శుక్రవారం 30 అక్టోబర్ 2020
Khammam - Oct 01, 2020 , 00:15:19

వ్యవసాయేతర ఆస్తుల గణన వేగవంతం చేయాలి

వ్యవసాయేతర ఆస్తుల గణన వేగవంతం చేయాలి

  • రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
  •  ఆస్తుల గణనకు ప్రత్యేక యాప్‌
  • ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌

ఖమ్మం: వ్యవసాయేతర ఆస్తులన్నింటికీ ఆస్తిహక్కు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ధరణీ పోర్టల్‌లో సమాచారం పొందుపర్చేందుకు జిల్లాలో ఆస్తుల గణన ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వ్యవసాయేతర ఆస్తులకు ఆస్తిహక్కు కల్పించే ప్రక్రియపై మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రాష్ట్రంలో చేపట్టిన భూ రికార్డుల నవీకరణ ద్వారా రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులకు పట్టా పాస్‌ పుస్తకాలు జారీ చేసి రైతుబంధును వర్తింప చేశామని, ఆదే తరహాలో వ్యవసాయేతర ఆస్తులన్నింటికీ గణన చేసి ఆస్తి హక్కు కల్పించడంతో పాటు మెరూన్‌ కలర్‌ పాస్‌బుక్‌లను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దసరా నుంచి ప్రారంభం కానున్న ధరణీ పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల సమగ్ర డేటాను పొందుపర్చేందుకు ఆస్తుల గణన ప్రక్రియ ప్రారంభమైందని, ఆస్తుల గణనకు వచ్చే అధికారులకు  ప్రజల సమగ్ర సమాచారాన్ని చెప్పి సహకరించాలని ప్రజలను మంత్రి కోరారు. ప్రధానంగా ప్రైవేటు ఆస్తులకు సంబంధించి ఇండ్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్సులు, మున్సిపల్‌ నెంబర్లు కలిగిన నగర పరిధిలో సుమారు 68వేలు ఉన్నాయని, మున్సిపల్‌ అసెన్‌మెంట్‌ కాని ఆస్తులను, ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న పేదల నివాసాలను క్రమబద్ధీకరించి పాస్‌ బుక్‌ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  

జిల్లా ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో  వ్యవసాయేతర ఆస్తుల గణనకు ప్రత్యేక యాప్‌ ద్వారా ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు మధిర, వైరా, సత్తుపల్లి, మున్సిపల్‌ పరిధిలో ఆస్తుల గణన సర్వే ప్రక్రియ చేపట్టామని, సమగ్ర డేటాను సేకరించి ధరణీ పోర్టల్‌లో నమోదు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆస్తుల సమాచారంతో పాటు కుటుంబ సమాచారాన్ని కూడా సేకరిస్తున్నామని, ఇంటింటికి సర్వే ప్రక్రియలో భాగంగా అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని ప్రజలు అందించి సహకరించాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి వార్డుకు 4గురు అధికారులతో కూడిన 50 బృందాల చొప్పున నియమించినట్లు వివరించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, నగర మేయర్‌  పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగర కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి తదితరులు పాల్గొన్నారు.