గురువారం 03 డిసెంబర్ 2020
Khammam - Oct 21, 2020 , 00:46:13

సంఘటితానికి సిసలైన వేదిక

 సంఘటితానికి సిసలైన వేదిక

  • ఒక్కో భవన నిర్మాణానికి రూ.23 లక్షల నుంచి రూ.40 లక్షల వ్యయం
  • 26 గ్రామాల్లో స్థలాలను వితరణ చేసిన దాతలు
  • ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిద్ధమవుతున్న 129 వేదికలు
  • బహుళ ప్రయోజనాలతో దసరా నాటికి అందుబాటులోకి.. 
  •  సొంత ఖర్చులతో రైతు వేదికల నిర్మాణాలు

‘ఆలి ఏడ్చిన ఇల్లు.. ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకు రావు’ అనే లోకోక్తిని దృఢంగా నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. ఇందుకోసం రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్తు, సిబ్సిడీ ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా రైతులందరికీ ఓ వేదిక కావాలని సంకల్పించారు. రైతన్నకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవాలంటే ఓ వేదిక అవసరమని గుర్తించారు. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రాష్ఠ్ర వ్యాప్తంగా ‘రైతు వేదిక’ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ వేదికల ద్వారా రైతులందరినీ సంఘటితం చేయాలని తలచారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించుకోవడం మొదలుకొని సాగు అనుభవాలు, లాభనష్టాల గురించి చర్చించుకునేంత వరకూ ఈ వేదికలు నిశ్చయించారు. ప్రతి 5 వేల ఎకరాలకూ ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి కస్టర్‌కూ ఒక రైతు వేదిక భవనాన్ని మంజూరు చేశారు. వీటిల్లో కొన్నింటిని కొందరు ప్రముఖులు తమ సొంత ఖర్చులతో నిర్మించారు. దసరా నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు.  

రైతును రాజు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందులో తామూ భాగం కావాలన్న తలంపుతో సొంత ఖర్చులతో రైతు వేదిక నిర్మాణానికి ముందుకొచ్చారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖులు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికల్లా వాటిని పూర్తి చేశారు కూడా. కొన్ని రైతు వేదికలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండగా.. మరికొన్ని వేదికలు దసరా నాటికి పూర్తి కానున్నాయి. అయితే దాతలు కూడా ‘మేము సైతం’ అంటూ ముందుకొచ్చి ప్రభుత్వ సంకల్పానికి బాసటగా నిలిచారు. విలువైన స్థలాలను కూడా రైతు వేదికల నిర్మాణం కోసం దానం చేశారు. 

స్థలదాతలకూ కొదువ లేదు.

రైతు వేదికల నిర్మాణాల కోసం సీఎం కేసీఆర్‌ గతంలో కరీంనగర్‌ సభలో ఇచ్చిన పిలుపునకు ఖమ్మం జిల్లాలో మంచి స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 26 మంది దాతలు ముందుకు వచ్చి తమ విలువైన స్థలాలను రైతు వేదికల కోసం వితరణ చేశారు. బోనకల్లు మండలం రాయన్నపేటలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, బచ్చోడు గ్రామంలో బర్ల నారాయణ, దమ్మాయిగూడెం గ్రామంలో ఉన్నం పరమేశ్వర్‌, మల్లారం గ్రామంలో కరివేద వెంకటేశ్వరరావు, రాయపట్నంలో తెల్ల నీలిమ, దెందుకూరు గ్రామంలో చుంచు వెంకటేశ్వరరావు, మామునూరు గ్రామంలో శీలం నారాయణ రెడ్డి, మీనవోలు గ్రామంలో అమర జనార్దన్‌రావు, నాగులవాంచ గ్రామంలో పసుమర్తి రామ్మోహన్‌రావు, వల్లభి గ్రామంలో ఏలూరి రామారావు, చిర్రుమర్రిలో సామినేని సీతయ్య, పమ్మి గ్రామంలో కోలేటి నాగేశ్వరరావు, ఉసిరికాలయపల్లిలో పర్సా పట్టాభి రామారావు, మాణిక్యారంలో భూక్యా రంగారావు, నాచారం గ్రామంలో తోట రాధాకృష్ణ, టీఎఎల్‌పేట గ్రామంలో కొమ్మినేని రంగయ్య, లింగగూడెంలో సూరంపల్లి రమా, కాకర్లపల్లి గ్రామంలో కంచర్ల సత్యనారాయణ, శంభూనిగూడెంలో నల్లమోతు అనసూర్య, కుర్నవల్లి గ్రామంలో సీలం సావిత్రి, మిట్టపల్లి గ్రామంలో మువ్వా దర్గయ్య, అన్నారుగూడెం గ్రామంలో మారెల్ల మల్లికార్జునరావు, బిల్లుపాడులో జక్కంపూడి కృష్ణమూర్తి, పెనుబల్లిలో వేముల వెంకటనర్సమ్మ, కుప్పెనకుంట్ల గ్రామంలో బండారుపల్లి నాగేశ్వరరావు, ఎరుగట్లలో లక్కినేని సత్యనారాయణరావులు తమ సొంత స్థలాలను వితరణ చేశారు. 

