శనివారం 23 జనవరి 2021
Khammam - Nov 04, 2020 , 01:31:08

రైతుల సం‘పత్తి’

రైతుల సం‘పత్తి’

ఖమ్మం వ్యవసాయం : దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నియంత్రితసాగు విధానం సత్ఫలితాలనిచ్చింది. ఈ విధానంలోనే తొలిసారిగా పత్తికోనుగోళ్లు చేసేందుకు భారత పత్తి సంస్థ (సీసీఐ) సర్వం సిద్ధం చేసింది.  నేడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను అధికారికంగా ప్రారంభించనున్నారు. వారం రోజుల నుంచి డీఎంఓ నాగరాజు జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ జిన్నింగ్‌ మిల్లుల వద్ద కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అర్హత కలిగిన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు వానకాలం కార్డును అనుసరించి సాగు చేయించారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 13 సీసీఐ కేంద్రాలకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపగా.. నేటి వరకు 10 కేంద్రాలను నోటిఫై చేశారు. మిగిలిన మూడు కేంద్రాలకు సైతం మరికొద్ది రోజుల్లోనే అనుమతి వచ్చే అవకాశం ఉంది. రైతాంగం ఆశించిన విధంగా కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,825గా ప్రకటించారు. 

రైతులూ.. ఈ జాగ్రత్తలు పాటించండి..

సీసీఐ కొనుగోళ్ల ప్రక్రియ ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరగనుంది. 8శాతం నుంచి 12శాతం వరకు తేమ ఉంటేనే కొనుగోలు చేసే అవకాశం ఉంది. పంట నాణ్యతకు సంబంధించి ఒక్కో శాతానికి క్వింటాల్‌ ఒక్కంటికి రూ.54.50 చొప్పున ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సీసీఐ కేంద్రానికి పంటను తీసుకువచ్చే రైతులు తమవెంట విధిగా ఒరిజనల్‌ రైతు గుర్తింపు కార్డు, పట్టదారు పాసుపుస్తకం, బ్యాంక్‌ ఖాతాపుస్తకం, తీసుకురావాల్సి ఉంటుంది. పంటను కేంద్రాలకు లూజు పత్తిని మాత్రమే అనుమతి ఇస్తారు. తద్వారా రైతుకు ప్రయోజనం చేకూరనుంది. బస్తాల ఖర్చు, తొక్కేందుకు కూలీల ఖర్చుతో పాటు పంట నాణ్యతప్రమాణం పెరిగే అవకాశం ఉంటుంది. నీళ్లతో తడిపిన పత్తి, పంటలో మట్టిపెడ్డలు లేకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతు ఒకేసారి కాకుండా దశలవారీగా పత్తిని తీసుకువచ్చేందుకు అవకాశం కల్పిస్తారు. ఏ కేంద్రంలో పంటను అమ్ముకోవాలనుకుంటున్నారో.. అక్కడికి ఒకరోజు ముందుగావెళ్లి టోకెన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 

పది జిన్నింగ్‌ మిల్లులకు అనుమతి..

ఖమ్మం మార్కెట్‌ పరిధిలో మూడు జిన్నింగు మిల్లులు, మధిర మార్కెట్‌ పరిధిలో నాలుగు జిన్నింగ్‌ మిల్లులు, నేలకొండపల్లి మార్కెట్‌ పరిధిలో ఒకటి, ఏన్కూర్‌ మార్కెట్‌ పరిధిలో ఒకటి, మద్దులపల్లి మార్కెట్‌ పరిధిలో మరో జిన్నింగ్‌ మిల్లుకు అనుమతి ఇచ్చారు. వీటితో పాటు మద్దులపల్లి, మధిర, వైరా మార్కెట్‌ పరిధిలోని మరో మూడు జిన్నింగ్‌ మిల్లులకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. 

సీసీఐ రాకతో పెరిగిన ధరలు

నేటి భారత పత్తి సంస్థ పత్తిని కొనుగోలు చేస్తుండటంతో ఒక్కసారిగా ప్రైవేట్‌ వ్యాపారులలో కదలిక వచ్చింది. దీంతో మంగళవారం నగర వ్యవసాయ మార్కెట్లో ఊహించని విధంగా పాతపత్తి(గత సంవత్సరం పంట) అధిక ధర పలకడం విశేషం. ఇప్పటికే ఖమ్మం జిల్లా చుట్టుపక్కల రైతులు పంటను మార్కెట్‌కు తరలించారు. సీసీఐ పంట కొనుగోలు ప్రక్రియ చేపడుతుందని తెలిసిన నాటి నుంచి మార్కెట్లో తెల్లబంగారానికి రెక్కలు వస్తున్నాయి. దీంతో పాత పత్తి కంటే కొత్తపంటకు కొనుగోలు చేసేందుకు మాత్రమే వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ బిడ్డింగ్‌లో ఊహించని విధంగా పాతపత్తి పంటకు క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ 5,100 పలుకగా, కొత్త పత్తి పంటకు రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ5,200 పలికింది. తేమశాతం అనుకూలంగా ఉండటం, నాణ్యమైన పంట వస్తుండటంతో ఖరీదుదారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. 

కొనుగోళ్లు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

నేటి ఉదయం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పత్తి కొనుగోళ్ల పక్రియను ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, సెక్రటరీ ఆర్‌.మల్లేషం పూర్తి చేశారు. కొనుగోలు జరిగే జిన్నింగ్‌ మిల్లుల దగ్గర రైతులకు మౌలికవసతులు కల్పించారు. క్రయవిక్రయాలు పూర్తి జరిగేందుకు వేబ్రిడ్జిలు, హమాలీలను సిద్ధంగా ఉంచారు. ఉదయం మంత్రి సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించిన అనంతరం ఖమ్మం మార్కెట్లో పని చేస్తున్న వేలాదిమంది కార్మికులకు (దడవాయిలు, హమాలీలు, ఎడ్లబండి కార్మికులకు) ఉచితంగా యూనిఫాం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ఆయశాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యులు పాల్గొననున్నారు. 


logo