శుక్రవారం 04 డిసెంబర్ 2020
Khammam - Oct 23, 2020 , 04:39:24

చిన్నారులను చేరదీసిన ఖమ్మం టూటౌన్‌ సీఐ గోపి

 చిన్నారులను చేరదీసిన ఖమ్మం టూటౌన్‌ సీఐ గోపి

  • ఆకలి తీర్చి, కొత్త దుస్తులు కొని.. తండ్రికి అప్పగింత

ఖమ్మం సిటీ : వారు అనాథలు కారు.. పోషణ భారమైందో.. కారణాలు ఏవైనా ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను రోడ్డున వదిలేసి వెళ్లిపోయింది. ఏం జరిగిందో తెలియని ఆ పసివాళ్లు అమ్మా, నాన్నలే వచ్చి తీసుకెళతారనే ఆశతో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. లేత ప్రాయాలు కావడంతో ఆకలికి అలమటించారు. కడుపు చేత పట్టుకుని కన్నవారి కోసం వెదకసాగారు. అంతలోనే అటుగా వచ్చిన టూటౌన్‌ సీఐ గోపి వారిని చేరదీశారు. 

ముందుగా బొజ్జనిండా అన్నం పెట్టించి ఆకలి తీర్చారు. తర్వాత కొత్తబట్టలు కొనిచ్చి  అసలు విషయం తెలుసుకున్నారు. వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామానికి చెందిన జల్లి వెంకటేశ్వర్లుకు చెందిన పిల్లలని తెలుసుకున్నారు. తక్షణమే వారి తండ్రికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించి ఖమ్మానికి రప్పించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారుల సమక్షంలో చిన్నారులను వారి తండ్రికి అప్పగించారు. కాగా అనాథల మాదిరి, ఆకలితో అలమటిస్తూ రోడ్డుపై తిరుగుతున్న పసి బిడ్డలను చేరదీసి అక్కున చేర్చుకున్న ఖమ్మం టూటౌన్‌ సీఐ ఔదార్యాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.