వ్యవస్థ స్థంభించింది. ప్రజలు స్వచ్ఛందంగా సమ్మెకు మద్దతు తెలిపారు. పలువురు బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొని తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు బస్‌లు నిలిచిపోయాయి. పట్టణాల్లో పూర్తిగా దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి ధర్నా చౌక్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు భాగం హేమంతరావు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పీ దుర్గాప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేట్‌ పరం చేసేలా వ్యవహరిస్తున్నదని వారు విమర్శించారు. వ్యవసాయ బిల్లులు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 
కొత్తగూడెంలో.. : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మె భద్రాద్రి జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌లు, పలు వ్యాపార సముదాయాలు మూసివేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో ఉన్న కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సింగరేణి సంస్థలో బంద్‌ సంపూర్ణంగా జరగడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు, ఆదివాసీ సంఘాల అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లిలోని మార్కెట్‌ యార్డ్‌ నుంచి కలెక్టరేట్‌ వద్ద ఉన్న ధర్నాచౌక్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అఖిలపక్ష జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు.  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ర్యాలీలో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భూగర్భగనులు పీవీకే 5 ఇైంక్లెన్‌, వెంకటేశ్‌ ఖని7 షాప్ట్‌లతో పాటు గౌతమ్‌ ఖని ఉపరితల బొగ్గు గని, సత్తుపల్లి జేవీఆర్‌ ఓసీ, మణుగూరు, ఇల్లెందులోని ఉపరితల బొగ్గు గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు సాబీర్‌పాషా, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎడవల్లి క్రిష్ణ, ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


logo