శుద్ధజలం.. పుష్కలం..

- ఖమ్మం వాసుల దాహార్తి తీర్చేందుకే ‘మిషన్ భగీరథ’
- చివర దశలో పనులు.. శరవేగంగా 18 ట్యాంకుల నిర్మాణం
- మరో 30 ఏళ్ల వరకు ఢోకా లేకుండా పైప్‌లైన్ ఏర్పాటు
- ప్రతి ఇంటికీ సమానంగా నీటి సరఫరా
- కేటాయించిన నిధులు రూ.230 కోట్లు
- విడుదలైన నిధులు రూ.115 కోట్లు
- పైప్‌లైన్589 కి.మీ లబ్ధి80 వేల కుటుంబాలు
పగిలిన పైప్లైన్లు.. రోడ్లపై అడ్డంగా పారే వృథా నీరు.. రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా.. ఇక మీదట ఉండవ్.. తెలంగాణ సర్కార్ ఖమ్మం నగరానికి రూ.కోట్లు కేటాయించి ‘మిషన్ భగీరథ’ పనులు చేపడుతున్నది.. నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని పుష్కలంగా ‘శుద్ధ జలం’ అందించేందుకు యుద్ధప్రాతిపదికన ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నది.. మరో మూడు దశాబ్దాల వరకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నది.. మంత్రి అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు సలహాలు సూచనలిస్తున్నారు.. అతి త్వరలోనే ప్రతి ఇంటికీ శుద్ధజలం సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.. - ఖమ్మం
ఖమ్మం : ‘రెండు, మూడు రోజులకో సారి నీటి సరఫరా.. అదీ అరగంట మాత్రమే.. ఎత్తైన ప్రాంతాలకు అన్ని కాలాల్లోనూ నీటి ఎద్దడే.. దాహార్తిని తీర్చుకోవాలంటే అన్నీఇన్నీ కష్టాలు కావు.. ఇదీ ఉమ్మడి పాలనలో ఖమ్మం ప్రజల దీనస్థితి.. కానీ ఇప్పుడు.. రాష్ట్రంలోని ఇంటింటికీ మంచినీటిని అందించాలని సీఎం కేసీఆర్ సర్కార్ సంకల్పించింది. ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి పట్టణం, పల్లె గొంతు తడిపేందుకు శ్రీకారం చుట్టింది.. భగీరథ పనులు ఖమ్మంలో పరుగులు పెడుతున్నాయి. ఫలితంగా ఇంటింటికీ సురక్షిత నీరు చేరుతోంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని ప్రతిఒక్కరికీ రోజుకు 150 లీటర్లు శుద్ధిచేసిన నీటిని సరఫరా చేసే నిమిత్తం పనులు జరగుతున్నవి. సీఎం కేసీఆర్ దూర దృష్టికి భగీరథ సాక్ష్యంగా నిలుస్తుందని నగర వాసులు పేర్కొంటున్నారు. రాబోవు 15 ఏండ్లలో ఎలాంటి నీటి ఎద్దటి తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.
ఖమ్మంలో 76వేల నల్లా కనెక్షన్లు..
నగరంలో ప్రస్తుతం దాదాపు 80వేల కుటుంబాలు ఉన్నాయని ఇటీవల అధికారులు నిర్వహించిన ధరణీ సర్వేలో తేలింది. మంచినీటి సరఫరా విషయానికి వస్తే కమర్షియల్, నాన్ కమర్షియల్ కలుపుకుని 31,600 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. కాగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఉండాలి, ప్రతిరోజూ సరిపడా మంచినీటి సరఫరా జరగాలన్న సీఎం కేసీఆర్ ఆశయంలో భాగంగా ఖమ్మంలోని అన్ని గృహాలకు నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. ఇంటి యజమానికి పైసా ఖర్చు లేకుండా కనెక్షన్‌ను అందిస్తున్నారు. గోడ కటింగ్ ఛార్జీలు లేవు.. ట్యాప్, బాల్వాల్, మీటరు, గేట్వాల్, సపోర్ట్ రాడ్లను కూడా ఉచితంగానే అందిస్తున్నారు. దీని ద్వారా నీటి వృథా ఉండదు.. ఎత్తు పల్లాల సమస్యలు ఉండవు. క్రింది వారికి ఎక్కువ, ఎత్తున ఉన్న వారికి నీళ్లు ఎక్కని సమస్యలు ఉండవు.
పూర్తైన మెయిన్, డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్స్..
