గురువారం 03 డిసెంబర్ 2020
Khammam - Nov 22, 2020 , 02:15:52

మహిళా సాధికారతే చట్టాల లక్ష్యం

మహిళా సాధికారతే చట్టాల లక్ష్యం

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌ 

ఖమ్మం లీగల్‌ : సమాజంలో మహిళలు తమ హక్కుల సాధన కోసం ఎన్నో చట్టాలు అందుబాటులో ఉన్న వాటిపై అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారని, గ్రామంలో అందుబాటులో ఉండే అంగన్‌వాడీల చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా మహిళలను చైతన్యపరచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని టీటీడీసీలో జాతీయ న్యాయసేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్‌లు సంయుక్తంగా నిర్వహించిన మహిళా అవగాహన సదస్సును ఆయన జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జాతీయ మహిళా కమిషన్‌ విధులను వివరిస్తూ మహిళా సాధికారితకు, హక్కుల సాధనకు చట్టాలను వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉండే అంగన్‌వాడీలను గ్రామ సంక్షేమ అధికారులుగా అభివర్ణించారు.

జాతీయ మహిళలు కమిషన్‌, న్యాయసేవా సంస్థల గురించి అవగాహన కల్పించి మహిళలను చైతన్యవంతులను చేయాలని ఆయన అంగన్‌వాడీలను కోరారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి వినోద్‌కుమార్‌ కార్యక్రమ విశేషాలను ఉద్దేశాలను వివరించారు. ప్రారంభ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, గృహహింస చట్ట న్యాయసహాయ కౌన్సిలర్‌ శ్రీదేవి, న్యాయవాది శిరీషలు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు వివిధ చట్టాలపై న్యాయవాదులు ఎం.సైదేశ్వరరావు, పి.పద్మావతి, డి.శిరీష పాల్గొన్నారు.