గురువారం 22 అక్టోబర్ 2020
Khammam - Sep 30, 2020 , 00:11:16

మారుమూల ప్రాంతాల విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందించాలి

మారుమూల ప్రాంతాల విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందించాలి

ఖమ్మం: జిల్లాలోని గిరిజన, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా డిజిటల్‌ విద్యను అందించాలని అధికారులను కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశించారు. డిజిటల్‌ విద్యాబోధనపై విద్యాశాఖ సెక్టోరల్‌ అధికారులతో మంగళవారం సాయంత్రం తన ఛాంబర్‌లో సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు విద్యాసంస్థలలో జరుగుతున్న డిజిటల్‌ విద్యాబోధన వివరాలు సేకరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కామేపల్లి, ఏన్కూర్‌, సింగరేణి మండలాల్లోని గుత్తికోయల నివాస ప్రాంతాలతోపాటు గిరిజన నివాస ప్రాంతాలలో విద్యార్థులకు డిజిటల్‌ మాధ్యమాల ద్వారా విద్యాబోధన జరిగేందుకు అవసరమైన టెలివిజన్లు, డిజిటల్‌ మాధ్యమాలను ఏర్పాటు చేయాలని డీఈఓను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయిలో అదనంగా యూ ట్యూబ్‌ చానెల్‌ ద్వారా నిర్వహిస్తున్న విద్యా బోధనను మరింత మెరుగుపర్చాలని అన్నారు. డిజిటల్‌ విద్యాబోధనను సెక్టోరల్‌ అధికారులతోపాటు ఎంఈవోలు, హెచ్‌ఎంలు ప్రతి రోజు పర్యవేక్షించాలన్నారు. డిజిటల్‌ తరగతులకు ఎటువంటి అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ విద్య ప్రసారాలను కేబుల్‌ ఆపరేటర్లు నిరంతరాయంగా ప్రసారం చేసేలా సెక్టోరల్‌ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల మేనేజ్‌మెంట్‌ కమిటీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈవో మదన్‌మోహన్‌, అర్బన్‌ ఎంఈవో శ్రీనివాసరావు, సెక్టోరల్‌ అధికారులు పాల్గొన్నారు. 


logo