బుధవారం 20 జనవరి 2021
Khammam - Nov 11, 2020 , 02:30:23

ధరణికి వందనం

ధరణికి వందనం

భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : ఒకే ఒక్క ధరణి.. వేల సమస్యలకు పరిష్కారం చూపెట్టింది. గతంలో భూమి కొనుగోలు చేసినవారికి భూ యజమానికి హక్కు రావడానికి  మధ్యవర్తుల ప్రమేయం, దళారుల దందా, ఇతరత్రా వ్యక్తులతో ఎన్నెన్నో సమస్యలు ఎదురయ్యేవి. నేడు ఈ సమస్యలన్నింటికీ ధరణి పరిష్కారం చూపింది. ధరణితో రైతులకు సులభంగా.. సునాయాసంగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. 

భద్రాద్రి జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ

జిల్లా మొత్తం ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ 8 మండలాల్లోనే క్రయ, విక్రయాలు నిర్వహించుకొని రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ధరణి పోర్టల్‌ ప్రారంభమైనప్పటి నుంచి కొనుగోలు, అమ్మకాలు చేసిన రైతులు తమ పేరుతో భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకొని మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ సమక్షంలో ఈ ప్రక్రియను కేవలం 20నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతోంది. మంగళవారం కొత్తగూడెం, బూర్గంపాడులో మండలాల్లో ఒక్కో రిజిస్ట్రేషన్‌ జరిగింది. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 11రిజిస్ట్రేషన్లు జరగగా, ఇప్పటి వరకు 31స్లాట్‌ బుకింగ్స్‌ జరిగాయి. 

కొత్తగూడెంలో తొలి రిజిస్ట్రేషన్‌

ధరణి పోర్టల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగూడెం మండలంలో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు జరగలేదు. ఈ నెల 3వ తేదీన పాతకొత్తగూడేనికి చెందిన ఈడ్పుగంటి రవీంద్రకుమార్‌ తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరం ఒక కుంట భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదీన రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు తేదీని నిర్ణయించారు. ఉదయం 11.20నిమిషాలకు కొత్తగూడెం తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన కేవలం 20నిమిషాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మండలంలో పాతకొత్తగూడెం, బూడిదగడ్డ ఏరియాలోనే రిజిస్ట్రేషన్‌ కలిగిన వ్యవసాయభూములు ఉన్నాయి. కొత్తగూడెం టౌన్‌లో 312ఎకరాల భూమి ఉండగా 113మంది రైతులు సాగుచేస్తున్నట్లు, రామవరంలో 218ఎకరాలు ఉండగా 118మంది రైతులు సాగు చేసుకుంటున్నారు.  భూమిని రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్లతో సహా ధరణిలో నిక్షిప్తం చేయడంతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌లకు ఆస్కారం లేదు.

కూసుమంచిలో 10 రిజిస్ట్రేషన్లు

కూసుమంచి : కూసుమంచి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మంగళవారం 10 మంది రైతులకు ఈ-పట్టాలు ఇచ్చారు. సోమవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్న రైతులకు మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు నమోదు చేశారు. గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా వెయిటింగ్‌ రూం ఏర్పాటు చేశారు. ఒక్క రోజులో పట్టా చేతికందటంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం 10 రిజిస్ట్రేషన్లు సుమారు పూర్తయ్యాయని తహశీల్దార్‌ జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ శిరీష తెలిపారు. 

వేంసూరులో 40 రిజిస్ట్రేషన్లు

వేంసూరు : రైతులకు వరంలా మారిన ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేంసూరు మండలంలో ముమ్మరంగా కొనసాగుతుంది. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో ఆరు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ముజాహిద్‌ తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన రైతులు సైతం కొన్ని నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని వారికి సంబంధించిన హక్కుపత్రాలు అందుకొని, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వేంసూరు మండలంలో 40 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు తహసీల్దార్‌ ముజాహిద్‌ తెలిపారు. 

 ధరణితో బాధ్యత తీరింది 

 నా భర్త ద్వారా సంక్రమించిన రెండు ఎకరాల భూమిని నా ఇద్దరు కొడుకులకు చేరో ఎకరం రిజిస్ట్రేషన్‌ చేశాను. మా గ్రామానికి వచ్చిన అధికారులు ధరణితో భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సులభతరమవుతుందని వారు చెప్పారు. శనివారం స్లాట్‌ బుక్‌ చేసుకొని సోమవారం మధిరలోని తహసీల్దార్‌ కార్యాలయానికి నా కొడుకులు ఇద్దరితో కలిసి వచ్చాను.  కొద్దిసేపటికే నా పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమి వారిద్దరి పేర్ల మీదకు మారింది.   

- సుగ్గల వెంకటసుబ్బమ్మ, దెందుకూరు , మధిర మండలం 

అధికారుల పనితీరు బాగుంది 

తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారుల పనితీరు నిజంగా అద్భుతం. కార్యాలయానికి వెళ్లిన 10 నిమిషాల్లోనే కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్‌ చేసి, ఈ-పాస్‌పుస్తకాన్ని అందజేశారు.  రైతులు ఇబ్బందులు పడకుండానే రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తిచేసి రైతుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటువంటి సులవైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌. ధరణి ద్వారా ప్రభుత్వానికి, అధికారులకు మంచి గుర్తింపు వస్తుంది. 