ఖమ్మం నగరంలో భగీరథ నీటిని అందించేందుకు అధికారులు 34కిలో మీటర్ల పొడవును గ్రావిటీ నీటిని సరఫరా చేసేందుకు మెయిన్‌లైన్‌ను నిర్మాణం చేశారు. దీంతో పాటు నీటి సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ కోసం 589కిలో మీటర్ల్ల పొడవునా పైప్లైన్లను నిర్మాణం చేయాల్సి ఉండగా ఇంకా 50కిలో మీటర్ల్ల పొడవునా పైప్‌లైన్ వేయాల్సి ఉంది. అది కూడా ఈ వారంలోపు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
శరవేగంగా 18 వాటర్ ట్యాంకుల నిర్మాణం..
కార్పొరేషన్లో రోజుకు 37 ఎంఎల్టీ, బోరు బావుల ద్వారా మరో 4 ఎంఎల్టీ నీటిని కేఎంసీ యంత్రాంగం సరఫరా చేస్తున్నది. దీనికి గాను 14 ఓవర్‌హెడ్ ట్యాంకులను వినియోగిస్తూ 31,600 నల్లాలకు నిరంతరం నీటిని అందిస్తున్నారు. ఖమ్మంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్తగా 18 ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది. వీటి ద్వారా ప్రతి రోజు 18 మిలియన్ల లీటర్ల నీటిని సరఫరా అందిస్తున్నారు. వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం ఒక వైపు శరవేగంగా జరుగుతున్నప్పటికీ నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు నేరుగా కనెక్షన్లు అందించి నీటిని అందిస్తున్నారు.
30 ఏండ్ల భవిష్యత్‌ను అంచనా వేసి పైప్లైన్లు నిర్మాణం..
రానున్న పదిహేనేండ్లకు సరిపడా నీటిని అందించేందుకు మంచినీటి ట్యాంకులు, మరో 30 ఏండ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పంపింగ్లైన్స్ను ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరంలో మొత్తం 76వేల నల్లా కనెక్షన్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇంటి యజమానికి నయాపైసా ఖర్చు లేకుండా కేఎంసీకి నల్లా డిపాజిట్లు, రోడ్డు కటింగ్ చార్జీలన్నింటినీ ప్రభుత్వమే భరించనున్నది. ఈ క్రమంలోనే పైప్లైన్స్కు మోటార్లను బిగించి నీటిని దొంగిలిస్తున్న ప్రబుద్ధ్దుల ఆటను కట్టించటంతో పాటు దుబారాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి నల్లా కనెక్షన్‌కు మీటర్ బిగిస్తున్నారు. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం ప్రతిరోజు ఒక్కో మనిషికి 150 లీటర్ల శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయనున్నారు. ఐతే ఇప్పటికే ఖమ్మంలో పాత నల్లా కనెక్షన్లు 31,600 ఉండగా కొత్తగా మరో 45 వేల నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఇప్పటి వరకు 36 వేల ఇండ్లకు కొత్తగా నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన 9 వేల ఇండ్లకు కూడా ఈ వారంలోపు నల్లా కనెక్షన్లు ఇవ్వడం పూర్తవుతుందని భగీరథ ఈఈ రంజిత్‌కుమార్ వివరించారు.
సీఎం కేసీఆర్ ఆశయం నెరవేరుతోంది..
రానున్న పదిహేనేండ్లలో ఖమ్మం ప్రజలకు ఎలాంటి మంచినీటి ఎద్దటి లేకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం. ఖమ్మం కార్పొరేషన్లో రూ.230 కోట్లతో మొదలు పెట్టిన భగీరథ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇంకా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి. అవి కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. అయితే భగీరథ నీటి సరఫరా మాత్రం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రస్తుతానికి రెండు రోజులకు ఒక సారి నీటిని సరఫరా చేస్తున్నాం. కొత్త ట్యాంకుల నిర్మాణం ఫినిషింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు కూడా పూర్తి కాగానే ప్రతి రోజు నీటి సరఫరా చేస్తాం. రాబోయే 30ఏండ్ల వరకు ఖమ్మం నగరం విస్తరించే అంశాన్ని దృష్టిలోకి తీసుకొని వాటర్ ట్యాంకులు, పైపులైన్లను ఏర్పాటు చేశాం. మేము కోరగానే నిధులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.
- పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
తాజావార్తలు
- 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని
- ట్రంప్ ఆర్డర్లన్నీ రివర్స్.. బైడెన్ చేయబోయే తొలి పని ఇదే
- బైకును ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి
- ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్
- అనంతగిరి కొండలను కాపాడుకుందాం..
- 'కుట్రతోనే రైతుల విషయంలో కేంద్రం కాలయాపన'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత