శుక్రవారం 04 డిసెంబర్ 2020
Khammam - Oct 22, 2020 , 02:27:28

పోలీసు సేవలకు వందనం

పోలీసు సేవలకు వందనం

  • వారి త్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ
  • కరోనా సమయంలోనూ విలువైన సేవలు
  • రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  • ఖమ్మం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సంస్మరణ దినోత్సవం
  • సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సారథ్యంలో ఫ్లాగ్‌ డే
  • హాజరైన ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల

‘పోలీసుల సేవలు వెలకట్టలేనివి.. వారి కృషి ఫలితమే సమాజంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు.. వారి వల్లే మనం ప్రశాంత జీవితం గడుపుతున్నాం.. వారి త్యాగాలు మరువలేనివి.. వారి సేవలకు సెల్యూట్‌.. పోలీసు అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటాం.. అర్హులైన వారికి డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు అందజేసేందుకు కృషి చేస్తాం..’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.. బుధవారం ఖమ్మం జిల్లాకేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ సారథ్యంలో నిర్వహించిన ‘స్మృతి డే’కు హాజరై పోలీస్‌ సేవలను కొనియాడారు. అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.. కార్యక్రమంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య,  రాములునాయక్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పాల్గొన్నారు..

-  ఖమ్మం సిటీ


ఖమ్మం సిటీ : వెలకట్టలేని పోలీస్‌ సేవలకు సెల్యూట్‌ అని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని (పోలీస్‌ ఫ్లాగ్‌ డే) పురస్కరించుకుని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని పరేడ్‌గ్రౌండ్‌లో ‘స్మృతిపరేడ్‌' నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ..

శాంతి సమాజ నిర్మాణం కోసం అమరుడైన పోలీస్‌ ఉన్నతాధికారి ఉమేశ్‌చంద్రను గుర్తు చేశారు.  కొవిడ్‌-19 లాంటి క్లిష్టపరిస్థితుల్లో మేమున్నామనే భరోసాను ప్రజల్లో కల్పించిన పోలీసు సేవలను ఆయన అభినందించారు. జిల్లాకు పోలీస్‌ కమిషనరేట్‌ హోదా అవసరమనే విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సాధించామన్నారు. దీంతో జిల్లాలో పోలీస్‌ సేవలు మరింత విస్తృత పరిచేందుకు దోహదపడిందని వ్యాఖ్యానించారు. జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటానని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.   సమస్య ఏదైనా నేరుగా వచ్చి తెలియజేయవచ్చునని భరోసానిచ్చారు. పోలీసు అమరుల కుటుంబాలు ఎదుర్కొంటున్న జీవన విధానాన్ని తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌కు సూచించారు.

 ప్రధానంగా అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇచ్చేందుకు తాము సిద్ధ్దంగా ఉన్నామని మంత్రి అజయ్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్నటువంటి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో కొన్నింటిని పోలీసు అమర వీరుల కుటుంబాలకు కేటాయించే విధంగా ప్రణాళికలు సిద్ధ్దం చేయాలన్నారు. ఈ విషయమై కలెక్టర్‌, సీపీ ఇరువురూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.   

అమరుల త్యాగాలు చిరస్మరణీయం.. 

 తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి విచ్చిన్నకర నేరాలకు పాల్పడే అసాంఘీక శక్తులను అరికట్టే క్రమంలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయమని ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్భాల్‌ అన్నారు. జిల్లాలో తీవ్రవాదుల చేతుల్లో 22 మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, నగర మేయర్‌ డాక్టర్‌ గుగులోత్‌ పాపాలాల్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ ఇంజారపు పూజ, అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ మురళీధర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ మాధవరావు, ఏసీపీ విజయబాబు, ఏసీపీలు వెంకట్‌రెడ్డి, వెంకటేష్‌, ప్రసన్నకుమార్‌, వెంకట్రావు, జహంగీర్‌, వెంకటప్రసాద్‌, ఎల్‌సీ నాయక్‌, విజయబాబు, ఏవో అక్తరున్నీసా బేగం, సీఐలు శ్రీధర్‌, గోపి, చిట్టిబాబు, వెంకన్నబాబు, అంజలి, సత్యనారాయణరెడ్డి, సంపత్‌కుమార్‌, శివసాంబిరెడ్డి, సాంబరాజు, కరుణాకర్‌, సురేష్‌, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, రవి, తిరుపతి, సాంబశివరావు, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, జానిమియా, జ్యోతి, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

భద్రతకు భరోసా  : ఎం లక్ష్మణ్‌, జిల్లా సెషన్స్‌ జడ్జి..

నిబద్ధ్దత, అంకితభావంతో పోలీసులు చేస్తున్న విధుల కారణంగానే నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు భరోసా ఉందని జిల్లా సెషన్స్‌కోర్టు జడ్జ్జి ఎం లక్ష్మణ్‌ అన్నారు. కొవిడ్‌ సమయంలో కరోనా బాధితులకు రక్త సంబంధీకులే దూరంగా ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం పోరాటం చేశారని కొనియాడారు.   కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ 24 గంటలపాటు శాంతిభద్రతల కోసం పనిచేసే పోలీసులు పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కొవిడ్‌-19, వరద ముంపు వంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు చూపిన చొరవతో ఎలాంటి అపశ్రుతి లేకుండా జిల్లాలో పరిపాలన సజావుగా కొనసాగిందన్నారు.  

అమరులకు ఘన నివాళులు..

పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఖమ్మం పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన స్మృతి పరేడ్‌ ప్రతిఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. తొలుత దేశవ్యాప్తంగా 2019 సెప్టెంబర్‌ నుంచి 2020 అగస్టు వరకు ఉగ్రవాదుల చర్యలలో అమరులైన 284 మంది పోలీసు పేర్లను, ప్రాంతాలను ఒక్కొక్కటిగా చదువుతూ వారికి ఖమ్మం జిల్లా పోలీసుల తరుపున ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పోలీసు అధికారులు పరేడ్‌గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అమరుల స్మృత్యర్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈక్రమంలో అక్కడికి హాజరైన అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు కంటతడి పెట్టిన తీరు ప్రతిఒక్కరినీ కదిలించింది.