- వందనం ముత్యం, గార్ల ఒడ్డు

 ఇవాళ కళ్లారా చూశాను.. 

స్లాట్‌ బుక్‌ చేయగా మంగళవారానికి సమయం కేటాయించారు. తహసీల్దార్‌ కార్యాలయానికి రాగా కేవలం రూ.1362లు ప్రభుత్వ రుసుంతోనే వారసత్వ రిజిస్ట్రేషన్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం అందించిన పట్టాదారు పాసు పుస్తకం మా నాన్నకు రావడం, దాని నుండి వారసత్వంగా నాకు వెంటనే అధికారులు అందించడం చాలా సంతోషంగా ఉంది. ధరణి పోర్టల్‌పై అందరూ చెపుతుంటే విన్నాను. ఈ రోజు నిజంగానే కళ్లారా చూశాను.

- జుంజునూరి రమేశ్‌, గణేశ్‌పాడు 

మధ్యవర్తుల ప్రమేయం లేదు 

గతంలో భూమి రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే దళారులు, మధ్యవర్తులతోనే జరిగేది. ఇప్పుడు ధరణి పోర్టల్‌ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. అలాగే సమయం కూడా తక్కువగా పడుతుంది. రెండు ఎకరాల భూమిని విక్రయించగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిముషాల్లోనే పూర్తయింది. రైతులంతా కేసీఆర్‌ నిర్ణయంతో సంతోషంగా ఉన్నారు. 

- దొడ్డా హైమావతి, ఎంపీపీ, సత్తుపల్లి

 ధరణితో రిజిస్ట్రేషన్‌ సులువైంది 

నేను కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ముందురోజు మీసేవాలో స్లాట్‌ బుక్‌ చేయించుకున్నా. తహశీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఫొటోలు దిగడంతో తహసీల్దార్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి, మ్యుటేషన్‌ పత్రాలతో పాటు ఈ-పాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. గతంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ రంది లేక ధరణితో రిజిస్ట్రేషన్‌ సులువైంది.

- కుందారం జంగయ్య, కొనుగోలుదారు, వనస్థలిపురం, హైదరాబాద్‌

 చాలా  ఆశ్చర్యంగా ఉంది 

 నా పేరు మీద భూమిని నమోదు చేయించుకునేందుకు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన ఆరగంటలోనే అన్ని పూర్తి చేశారు. నా పేరు మీద భూమి నమోదు అయిందంటూ హక్కుపత్రాలు అందించడం ఆశ్యర్యంగా ఉంది.  గతంలో ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల మనస్సు ఎరిగి రైతు కష్టాలను తీర్చే విధంగా ధరణి పోర్టల్‌ను రూపకల్పన చేయడం చాలా బాగుంది. కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు.

- రేగళ్ల బాబురెడ్డి, కల్లూరుగూడెం

 చాలా ఆశ్చర్యంగా ఉంది 

నేను ఎకరం భూమిని కొనుగోలు చేశా. ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ఒక రోజు ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని, అన్ని డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో పొందుపరిచి చలానా సైతం మీసేవా కేంద్రంలోనే చెల్లించాం. మరుసటి రోజు డాక్యుమెంట్లను తీసుకొచ్చి బుక్‌ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లాం. డేటా ఆపరేటర్లు మా వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకొని పరిశీలించి 10 నిమిషాల్లోనే సబ్‌రిజిస్ట్రార్‌కు అందించారు.  

- షేక్‌ సాదిక్‌పాషా, నారాయణపురం, బోనకల్లు మండలం  

రైతులకు సిబ్బంది సహకరిస్తున్నారు 

రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చే రైతులకు కార్యాలయ సిబ్బంది పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎటువంటి సాంకేతిక కారణాలతో ఇబ్బందులు కలగకుండా రిజిస్ట్రేసన్‌ ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. కొనుగోలుదారులకు, అమ్మకందారులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ధరణితో సులభతరంగా పేరుమార్పిడి చేసి ఈ-పాస్‌పుస్తకాన్ని కొనుగోలు దారులకు అందజేస్తున్నాం. 

- డి.సైదులు, తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌, మధిర రైతు 

చెంతకు ధరణి సేవలు

తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం ద్వారా తెచ్చిన ధరణితో.. రైతులకు మెరుగైన సేవలు సులభంగా, వేగంగా అందుతున్నాయి. ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు భూ క్రయ, విక్రయాలకు 20 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దీంతో వారు కార్యాలయం వద్ద ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ధరణితో తమకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందంగా ఉన్నారు.

- కిషోర్‌, తహసీల్దార్‌, 

బూర్గంపహాడ్‌ రైతుల మోముల్లో ఆనందం 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణితో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రైతుల మోముల్లో ఆనందం కనిపిస్తుంది. మండలంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. మున్ముందు మరింతగా రిజిస్ట్రేషన్లు పుంజుకునే అవకాశం ఉంది. స్లాట్‌ బుకింగ్‌లో ఏమైనా సాంకేతిక లోపాలు తలెత్తితే టెక్నికల్‌ టీం వాటిని సమస్యలు పరిష్కరించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్నాం. 

- జగదీశ్వర ప్రసాద్‌, జాయింట్‌ సబ్‌ రిజిష్ర్టార్‌, ఎర్రుపాలెంlogo