గురువారం 29 అక్టోబర్ 2020
Khammam - Oct 01, 2020 , 00:15:19

ఇంతింతై ఖ‌మ్మ‌మంతై

ఇంతింతై ఖ‌మ్మ‌మంతై

  • అరవై  ఏ డేండ్ల ఖమ్మంలో అనూహ్య మార్పులు
  • అడవిమృగాల అడ్డా నుంచి ఐటీ హబ్‌గా ఎదిగిన తీరు 
  • సమితి నుంచి  కార్పొరేషన్‌గా  ఖమ్మం రూపాంతరం
  • విద్య, వైద్యరంగంలో గణనీయ అభివృద్ధి 
  • స్వరాష్ట్ర సాధనతో  మారిన ముఖచిత్రం 
  • నేడు ఖమ్మం జిల్లా  ఆవిర్భావ దినోత్సవం

నాడు అదొక అభయారణ్యం. ఎటుచూసినా పనికిరాని బోళ్లు.. నడవటానికి వీలులేని బాటలు. లాంతర్ల వెలుతురులో రాళ్లు,     రప్పల్లో ప్రయాణం. ఎక్కడచూసినా ఉపాధి లేమితో కొట్టుమిట్టాడే జనం. అక్షరజ్ఞానం అంతంతమాత్రంగా ఉండే ఆ ప్రాంతంలో.. ప్రాథమిక చికిత్సే దిక్కు. నేడు ఆ ప్రాంతమంతా హైటెక్‌ వెలుగులతో విరాజిల్లుతున్నది. ఇంతింతై వటుడింతై.. అన్నట్లుగా సమితి నుంచి కార్పొరేషన్‌ స్థాయికి ఆ నగరం రూపాంతరం చెందింది. ఊహించని మలుపుతో అడవి మృగాల అడ్డా నుంచి నేడు ఐటీ హబ్‌గా ఎదిగింది. ఎంతోమంది నిరుద్యోగులకు కల్పతరువైంది. విద్యకు, వైద్యానికి దిక్కేలేని ఆ ప్రాంతంలో వీధికో బడి, గుడి అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక చికిత్సే పరమవైద్యం అనుకునే స్థితి నుంచి.. హైటెక్‌ హంగులతో ప్రాణాలు నిలబెట్టే ఆపరేషన్లకు అడ్డాగా మారి.. తనస్థితిని ప్రత్యేకంగా చాటిచెప్పింది. ఎన్ని ఆటంకాలెదురైనా స్తంభాద్రి పేరును సార్థకం చేసిన ఆ పోరాటాల పురిటిగడ్డ.. నేడు అభివృద్ధికి అడ్డాగా మారింది. ఆ ప్రాంతమే.. మన ఖమ్మం. నేడు ఖమ్మం  ఆవిర్భావ దినోత్సవం.ఈ సందర్భంగా ‘నమస్తే’ అందిస్తున్న    ప్రత్యేక కథనం మీ కోసం.  

- ఖమ్మం వ్యవసాయం


ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం.. ఈ పేరులో వింటే తెలియని పులకింత. ఆ పేరులో పోరాటం ఉంది. ఇక్కడి నీళ్లకు ఎదురొడ్డే ధైర్యం ఉంది. అందుకే అనతికాలంలోనే అనూహ్య మార్పులతో ఖమ్మం పట్టణం గుర్తుపట్టలేనంతగా అభివృద్ధి చెందింది. ఓరుగల్లు నుంచి విడిపోయి 1953 అక్టోబర్‌ 1న ఖమ్మం జిల్లాగా ఏర్పడిన నగరం.. నేడు స్వరాష్ట్ర పాలనలో అనేక మార్పులకు ప్రత్యక్షసాక్షిగా నిలిచింది. స్తంభం నుంచి స్తంభాద్రిగా, స్తంభాద్రి నుంచి ఖంభం మెట్టుగా చివరికి ఖమ్మంగా మారింది. నాటి నుంచి నేటి వరకూ పరిస్థితులకు అనుగూణంగా నగరం రూపాంతరం చెందింది. గతంతో పోల్చితే విద్య, వైద్యం, ఉపాధి, పరిపాలన, ఆధ్యాత్మిక రంగాలలో భారీ మార్పులు కళ్లముందే కనిపిస్తున్నాయి. 

