శుక్రవారం 23 అక్టోబర్ 2020
Khammam - Oct 18, 2020 , 03:53:41

బతుకమ్మ పండుగకే అందం

బతుకమ్మ  పండుగకే అందం

  • స్వరాష్ట్రం ఏర్పడ్డాక  సరైన గుర్తింపు
  • రాష్ట్ర పుష్పంగా ప్రకటించిన సర్కార్‌
  • తంగేడు పూల విశిష్టతపై ప్రత్యేక కథనం

‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..’ అంటూ ప్రకృతిని ఆరాధిస్తూ ఆడబిడ్డలు పాడుకునే పండుగ రానే వచ్చింది.. అడవిలో దొరికే పూలను కోసుకొచ్చి అందంగా పేర్చి, దైవంగా కొలిచే వేడుక రానే వచ్చింది.. అయితే ఈ పూల సేకరణలో తంగేడు పూలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనికి రాష్ట్ర పుష్పంగా గుర్తింపునిచ్చింది.. ఎంగిలి బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకూ తంగేడు పూవు లేని బతుకమ్మ ఉండదంటే అతిశయోక్తి లేదు..  ఈ పూల విశిష్టతపై ‘నమస్తే’ సండే స్పెషల్‌.

-ఖమ్మం, వ్యవసాయం

ఖమ్మం వ్యవసాయం: తంగేడు.. రెండు మీటర్ల పొడవు కూడా లేని చెట్టు, బంగారు, పసుపు వర్ణాల పువ్వో కాదు.. దైవం కూడా. అవును.. మరుగున పడిన మన సంస్కృతికి జీవం పోసి పూజలకు ఉపయోగించే పువ్వునే పూజించే గొప్ప సంస్కృతి కూడా. అందుకే బతుకమ్మ తెలంగాణలో అతిపెద్ద పూల పండుగ. ఈ పూల పండుగ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది తంగే డు పువ్వు. అందుకే ‘తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ..’ అంటూ పూజిస్తారు. తనకు ప్రీతిపాత్రమైన ఆ పూలతోనే గౌరమ్మను అలంకరిస్తారు. తంగేడు పువ్వు మాత్రమే కాదు.. చెట్టు కూడా ఔషధాల పుట్టే. చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. బతుకమ్మను అలంకరించేందుకు వినియోగించే పూలలో తంగేడు పూలతో ప్రధాన భూమిక. బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పూలతో ఆరోగ్యానికి అందే ఔషధాల గురించే ఈ ‘సండే స్పెషల్‌'.       

మనచుట్టూ ఉండే అనేక వృక్ష సంపదలో అనేక వనమూలికలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మొదలుకొని చర్మసౌందర్యం కోసం వినియోగించే వస్తువుల వరకూ అన్నింట్లోనూ తంగేడు చెట్టుది, తంగేడు పూలదే ప్రధాన పాత్ర. ఆధునిక వైద్యశాస్తం అందుబాటులోకి రాకముందు పూర్వికులు వైద్యం కోసం చెట్లు, వనమూలికల మీదనే ఆధారపడేవారు. ఇప్పుడు కూడా వీటి ప్రాధాన్యం తగ్గలేదు. ముఖ్యంగా తంగేడు చెట్టుతో, తంగేడు పువ్వుతో తెలంగాణ ప్రజలకు విడదీయరాని బంధం ఉంది. ఇందులో బతుకమ్మ పండుగ విశిష్టమైనది. సాధారణంగా ఎక్కడైనా భగవంతున్ని పూలతో పూజిస్తారు. కానీ మన రాష్టంలో పూలను కూడా పూజిస్తారు. ఇదే మన సంస్కృతి. 

పూర్వకాలంలో తంగేడు పుల్లలను వేపపుల్లల్లా పళ్లు తోముకోవడానికి ఉపయోగించేవారు. దాని బెరడును, దాని పొడిని అనేక వ్యాధులకు నివారణగా వాడేవారు. అంటే దానిలో ఎన్ని ఔషధగుణాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతటి గొప్పతనం దాగి ఉన్న పూలు కాబట్టి బతుకమ్మ పండుగలో తంగేడు పూలకు పూర్వికులు ప్రాముఖ్యత ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భవించి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టాక బతుకమ్మ పండుగకు పూర్వవైభవం వచ్చింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక పుష్పంగా తంగేడు పువ్వును ప్రకటించింది. తంగేడు గొప్పదనాన్ని భావితరాలకు అందించింది. 

తంగేడు పుట్టుపూర్వోత్తరాలు ఇలా..

తంగేడు చెట్టు అంటేనే ఓ ఔషధమొక్క. దీని శాస్త్రీయ నామం కేషియా అరిక్యులేటా. బంజరు భూముల్లో, చిట్టడువుల్లో ఎక్కువగా పెరుగుతుంది. బంగారు, పుసుపు మిశ్రమం రంగులా పూలు ఉంటాయి. కొమ్మల చివర గుత్తులుగుత్తులుగా పెరుగుతూ ఉంటాయి. తొలకరి అనంతరం ఇవి పూస్తాయి. బహు వార్షికమైనందున ఏడాది పొడువున దొరుకుతాయి. సిసాల్సినేసియ అనే జాతికి చెందిన ఈ మొక్క బెరడులో అనేక ఔషధగుణాలు దాగి ఉన్నాయి. 

ఆరోగ్యాల వేడుక.. బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగ అంటే ఆటలుపాటలతో ముస్తాబవడం ఒక్కటే కాదు.. ప్రకృతి మనిషికి ఇచ్చే ఆయురారోగ్యాల వేడుక. ఒక్కో మొక్క నుంచి ఒక్కో పువ్వు కోసినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆడబిడ్డలు ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు రోజూ దోసిళ్ల కొద్దీ పూలు కోసుకొని, ఒడినింపుకొని వస్తుంటారు. ప్రకృతి సహజంగా ఆయా పూలలోని ఔషధగుణాలన్నీ వారికి ఆయురోగ్యాలనిస్తాయి. అయితే ఆ పూలన్నింటిలోనూ తంగేడు పువ్వే చాలా విశిష్టమైనది. 

తంగేడు రూప, గుణ ప్రభావాలు

తంగేడులో తుప్పతంగేడు, చెట్టుతంగేడు అనే రెండు రకాలున్నాయి. వీటిలో ఎక్కువగా అందుబాటులో ఉన్నది తుప్పతంగేడు. ఇది రెండుమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. ఏడాదికి రెండుసార్లు మాత్రమే పూస్తాయి. ఈ చెట్టు సర్వాంగాలు వగరుగా ఉంటాయి. వేరు వేడి చేస్తుంది. పూవు, గింజలు మాత్రం చలువ చేస్తాయి. ఉబ్బసం, మదుమేహం వంటి వ్యాధులకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. మెరిసే అందానికి కూడా తంగేడు ఉపయోగకరమే. ముఖ్యంగా చర్య సౌందర్యానికి తంగేడు ఎంతో మేలు చేస్తుంది. 

రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు.. 

తెలంగాణ ఆవిర్భావం తరువాత మన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. తెలంగాణ రాష్ట్ర అధికారిక జంతువుగా జింక, అధికారిక చెట్టుగా జమ్మిచెట్టు, అధికారిక పక్షిగా పాలపిట్టతో పాటు తెలంగాణ పుష్పంగా తంగేడు పువ్వును ప్రకటించింది. అందుకే ప్రకృతి సిద్ధంగా లభించే పుష్పం, తెలంగాణ ఆడబిడ్డలు అమితంగా ఇష్టపడే పుష్పం తంగేడు పువ్వే. 


logo