గురువారం 29 అక్టోబర్ 2020
Khammam - Sep 30, 2020 , 00:04:56

ఏఎంసీలో కొత్త పత్తిపంట

ఏఎంసీలో కొత్త పత్తిపంట

ఖమ్మం వ్యవసాయం : వానకాలం సాగు చేసిన పత్తిపంట ఎట్టకేలకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు చేరుకుంది. గతేడాది దసర పండుగ ముందు మాత్రమే పంట మార్కెట్‌కు రావడం ప్రారంభం కాగా ఈ సంవత్సరం దాదాపు పక్షం రోజుల ముందే రైతులు మార్కెట్‌కు తీసుకరావడం విశేషం. ఖమ్మం రూరల్‌ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన ఏ సత్యనారాయణ తన తొలిపంటకు సంబందించి 15బస్తాలు తీసుకువచ్చాడు. నూతన పంట మార్కెట్‌కు వచ్చిన సమయంలో ఆనవాయితిగా సదరు అడ్తీదారుడు, ఖరీదుదారుడు, కార్మికులు ఎంతో ఉత్సాహంగా క్రయవిక్రయాల్లో పాల్గొన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పత్తిపంట నాణ్యత కోల్పోయింది. జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉండటం, సీసీఐ సైతం మద్దతు ధర పెంచడంతో ఖరీదుదారులు ఆశాజనకంగానే ధర నిర్ణయించారు. దీంతో తొలిపంటకు రూ.3,911 నిర్ణయించి కొనుగోలు చేశారు. వర్షాలు తగ్గుముఖం పడితే వచ్చే నెలలో పంట ఉత్పత్తుల రాక జోరు అందుకోనుంది. అందుకు అనుగుణంగానే జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్లతో పాటు, జిన్నింగ్‌ మిల్లుల దగ్గర సైతం భారత పత్తి సంస్థ కొనుగోళ్లు ప్రారంభించేందకు సన్నహాలు చేస్తుంది.