ఆనవాళ్లు దొరకనంతగా అభివృద్ధి

నాడు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ఈ ప్రాంతం.. ప్రస్తుత ఆ ఆనవాళ్ళకూడ దొరకనంతగా అభివృద్ధి సాధించింది. ఇండస్ట్రీయల్‌ , విద్యారంగం, వైద్య రంగంలో నగర, జిల్లా వాసులకే పరిమితం కాకుండా పొరుగున ఉన్న కృష్ణా, నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి వచ్చి వేల సంఖ్యలో నగరంలో ఉపాధి పొందుతున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా హైదరాబాద్‌, వరంగల్‌ వంటి నగరాలతోపోటీ పడుతూ అభివృద్ధి పథంలో నడుస్తున్న నగరం మన ఖమ్మం. ప్రస్తుతం నగరంలో ఉన్న కార్మికులకు, మహిళలకు, యువకులకు ఉపాధి అవకాశాలకు కొదవలేదు. నగరంలోని అన్ని రంగాల్లో దాదాపు 70-80 వేల మంది దినసరి, నెలసరి ఉపాధి పొందుతున్నారు. ఖమ్మానికి వన్నెతెస్తున్న వాటిల్లో గ్రానైట్‌ పరిశ్రమకే ప్రథమస్థానం దక్కుతుంది. ఇక్కడ తయారైన గ్రానైట్‌ వివిధ రాష్ట్రంతోపాటు దాదాపు 15 దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఇక్కడ పప్పు మిల్లులు, రైస్‌మిల్లులు, ఐస్‌ ఫ్యాక్టరీ, బిస్కెట్‌, ప్లాస్టిక్‌ తయారీ ఇలా అనేక ఇండిస్ట్రీస్‌ సంఖ్య ఏటేటా పెరుగుతున్నది.

స్వరాష్ట్ర సాధనతో మారిన ముఖచిత్రం

తెలంగాణకు ముందు ఖమ్మం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఖమ్మం. ఈ విషయాన్ని పరిశీలిస్తే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపాధికి నేడు ఖమ్మం నగరం అడ్డాగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రానెట్‌ పరిశ్రమ నిలదొక్కుకుంది. దీంతో నేడు వేలాది కుటుంబాలకు జీవనాధారమైంది. అనేక షాపింగ్‌మాల్స్‌ రావడంతో నగరవాసులకు ఉపాధి దొరికింది. నగరానికి ఇరువైపుల విశాలమైన రహదారులు అందుబాటలోకి వచ్చాయి. నగరనాకి తలమానికంగా లకారం ట్యాంక్‌బండ్‌, మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న ఐటీహబ్‌తో ఖమ్మం నగరం మరింత గుర్తింపు తెచ్చుకోనుంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ సహకారం, మరోవైపు నిత్యశ్రామికుడిగా ముద్రపడిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో ఖమ్మం నగరం రోజు, రోజుకూ అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతున్నది. దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న గోళ్లపాడు చానెల్‌ కాలువ ఆధునీకరణ, ముస్తఫానగర్‌ ప్రాంతంలో ఆర్‌ర్‌బీ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో నగరవాసుల ఆనందాలకు అవధులు లేవు. విద్య, వైద్యరంగాలతో పాటు వ్యవసాయరంగం సైతం మరింత బలోపేతం కావడంతో తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా సరికొత్త నగరంగా రుపుదిద్దుకొనున్నది. 

మౌలిక వసతులు భేష్‌..

