బుధవారం 27 జనవరి 2021
Khammam - Nov 06, 2020 , 00:29:33

ఐరిష్‌తో రిజిస్ట్రేషన్‌

ఐరిష్‌తో రిజిస్ట్రేషన్‌

  • రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం రూరల్‌లో ప్రక్రియ 
  •  రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించిన తహసీల్దార్‌

ఖమ్మం రూరల్‌ : భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూ లావాదేవీల్లో అక్రమాలకు తావు లేకుండా సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. కాగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మంరూరల్‌ మండలంలో గురువారం ఐరిష్‌ విధానం ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరిగింది. రూరల్‌ మండలంలోని గుర్రాలపాడు గ్రామానికి చెందిన తీగల లింగమ్మ అనే మహిళ పేరున భూమిని తన మనవడు పేరుమీదకు మార్చుకునేందుకు ఈ నెల 2న స్లాట్‌ బుక్‌ చేయగా 3తేదీన రిజిస్ట్రేషన్‌ జరగాల్సి ఉంది. అయితే సదరు వృద్ధురాలికి అనారోగ్యం కారణంగా కార్యాలయానికి రాలేనందున ఈ నెల 4వ తేదీన సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాడు. లింగమ్మ వేలిముద్రలు పడక పోవడంతో ఈ కేవైసీ రాలేదు.

దీంతో తహసీల్దార్‌ కారుమంచి శ్రీనివాసరావు ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు చెప్పడంతో కలెక్టర్‌ హైదారాబాద్‌లోని ఉన్నతాధికారులను సంప్రదించారు. వారి ఆదేశంతో సాంకేతిక నిపుణులు బుధవారం రాత్రికి ఐరిష్‌ను ఇన్‌స్టాల్‌ చేయగా గురువారం ఉదయాన్నే లింగమ్మతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. గుర్రాలపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నెం 189/7లో 11 గుంటల భూమిని తన కుమారుడు తీగల వెంకటేశ్వర్లు కుమారుడు తీగల నాగరాజు పేరున రిజిస్ట్రేషన్‌ చేశారు. తెలంగాణలోనే ఐరీష్‌ ద్వారా దరణిలో తొలి రిజిస్ట్రేషన్‌ నమోదైంది. 

ధరణితో ఎలాంటి ఇబ్బంది లేదు..

ధరణి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేవు. వేలిముద్రలు పడని వృద్ధులకు కూడా ఐరిస్‌ విధానంతో రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం కూడా ఉండటంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయగలుగుతున్నాం. ప్రజలు ఎలాంటి అపోహలు గురికావొద్దు. మధ్య దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. స్లాట్‌ బుక్‌ చేసుకునే సమయంలో ఆధార్‌కార్డులో ఎలా ఉంటే అలాగే నమోదు చేసుకోవాలి. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుంది. -కారుమంచి శ్రీనివాసరావు, తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌


logo