ఆదివారం 17 జనవరి 2021
Khammam - Nov 08, 2020 , 02:07:31

లోక్‌ అదాలత్‌లో 1054 కేసుల పరిష్కారం

లోక్‌ అదాలత్‌లో 1054  కేసుల పరిష్కారం

  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయమూర్తుల విచారణ
  • ఉమ్మడి జిల్లా కోర్టుల్లో నిర్వహణ
  • కక్షిదారుల నమ్మకాన్ని చూరగొనాలి
  • హైకోర్టు సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌

ఖమ్మం లీగల్‌ : తమ హక్కుల కోసం న్యాయస్థానంలో కేసు వేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న కక్షిదారులకు సత్వర న్యాయం అం దించి వారి నమ్మకాన్ని చూరగొనాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జడ్జి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహన్‌ పేర్కొన్నారు. శనివారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్‌ లోక్‌ అదాలత్‌ను ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. సత్వర న్యాయం కోసం లోక్‌ అదాలత్‌లు కృషి చేస్తున్నాయని అన్నా రు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ పీ.నవీన్‌రావు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌ వర్చువల్‌ పద్ధతిలో ఖమ్మంలో లోక్‌ అదాలత్‌ను ప్రారంభించారు. ఒక మోటారు ప్రమాద కేసులో మహిళ మరణించగా కుటుంబ సభ్యులకు బీమా కంపెనీ నుంచి రూ.15 లక్షల పరిహారం ఇప్పించారు. దీంతో అదనపు జిల్లా న్యాయమూర్తి ఆర్‌.తిరుపతి లోక్‌ అదాలత్‌ అవార్డు జారీ చేశారు. మరో ఘటనలో ఖానాపు రం హవేలీ పోలీసులు నమోదు చేసిన కోట్లాట కేసును జిల్లా ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో మేజిస్ట్రేట్‌ రుబీనా ఫాతిమా పరిష్కరించారు. కక్షిదారులు ఖానాపురం పోలీస్‌ స్టేషన్‌లో, న్యాయమూర్తులు కోర్టులో ఉండగా వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో కేసులను పరిష్కరించారు. న్యాయమూర్తులు బాలభాస్కర్‌రావు, తిరుపతి పాల్గొన్నారు. 

1054 కేసుల పరిష్కారం

ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో నిర్వహించిన వర్చువల్‌ లోక్‌ అదాలత్‌లో మొత్తం 1054 కేసులు పరిష్కారమయ్యాయి. అదనపు జిల్లా జడ్జి ఆర్‌.తిరుపతి లోక్‌ అదాలత్‌ బెంచికి అధ్యక్షత వహించారు. 17 మోటారు వాహన ప్రమాద కేసులను పరిష్కరించి బాధితులకు రూ.77.40 లక్షల పరిహారం అందించారు. న్యాయమూర్తులు వినోద్‌కుమార్‌ 6 కేసులు, అనితారెడ్డి 112 కేసులు, ఉషశ్రీ 173 కేసులు, రుబీనా ఫాతిమా 198 కేసులు పరిష్కరించారు. న్యాయవాదులు జీ.తాజుద్దీన్‌బాబా, రాజేశ్వరరావు, పాపారావు, కిశోర్‌ బాబు, టీ.నారాయణలు లోక్‌ అదాలత్‌ సభ్యులుగా వ్యవహరించారు. కొత్తగూడెంలో 134 కేసులు, సత్తుపల్లిలో 151 కేసులు, మధిరలో 73 కేసులు, ఇల్లెందులో 132 కేసులు, భద్రాచలంలో 17 కేసులు, మణుగూరులో 41 కేసులు పరిష్కారమయ్యాయి.