మౌలిక వసతుల రూపకల్పనలో అనాటి నుండి నేటి వరకు రాజీలేదు. ఒకప్పటి తహశీల్దార్‌ పరిధి నుంచి నేడు కార్పొరేషన్‌స్థాయికి ఎదిగింది. అదే తరహాలో నగరంలో మౌలిక వసతులకు కొదవలేదు. డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గతరోడ్లు, గతంలో లాంతర్ల వెలుగులో ఉన్న నగరం నేడు హైమాక్స్‌ లైట్ల వెలుతురుతో విరాజిల్లుతున్నది. దానితోపాటు జాతీయ రహదారుల నిర్మాణం, నగరంలో అనేక అంతర్జాతీయ వ్యాపార లావేదేవీలు, జాతీయ, అంతర్జాతీయ బ్యాంక్‌లు, క్రీడాప్రాంగణాలు, ఆధునిక టెక్నాలజీ కలిగిన సినిమా థియేటర్లు, వేల సంఖ్యలో వాహనాలు, దాదాపు 3 లక్షల జనాభాకు పరిపడ మంచినీటి పథకం, వీధివీధికో వాటర్‌ ట్యాంకు నిర్మాణంతోపాటు అనేక మౌలిక వసతుల కల్పనతో ఖమ్మం అతి తొందరలోనే గ్రేటర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.

దౌమస్‌లాపురం నుంచి ధంసలాపురం

ఇప్పటి ధంసలాపురం గ్రామం.. నైజాం నవాబుల పరిపాలనలో దౌమస్‌లాపురంగా ఉండేది. ఆ పేరు అప్పటి నైజాం రాజు పెట్టారు. అప్పటి ముస్లిం నవాబుకు ఒక చెల్లి ఉండేది. ఆమె కోరిక మేరకు ఒక గ్రామాన్ని కట్టించి, దానికి ‘దౌమస్‌లాపురం’ అని పేరు పెట్టినట్లు ఆధారాలున్నాయి. కాలక్రమేణా ఆ పేరు ధంసలాపురంగా మారింది.

విద్య, వైద్యరంగాలకు నెలవు

ఖమ్మం పోరాటాల పురుటిగడ్డ. ఉద్యమాలతో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చింది ఖమ్మం. స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న మలిదశ పోరులో ఖమ్మం పాత్రం అనిర్వచనీయం. గతంలో అరకొర వసతుల మధ్య ఉన్న విద్యాలయాలు ఉండేవి. నేడు వీధికో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు నెలకొన్నాయి. కార్పొరేట్‌ పాఠశాలు, ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు సైతం నగరంలో దర్శనమిస్తున్నాలు. కొన్ని కాలేజీలలో (ఇంజనీరింగ్‌) అంతర్జాతీయ టెక్నాలజీకి సమానంగా కళాశాలలు ఏర్పడ్డాయి. నర్సరీ నుండి పీజీ వరకు ఇలా అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఖమ్మం నుంచి వెళ్లిన వారు దాదాపు 30 దేశాలల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వైద్యరంగానికి వస్తే గతంలో నగరం మొత్తం 10 పడకల ఆసుపత్రికే పరిమితమైతే.. నేడు జిల్లా ప్రధాన ఆస్పత్రిలోనే 600 వందల పడకలున్నాయి. ఇక నగరం మొత్తం 350 ప్రైవేట్‌ ఆస్పత్రులున్నాయి. వైద్యఅవసరాల నిమిత్తం ఇతర జిల్లాల నుంచి రోజుకు వేల సంఖ్యలో రోగులు నగరానికి వస్తుంటారు. వైద్యరంగంలో నగరం సాధించిన ఘనతగా చెప్పవచ్చు. ప్రథమ చికిత్స మొదలుకొని హార్ట్‌ ఆపరేషన్‌ వరకూ అంతర్జాతీయస్థాయి సదుపాయాలు నగరంలో ఉన్నాయి. ఈ రెండు రంగాలు.. నగరానికి రెండు కళ్లవంటివి.

ఇదీ ఖమ్మం చరిత్ర..

