ఆదివారం 01 నవంబర్ 2020
Khammam - Oct 17, 2020 , 03:26:46

రైతుల పేరుతో దళారుల ఆందోళనలు

రైతుల పేరుతో దళారుల ఆందోళనలు

  •  ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు

మామిళ్లగూడెం : ఖమ్మం నగరంలో రెండు రోజులుగా రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలు దళారులు చేస్తున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం ఖమ్మం టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ప్రజల్లో ప్రతిపక్షాలు ఉనికి కోసం ఆరాటపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరంలో కేవలం ఒక్క రైతుబజారు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత..

ప్రజల అవసరాల నిమిత్తం మరో రెండు రైతు బజార్లు ఏర్పాటు చేసిన విషయం ప్రతిపక్షాలకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా అన్ని ఆధునిక హంగులతో నగర ప్రజలకు అవసరమైన వెజ్‌ ఎండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ను ప్రారంభించిన సంగతి ప్రతిపక్షాలకు తెలవదా? అని అన్నారు. రూ.2.5 కోట్లతో మార్కెట్ల ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు సిద్ధాంతాలను గాలికి వదిలి ప్రజలను తప్పుదోవ పట్టించేందకు పూనుకున్నాయన్నారు. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే తాపత్రయంతో కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలు ఉనికి కోసం పోరాడుతున్నాయి కానీ ప్రజలకోసం కాదన్నారు. నగరంలో ఖమ్మం బస్‌స్టాండ్‌కు ఎదురుగా ప్రత్యామ్నాయంగా వీధి వ్యాపారులు కూరగాయలు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేసిన విషయం మర్చిపోయి, ప్రతిపక్షాలు సోయి లేకుండా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. నగరంలో తప్పుడు ఉద్యమాలు చేస్తున్న వారికి ప్రజలు త్వరలో మరోసారి బద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డీసీసీబి చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, ఖమ్మం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, జిల్లా గ్రంథాయాల చైర్మన్‌ ఖమర్‌, నగర డిప్యూటి మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ నగర సంస్థ అధ్యక్షుడు, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, పిన్ని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.