శనివారం 28 నవంబర్ 2020
Khammam - Nov 22, 2020 , 02:15:52

వ్యవసాయేతర ధరణి...

వ్యవసాయేతర ధరణి...

  • రేపటి నుంచి ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం 
  • ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారానే లావాదేవీలు 
  • ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌
  • క్రయ విక్రయదారులు, సాక్షుల హాజరు తప్పనిసరి 
  • ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం 

రిజిస్ట్రేషన్ల చరిత్రలో నూతన శకం ఆరంభమైంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణితో దర్జాగా భూ క్రయ విక్రయదారులు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వెయ్యికి పైగా రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకే చోట తక్కువ సమయంలో అవుతుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా సోమవారం నుంచి వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్‌లైన్‌లోనే.. మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పించారు.  సులువుగా, సత్వరమే పనులు జరుగుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

 -ఖమ్మం ప్రతినిధి నమస్తే తెలంగాణ

ఎలాంటి అవినీతి, అక్రమాలకు అస్కారం లేకుండా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సులభంగా, వేగంగా రిజిస్ట్రేషన్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సన్నద్ధమైంది. రేపటి నుంచి ఈ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభం కానుంది. గత సెప్టెంబర్‌ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేయగా సోమవారం నుంచి ఈ సేవలు ధరణి పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. 

                 ధరణిలో వ్యవసాయ భూముల మాదిరిగానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కూడా ఆన్‌లైన్‌లోనే జరుగనుంది. అన్‌లైన్‌లోనే మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించారు. క్రయ, విక్రయదారులు, సాక్షులు తప్పకుండా రిజిస్ట్రేషన్‌ కోసం హజరుకావాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అరగంటలోనే మ్యుటేషన్‌ పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సీఎం కేసీఆర్‌ ఈ నెల 2వ తేదిన ప్రారంభించారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు మ్యుటేషన్లను తక్షణమే పూర్తి చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ అధికారులు సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఇప్పటికే ధరణి పోర్టల్‌లో నమోదు చేసి.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సరళతరం చేశారు. నూతన విధానంలో భాగంగా ధరణి పోర్టల్‌ ద్వారా భూ లావాదేవాలు కోర్‌ బ్యాంకింగ్‌ విధానంలో అన్‌లైన్‌ పద్ధతితో కార్యాకలాపాలు కొనసాగనున్నాయి. నిలిచిపోయన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుండడంతో గ్రామీణ, పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

స్థానిక అధికారులతో పనే లేదు..

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయేతర భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి ప్రక్రియ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్లతో పాటు మ్యుటేషన్లు అయిపోతుండడంతో ఇక గ్రామపంచాయతీ, మున్సిపల్‌ కార్యాలయాల అవసరమే ఉండదు. గతంలో ప్రతి రిజిస్ట్రేషన్‌ అనంతరం మ్యుటేషన్‌ కోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రక్రియను ధరణి పోర్టల్‌ ద్వారా బుక్‌ చేసుకొని రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి మ్యుటేషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 23 నుంచి అన్ని కార్యకలాపాలు రిజిస్ట్ట్రార్‌ కార్యాలయాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టణాల్లో.. గ్రామాల్లో ఇండ్లు, ప్లాట్ల వివరాలన్నీ ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, ఇతర పట్టణాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. పట్టణాల్లో, పల్లెల్లో గృహాల వివరాలను సేకరించి యాజమాన్యాలను గుర్తిస్తూ ప్రభుత్వం ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపర్చింది. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలు స్పష్టంగా గుర్తించేందుకు వీలు కలిగింది. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు లభించింది.

అన్నీ ధరణి పోర్టల్‌లోనే.. 

వ్యవసాయేతర భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి.. క్రయ విక్రయ.. రిజిస్ట్రేషన్‌ లావాదేవీల కోసం ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండోను క్లిక్‌ చేసిన తరువాత వచ్చే పేజీలో సిటిజన్‌ స్లాట్‌ బుకింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంది. ఆ సిటిజన్‌ లాగిన్‌ పేజీలో మొబైల్‌ నంబర్‌ నమోదు చేయగానే వచ్చే వన్‌టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్‌ నంబర్‌, క్రయ, విక్రయదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. స్లాట్‌ బక్‌ కాగానే క్రయవిక్రయదారుల మొబైల్‌ నంబర్‌ను వచ్చే వివరాల ప్రకారం.. అమ్మకందారులు,  కొనుగోలుదారులు, సాక్షులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు స్లాట్‌ బుకింగ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ దస్తావేజుకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. నిర్దేశిత స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్‌లైన్‌లో ఈ -చలాన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత సాక్షులు, క్రయ విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్‌ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తీసుకుంటారు. ఇది పూర్తికాగానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సబ్‌ రిజిస్ట్రార్‌ పూర్తి చేస్తారు. ఆ వెంటనే మ్యుటేషన్‌ కూడా పూర్తవుతుంది. 

ఆన్‌లైన్‌లో నిక్షిప్తం..

 పట్టణాల్లో, గ్రామాల్లో ఇండ్లు, ప్లాట్ల వివరాలన్నీ ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, ఇతర పట్టణాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది. మీ సేవా సెంటర్లలో ప్రజలు కూడా వారి ఆస్తుల వివరాలను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆధార్‌ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటన్నింటి నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. పట్టణాల్లో, పల్లెల్లో గృహాల వివరాలను సేకరించి యాజమాన్యాలను గుర్తిస్తూ ఓ ఆన్‌లైన్‌ వివరాలను ప్రభుత్వం పొందుపర్చింది. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలు స్పష్టంగా గుర్తించేందుకు వీలు కలిగింది. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకునేందుకు వెసులుబాటు లభించింది.