తెలంగాణకు ఖమ్మం జిల్లా తూర్పు ప్రాంతంగా ఉంటుంది. అప్పట్లో జిల్లాకు ఉత్తరభాగాన ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్టాలు, తూర్పున పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. పడమర నల్గొండ, వరంగల్‌ జిల్లాలు, దక్షిణాన కృష్ణాజిల్లాలు సరిహద్దులుగా ఉండేవి. ఖమ్మం జిల్లా 1953లో పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పాటు చేయబడింది. అప్పటి వరకు వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం మధిర, ఇల్లెందు, బూర్గుంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేశారు. 1959లో అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు. తొలిరోజులలో ఖమ్మం మొత్తం ఒకటిగా ఉండేది కాదు. 1905 వరకు వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం ఊరి మధ్యలో స్తంభాద్రి నుంచే మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలిస్తుండేవారు. అందుకే దీనికి ‘స్తంభాద్రి’ అనిపేరు. చరిత్రకారుల కథనం ప్రకారం ‘ఖమ్మం’ అనే పేరు పట్టణంలోని ‘నరసింహాద్రీ’ అని పిలవబడే ‘నరసింహాలయం’ నుంచి వచ్చినట్టుగా కాలక్రమేణ అది.. ‘స్తంభ శిఖారి’గాను ఆపై ‘స్తంభాద్రి’గా పిలవబడినట్లు చరిత్ర చెబుతుంది. ఉర్దుభాషలో ‘ఖంబ’ అనగా ‘రాతిస్తంభం’ కాబట్టి ‘ఖమ్మం’ అనే పేరు వచ్చినట్లుగా మరొక వాదన. నిజాంస్టేట్‌ 1870 రైల్వే మ్యాప్‌ ప్రకారం ఈ పట్టణం ‘ఖమ్మం మెట్టు’గా పేర్కొనబడింది.

సర్వమతాల నిలయం స్తంభాద్రి

నగరం ఏర్పడే నాటికి ఈ నగరంలో హిందూ, ముస్లిం , క్రైస్తవ మతాలకు సంబంధించి ప్రఖాతిగాంచిన పుణ్యక్షేత్రలు కట్టబడి ఉన్నాయి. హిందులకు స్తంభాద్రిగుట్టపై ఉన్న లక్ష్మినరసింహదేవాలయం, ముస్లింల కోసం నగరంలోని ఖిల్లాకు సమీపంలో ‘సోందే షాహిద్‌ దర్గా’, క్రైస్తవుల కోసం బైపాస్‌ రోడ్డులో  కరుణగిరి చర్చి, చర్చికంపౌండ్‌లో చర్చి ఉండేవి. అప్పటి నుంచే ఖమ్మంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ప్రస్తుతం నగరంలో 12 రాష్ర్టాలకు చెందిన ప్రజలతోపాటు, రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న జిల్లాలకు చెందిన వారు నగరంలో ఆయా వ్యాపారం, వృత్తులలో స్థిరపడిన వారు కోకొల్లలు.

నాటి పురాణపురమే నేటి బుర్హాన్‌పురం

నైజాం పాలనలో ఈ ప్రదేశాన్ని పురణాపురంగా పిలిచేవారని అందుకు కారణం అప్పటి ముస్లింరాజు జఫరుద్దేలా. ఈ ప్రాంతములోని కొందరి బ్రాహ్మణులను పిలుపించుకొని కాలక్షేపం కోసం పురాణ కథలు చెప్పించుకునేవాడట. అందుకు ప్రతిఫలంగా ఒక అగ్రహారన్ని వారికి బహుకరించి, దానికి ‘పురాణపురం’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది ‘బుర్హాన్‌పురం’గా పిలువబడుతుంది. ఇప్పటి ఈ బుర్హాన్‌పురంలో ఖమ్మంజిల్లా ఏర్పడేనాటికి ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, డీఆర్‌డీఏ కార్యాలయాలు ఉండేవని చెబుతున్నారు పూర్వీకులు. ప్రస్తుతం ఉన్న డిపో ప్రాంతం మామిళ్ళగూడెం ప్రాంతంలో పెద్దపెద్ద మామిడితోటలు ఉన్నాయట. స్తంభాంద్రి నగరంలో బుర్హాన్‌పురం ప్రాంతం అతిపెద్ద సమూహంగా ఉండేది.