శుక్రవారం 04 డిసెంబర్ 2020
Khammam - Oct 21, 2020 , 03:20:13

సమగ్రాభివృద్ధి దిశగా ఖమ్మం

సమగ్రాభివృద్ధి దిశగా ఖమ్మం

మామిళ్లగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధివైపు దూసుకుపోతుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, నీటిపారుదల, రెవెన్యూ, విద్యా, మహిళ, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, తాగునీటి, వైద్యం పలు శాఖల ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు సకాలం లో అందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు హరితహారం, పల్లె ప్రగతితో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడిందని, ప్రజలు సీజనల్‌ వ్యాధుల నుంచి బయట పడ్డారని తెలిపారు. వరుసుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో జిల్లాలో ప్రమాదాలు తగ్గాయన్నారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి పనుల తీరును ఆయా శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జడ్పీ సీఈఓ ప్రియాంక మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందుతాయని తెలిపారు. 

గురుకుల విద్యార్థులకు అభినందనలు..

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాల్లో చదువుకొని ఐఐటీ సీట్లు సాధించిన విద్యార్థులను జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్‌ ఫలితాల నుంచి మొదలుకుని జేఈఈ, ఎంసెట్‌, నీట్‌ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలలో గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటుకోవడం గర్వకారణమన్నారు. ఇదే కార్యక్రమంలో కిరణ్‌, భరత్‌ అనే యువకులకు కారుణ్య నియామకాల కింద (ఆఫీస్‌ సబార్డినేట్‌ కార్యాలయ సహాయకుడు) ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులను అందజేశారు. 

జడ్పీటీసీలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు..

జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు ఎన్నికైన వారికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ ప్రత్యేక గుర్తింపు అందించారు. ఈ గుర్తింపు కార్డులు జడ్పీటీసీలకు వివిధ పర్యటనలో, మంత్రులు, ఎంపీలు ఇతర సభలలో పాల్గొనే సందర్భంలో పోలీసు వారి నుంచి ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మరికంటి ధనలక్ష్మీ, ఖమ్మం రూరల్‌ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌, జడ్పీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యులు, ఎంపీపీలు , డిప్యూటీ సీఈఓ వివి అప్పారావు, జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి, విద్యుత్‌ శాఖా ఎస్‌ఈ రమేష్‌, ఎస్సీ అభివృద్ధి అధికారి సత్యనారాయణ, బీసీ సంక్షేమాధికారి జి.జ్యోతి, జిల్లావ్యవసాయాధికారి విజయనిర్మల, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ మాలతి, తదితరుల పాల్గొన్నారు.