గురువారం 03 డిసెంబర్ 2020
Khammam - Oct 20, 2020 , 03:00:37

పత్తి కొనుగోళ్లకు సిద్ధం

పత్తి కొనుగోళ్లకు సిద్ధం

  • కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,825
  • వచ్చే నెల మొదటి వారంలో క్రయ విక్రయాలు ప్రారంభం
  • ఉమ్మడి జిల్లాలో 17 సీసీఐ కేంద్రాలు
  • రైతులకు కూపన్లు అందజేసేందుకు ఏర్పాట్లు
  • మంత్రి పువ్వాడ, రెండు జిల్లాల కలెక్టర్లు కర్ణన్‌, ఎంవీ రెడ్డి పర్యవేక్షణ

ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ సర్కార్‌ పత్తి రైతుల కోసం  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది.. వచ్చే నెల మొదటి వారం నుంచి ఉమ్మడి జిల్లాలో 17 సీసీఐ (భారత పత్తి సంస్థ) కేంద్రాల్లో క్రయ విక్రయాలు ప్రారంభించనుంది.. అధికారులు  యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.. గ్రామాల్లో  రైతులకు పత్తి కొనుగోలు కూపన్లు అందజేసేందుకు  సిద్ధమవుతున్నారు.. మంత్రి అజయ్‌కుమార్‌, రెండు జిల్లాల కలెక్టర్లు ఎంవీ రెడ్డి, కర్ణన్‌ ఇప్పటికే అధికారులతో సమీక్షలు సైతం నిర్వహించారు.. విక్రయాల్లో లోటుపాట్లు లేకుండా పనులను  పర్యవేక్షిస్తున్నారు.

- కొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం

నియంత్రిత సాగు విధానానికి జై కొట్టిన రైతన్న పత్తి సాగులో ఈ ఏడాది దూసుకుపోయారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు వానకాలం సాగుకార్డును అనుసరించి సాగు చేయించారు. మక్కకు స్వస్తి పలికిన రైతులు వానకాలం పంటలో గతేడాది కంటే అధికంగా పత్తిసాగు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వంద శాతానికి మించి పత్తిసాగవుతున్నది. ఈ ఏడాది అధిక వర్షాలు కురియడంతో పంటల సాగుకు వాతావరణం అనుకూలించింది. దీంతో అన్ని పంటలు పుష్కలంగా పండాయి. వరి, పత్తి ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేయడంతో దిగుబడి అదే స్థాయిలో వచ్చింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో పంట చేతికి రావడంతో రైతులు పత్తి తీతలో బిజీ అయ్యారు. 


కొత్తగూడెం/ఖమ్మం వ్యవసాయం: రైతన్నకు ఇచ్చిన మాటకు కట్టుబడి భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికలు తయారు చేసింది. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,825గా ప్రకటించింది. కొన్ని రోజుల నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎంవీ రెడ్డి పంటల ప్రణాళికతో వరుసగా సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో సీసీఐ కేంద్రాల్లో క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి. కొనుగోళ్ల విషయంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఆదేశించడంతో వారు ముందస్తు చర్యలు చేపట్టారు. కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

నిబంధనలకు లోబడి కొనుగోళ్లు..

మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే సీసీఐ కొనుగోళ్ల ప్రక్రియ నిబంధనలకు లోబడి జరగనుంది. రైతులు పండించిన పంటను 8శాతం నుంచి 12శాతం వరకు తేమ ఉంటే మాత్రమే కొనుగోలు చేయనున్నారు. ఒక్కో శాతానికి క్వింటాల్‌కు రూ.54.50 చొప్పున ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. సీసీఐ కేంద్రానికి పంటను తీసుకొచ్చే రైతులు తమ వెంట విధిగా ఒరిజనల్‌ రైతుగుర్తింపు కార్డు, పట్టదారు పాసుపుస్తకం, బ్యాంక్‌ ఖాతాపుస్తకం, తీసుకురావాల్సి ఉంటుంది. కేంద్రాల్లో లూజు పత్తిని మాత్రమే అనుమతిస్తారు. తద్వారా రైతుకు ప్రయోజనం చేకూరనుంది. బస్తాల ఖర్చు, తొక్కేందుకు కూలీల ఖర్చుతో పాటు పంట నాణ్యతా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది. నీళ్లతో తడిపిన పత్తి, పంటలో మట్టిపెడ్డలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైతు ఒకేసారి కాకుండా దశలవారీగా పత్తిని తీసుకొచ్చేందుకు అవకాశం కల్పిస్తారు. ఏఏ కేంద్రాల్లో పంటను అమ్ముకోవాలో రైతులు ఒకరోజు ముందుగా కూపన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా  13 సీసీఐ కేంద్రాలు

ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 13 సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపించింది. వీటిలో 10 కేంద్రాలకు ఆమోదం లభించింది. ఖమ్మం మార్కెట్‌ పరిధిలో మూడు జిన్నింగు మిల్లులు, మధిర మార్కెట్‌ పరిధిలో నాలుగు జిన్నింగ్‌ మిల్లులు, నేలకొండపల్లి మార్కెట్‌లో ఒకటి, ఏన్కూర్‌ మార్కెట్‌ పరిధిలో ఒకటి, మద్దులపల్లి మార్కెట్‌ పరిధిలో ఒక జిన్నింగ్‌ మిల్లులకు అనుమతి ఇచ్చారు. వీటితో పాటు మద్దులపల్లి, మధిర, వైరా మార్కెట్‌ పరిధిలోని మరో మూడు జిన్నింగ్‌ మిల్లులకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. 

భద్రాద్రి జిల్లాలో నాలుగు చోట్ల ..

పత్తి విక్రయాలకు రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు జిల్లాలో నాలుగు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిన్నింగ్‌ కాటన్‌ మిల్లుల వద్ద సంబంధిత యం త్రాగాంన్ని సిద్ధం చేశారు. జిల్లాలో మంజిత్‌ కాటన్‌ మిల్లు సుజాతనగర్‌, శ్రీలక్ష్మీకాటన్‌మిల్లు కారేపల్లి, శ్రీరామ కాటన్‌ మిల్లు అశ్వాపురం, అనుశ్రీ ఇండస్ట్రీస్‌ లక్ష్మీపురం ఏరియాల్లో రైతులకు అందుబాటులో ఉంచారు. ఇప్పటికే రైతులకు ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. పత్తిపంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరను కూడా ప్రకటించింది. 

ఖమ్మం జిల్లాలో 2,26,130,  భద్రాద్రి జిల్లాలో 1,66,368 మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనా..

ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు కావడంతో పత్తి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి.  ఖమ్మం జిల్లాలో 2,26,130 మెట్రిక్‌ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 1,66,368 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వంద శాతానికి పైగా పత్తి పంటను సాగు చేయగా  అదే స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాలో 1,83,416 ఎకరాల్లో పత్తిసాగు చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా అంతకు మించి 1,93,191 ఎకరాల్లో పంటను సాగు చేసి రైతులు రికార్డు సృష్టించారు. గత ఏడాది కూడా పత్తిపంటకు డిమాండ్‌ ఉండటం, ఈ ఏడాది అదునుకు వర్షాలు కురియడంతో రైతులందరూ పత్తి పంటపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇందుకు తోడుగా ప్రభుత్వం సకాలంలో రైతుబంధు సాయం చేతికి అందడంతో పత్తిపంటను అధికంగా సాగుచేశారు.

సాగు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు..

ఈ ఏడాది పత్తిసాగు చేపట్టే రైతులకు మార్కెటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మరికొద్ది రోజుల్లో సీసీఐ కేంద్రాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. రైతులు కేవలం లూజు పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలి. పంట నాణ్యతా ప్రమాణాలకు అనుగూణంగా మద్దతు ధర కల్పిస్తారు. మధ్య దళారుల ప్రమేయం లేకుండా రైతుల పంటను మాత్రమే సీసీఐ అధికారులు కొనుగోలు చేయనున్నారు.

-కోలహాలం నాగరాజు, మార్కెటింగ్‌శాఖ అధికారి, ఖమ్మం జిల్లా 

వచ్చే నెల నుంచి కొనుగోలు చేస్తాం..

జిల్లాలో ఇప్పటికే పత్తి పంట తీతకు వచ్చింది. చాలా ప్రాంతాల్లో పత్తిని తీస్తున్నారు. మరో వారం రోజుల్లో రైతు ఇంటికి చేరుతుంది. అందువల్ల కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఆదేశాల మేరకు కూపన్‌లు కూడా రైతులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే నెల మొదటి వారంలో కొనుగోలు చేసే అవకాశముంది. రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.             -నరేందర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, 

-భద్రాద్రి కొత్తగూడెం