సోమవారం 25 జనవరి 2021
Khammam - Nov 24, 2020 , 00:17:22

టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీ బాధ్యులపై కేసు

టీఎన్జీవో హౌసింగ్‌ సొసైటీ బాధ్యులపై కేసు

  • 8.39 ఎకరాలు  ఆక్రమించినట్లు నిర్ధారణ
  • అధ్యక్ష, కార్యదర్శులు,  డైరెక్టర్లపై చర్యలు
  • కొనుగోలుదారులపై చర్యలుండవు
  • వివరాలు వెల్లడించిన ఖమ్మం ఇన్‌చార్జి ఆర్డీవో  సూర్యనారాయణ

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ బాధ్యులపై భూఆక్రమణ చట్టం కింద కేసు నమోదైందని ఖమ్మం ఇన్‌చార్జ్‌ ఆర్డీవో సూర్యనారాయణ తెలిపా రు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆక్రమిత భూమిని సొసైటీ బా ధ్యుల నుంచి కొనుగోలు చేసిన వారిపై ఎలాంటి  చర్యలు ఉండవని స్పష్టం చేశారు. సొసైటీ సభ్యులను బాధ్యులు మభ్యపెట్టి భూమి విక్రయించినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. సొసైటీ బాధ్యులపై ఖమ్మం టూటౌన్‌, రూరల్‌ పో లీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు...

ఎక్కడెక్కడ ఎంతెంత అంటే...

2005లో జీవో నెంబర్‌ 144 ప్రకారం ఖమ్మం రూరల్‌ మండలంలోని 103 ఎకరాల 26 కుంటల ప్రభుత్వ భూమిని నామమాత్రపు వ్యయంతో సొసైటీకి కేటాయించారు. ఈ భూమి కాకుండా పక్కనే ఉన్న మరో 8.39 ఎకరాలను సొసైటీ బాధ్యులు ఆక్రమించారు. ఖమ్మం రూరల్‌ మండలంలో 4 ఎకరాల 26 కుంటలు, ఖమ్మం అర్బన్‌ మండలంలో 4 ఎకరాల 13 కుంటలు, ఖమ్మం రూరల్‌ మండలంలోని 101 సర్వే నెంబర్‌లో 30 కుంటలు, 104 సర్వే నెంబర్‌లో 2.09 కుంటలు, 107 సర్వే నెంబర్‌లో 07 కుంటలు,  134 సర్వే నెంబర్‌లో 120 కుంటలు, ఖమ్మం అర్బన్‌ మండలంలోని 61, 64, 65, 66, 79 సర్వే నెంబర్లలో 4 ఎకరాల 13 కుంటలు ఆక్రమించినట్లుగా విచారణలో తేలింది.

విచారణకు ముగ్గురితో కమిటీ ఏర్పాటు

సొసైటీ ఏర్పడిన నాటి నుంచి లావాదేవీలను మూడు కమిటీలు నిర్వహించాయి. ఈ కమిటీల్లోని బాధ్యులందరికీ భూఆక్రమణతో సంబంధం ఉంది. సొసైటీ నిర్వాహకుల చర్యలపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణకు కమిటీని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ గతంలోనే నియమించారు. ఈ కమిటీలో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ స్నేహలత, ఖమ్మం ఆర్డీవో, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఖమ్మం ఏడీ, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిటీ ప్లానర్‌ సభ్యులుగా ఉన్నారు. టీఎన్జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలోఅవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై కలెక్టర్‌ నియమించిన విచారణ జరపకుండా ఆదేశాలివ్వాలని (స్టే) కోరుతూ సొసైటీ అధ్యక్షుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి హైకోర్డు నిరాకరించింది.

  అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ

ఖమ్మంలోని టీఎన్జీవోస్‌ కోఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి నామమాత్రపు వ్యయంతో కేటాయించిన స్థలాల్లో సభ్యులు కానివారు, అనర్హులు ప్రవేశించడంతో ఆవేదన చెందిన కొందరు సభ్యులు విజిలెన్స్‌ అధికారులకు, ఇతర ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్‌ అధికారులు స్పందించారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీకి, చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ)కు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు, వరంగల్‌ రీజినల్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌కు, కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌కు, జిల్లా సహకార అధికారికి పంపారు. సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులపై, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

16 మందిపై కేసు

 టీఎన్జీవోస్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ సొసైటీ ఏర్పడిన నాటి నుంచి అధ్యక్ష కార్యదర్శులుగా, డైరెక్టర్లుగా పనిచేసిన 16 మందిపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. 2012 నుంచి ఇప్పటివరకు మూడు కమిటీలు పనిచేశాయి. 2012 నుంచి 2017 వరకు అధ్యక్షుడిగా కె.రంగరాజు, కార్యదర్శిగా ఏలూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడిగా పి.రాజారావు, ట్రెజరర్‌గా జి.వేణుగోపాలరావు, డైరెక్టర్లుగా పి.సత్యనారాయణ, జి.నరేందర్‌, ఎ.ఉమాపతిరాజు; 2017 జనవరి నుంచి అక్టోబర్‌ వరకు అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా పి.రాజారావు, ఉపాధ్యక్షుడిగా జి.వేణుగోపాలరావు, ట్రెజరర్‌గా పి.సత్యనారాయణ, డైరెక్టర్లుగా జి.నరేందర్‌, ఉమాపతిరాజు పనిచేశారు. 2018 నుంచి ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు, కార్యదర్శిగా పి.రాజారావు, ఉపాధ్యక్షుడిగా పి.సత్యనారాయణ, ట్రెజరర్‌గా ఎం.గోపాల్‌, డైరెక్టర్లుగా జి.నరేందర్‌, పి.వెంకటనర్సమ్మ, అక్తరున్సీసా బేగం పనిచేస్తున్నారు. సొసైటీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన వీరితోపాటు  మరికొందరిపై కేసు నమోదైంది.

‘భూమిని ఆక్రమించలేదు’

ప్రభుత్వ భూమని ఆక్రమించినట్లుగాతమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని టీఎన్జీవోస్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం సొసైటీకి కేటాయించిన భూమి పక్కన ఉన్న వేరే సర్వే నెంబర్‌ భూమి సొసైటీ పరిధిలో కలిస్తే విచారించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై న్యాయస్థానం స్టే ఇచ్చిందని అందువల్ల సొసైటీ సమక్షంలో విచారణ నిర్వహించాలని కోరారు.

11 మందిపై కేసు

ఖమ్మం రూరల్‌: మండలంలోని ప్రభుత్వ భూమి ఆక్రమించిన టీఎన్‌జీఓస్‌ హౌసింగ్‌ సొసైటీ కమిటీకి చెందిన 11 మందిపై ఖమ్మం రెవెన్యూ డివిజన్‌ అధికారి సిహెచ్‌.సూర్యనారాయణ ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదైంది. రూరల్‌ సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాలు... మండలంలోని ఏదులాపురం, పోలేపల్లి రెవెన్యూ పరిధిలో 4.26 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లుగా ఫిర్యాదు అందింది. కేసు నమోదైన వారిలో కె.రంగరాజు, ఏలూరి శ్రీనివాసరావు, పి.రాజయ్య(రాజారావు), జి. వేణుగోపాల్‌రావు, పి.సత్యనారాయణ, జి.నరేందర్‌, ఎ.ఉమాపతిరాజు, ఎ.శ్రీనివాస్‌, ఎం.గోపాల్‌, పి.వెంకటనర్సమ్మ, ఎస్‌.అక్తరున్నిసాబేగం ఉన్నారు.

సొసైటీకి కేటాయించిన భూమి ఇదే...

టీఎన్జీవోస్‌ కోఆపరేటీవ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి ఖమ్మం రూరల్‌ మండలంలోని 103 ఎకరాల 26 కుంటల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఏదులాపురం పంచాయతీలోని 99, 100, 105/1, 105/2, 106/2/1, 106/2/3, 106/3, 107/3/3లలో 54 ఎకరాల 15 కుంటలు, దానవాయిగూడెం పంచాయతీలోని సర్వే నెంబర్‌ 63/2/3/64/1, 65/2,66/2,67, 68 తదితరాల్లో 49 ఎకరాల 11 కుంటలను ప్రభుత్వం ఇచ్చింది. సొసైటీ ఏర్పాటైనప్పుడు 1686 మంది సభ్యులు ఉన్నారు.logo