రైతును రాజుగా చూడాలన్నదే  ధ్యేయం

రైతును రాజుగా చూడాలన్నదే ప్రధాన ధ్యేయం. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్ర వ్యవసాయ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రామాల్లో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంది. నా వంతు బాధ్యతతో, అన్నదాతలపై మమకారంతో నా సొంత ఖర్చులతో రఘునాథపాలెంలో రైతు వేదిక నిర్మాణాన్ని పూర్తి చేయించాను. రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. నేడు దేశంలోనే సీఎం మన రైతు సంక్షేమ పథకాలు ఆదర్శంగా ఉన్నాయి. 

-పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 

ఆది నుంచి రైతు పక్షపాతులే..

సొంత ఖర్చులతో రైతు వేదికలను నిర్మించిన ప్రముఖులైన సదరు ప్రజాప్రతినిధులు ఆది నుంచీ రైతు పక్షపాతిలుగానే పేరొంది ఉండడం విశేషం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ వంటి వారందరూ రైతు కుటుంబ నేపథ్యం, వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉన్న వారే. 

రైతుల కోసం రూ.లక్షలు వెచ్చించారు..

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 129 క్లస్టర్లకు గాను 129 రైతు వేదికలూ సిద్ధమవుతున్నాయి. వీటిలో రఘునాథపాలెం వేదికను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కూసుమంచి వేదికను పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, వీ వెంకటాయపాలెం వేదికను డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ర్యాంకాతండా వేదికను ఖమ్మం ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ తమ సొంత ఖర్చులతో నిర్మించారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు వరకూ ఖర్చు అవుతోంది. కేవలం వ్యవసాయ రంగంపై మక్కువతో, మమకారంతో, సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో కేవలం మూడు నెలల కాలంలోనే వేదికల నిర్మాణాలు పూర్తి చేయగలిగారు. దసరా నాటికి ఈ రైతు వేదికలు ప్రారంభం కానుండడంతో వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి సంతరిచుకోనుంది. 

నా వంతు బాధ్యతగా రైతువేదిక నిర్మాణం

సమాజానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కూసుమంచిలో రైతు వేదికను నిర్మించాను. మరికొద్ది రోజుల్లోనే రైతులకు అందుబాటులోకి వస్తుంది. రైతులన్నా, వ్యవసాయమన్నా చిన్ననాటి నుంచే చాలా ఇష్టం. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఎక్కడ చూసినా సాగులో నూతన ఒరవడి సంతరించుకుంది. పంటలకు పెట్టుబడి, మద్దతు ధర వంటి అందుతుండడంతో వ్యవసాయం మరింత బలోపేతమైంది.

-కందాల ఉపేందర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే

అన్నదాతల రుణం తీర్చుకోలేనిది

దీర్ఘకాలంగా వీ వెంకటయపాలెం ప్రజలు, రైతులు ఎంతో ఆదరణ కనబరుస్తున్నారు. వారికి ఎంత చేసినా తక్కువే అవుతుంది. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు, మంత్రి పువ్వాడ అజయ్‌గారి సూచన మేరకు వీ వెంకటాయపాలెంలో సొంత ఖర్చుతో రైతు వేదిక నిర్మాణం చేపట్టాను. భవిష్యత్తులో ఈ వేదిక పది కాలాలపాటు రైతులకు ఉపయోగపడాలి. 

-కూరాకుల నాగభూషణం, ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ 

అన్నంపెట్టే రైతన్నకు సాయం చేయడం సంతోషం

సమాజానికి అన్నంపెట్టే రైతన్నకు రైతు వేదికను నిర్మించి ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మంత్రి అజయ్‌కుమార్‌ సహకారంతో ఇప్పటికే రఘునాథపాలెం మండలంలో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. రేపటి తరాలు యాది పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే సొంత నిధులతో రైతు వేదికను నిర్మించాను. -మద్దినేని వెంకటకరమణ, ఖమ్మం ఏఎంసీ చైర్మన్‌

రైతు వేదికలు చరిత్రలో నిలిచిపోతాయి.. 

సీఎం కేసీఆర్‌ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకవస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు నిర్మిస్తున్నారు. ఈ వేదికలు చరిత్రలో నిలిచిపోతాయి. ఖమ్మం జిల్లాలోనే మొట్టమొదటగా మంత్రి అజయ్‌కుమార్‌ మా రఘునాథపాలెం క్లస్టర్‌ పరిధిలో తన సొంత ఖర్చుతో సకల హంగులతో రైతు వేదికను నిర్మించడం సంతోషంగా ఉంది.

-గుడిపుడి శారద, రఘునాథపాలెం సర్పంచ్‌