సోమవారం 30 నవంబర్ 2020
Khammam - Sep 29, 2020 , 00:20:25

దసరాకు ‘డబుల్‌' సంబురం

 దసరాకు ‘డబుల్‌' సంబురం

  • సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ 
  • చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
  • ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్‌ కృషి
  • టేకులపల్లిలో 1,648 ‘డబుల్‌' ఇండ్ల నిర్మాణాలు పూర్తి
  • వచ్చే నెలలోగృహ ప్రవేశాలు
  • లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించిన రెవెన్యూ అధికారులు
  • ఖమ్మం కార్పొరేషన్‌లోపూర్తయిన దరఖాస్తుల స్వీకరణ
  •  ఖమ్మం నిరుపేదలకు ప్రభుత్వ కానుక

‘ఇల్లు కట్టి చూడు.. పిల్ల పెండ్లి చేసి చూడు’ అని నిట్టూర్చిన పేదలకు ఈ ఏడాది దసరా పండుగా ‘డబుల్‌' సంతోషాన్ని పంచనున్నది. ఖమ్మం పట్టణంలోని అర్హులైన నిరుపేదలకు 1,648 డబుల్‌ బెడ్రూమ్‌లు అన్ని హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నారు.  ఈ దసరా పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌  ఇండ్లను ప్రారంభించి.. పేదల సొంతింటి కలను నెరవేర్చనున్నారు.

ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కల అతి త్వరలోనే నెరవేరనున్నది. టేకులపల్లి వద్ద దాదాపు 1,648 డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. నియోజకవర్గ శాసనసభ్యుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ సహకారంతో అనతి కాలంలోనే నిరుపేదల ఆశలు ఫలించే సమయం ఆసన్నమైంది. ఈ డబుల్‌ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన తరువాత.. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో కూలీలు, ఇసుక లేక పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రత్యేక చొరవ చూపి కూలీలు, ఇసుక కొరతను తీర్చడంతో పనులు పట్టాలెక్కాయి. అనుకున్న సమయంలోగానే ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. ఖమ్మం సమీపంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూమ్‌ కాలనీని ఈ దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు మంత్రి పువ్వాడ ఏర్పాట్లు చేస్తున్నారు.

మొదలైన లబ్ధిదారుల ఎంపిక మరోవైపు అర్హులైన అబ్ధిదారుల ఎంపిక చేసే విధంగా కార్పొరేషన్‌ రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.ఇప్పటికే ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని నిరుపేదల నుంచి డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల కొరకు దరఖాస్తులు స్వీకరించారు. మూడు రోజుల పాటు ఆయా డివిజన్‌లలో రెవెన్యూ అధికారులు దరఖాస్తులు తీసుకొని ఆ వెంటనే విచారణను చేపట్టారు. అర్హులను ఎంపిక చేసే ప్రకియ నగరంలో వేగంగా జరుగుతుంది. ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం మూడు వేల ఇండ్లు మంజూరు అయ్యాయి. వీటిలో ఇప్పటికే 2944 ఇండ్లకు టెండర్‌ ప్రకియ పూర్తయింది. కాగా టేకు లపల్లిలో నిర్మిస్తున్న 1,648 ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. మంత్రి పువ్వాడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనులు వెనువెంటనే జరుగుతున్నాయి. ఈక్రమంలోనే ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతోపాటు దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా.. రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇండ్లను కేటాయించేందుకు కసరత్తు చేస్తున్నారు.

సబ్బండ వర్గాల అభివృద్ధే లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సర్కార్‌ ప్రధాన ఆశయాలు. అత్యవసర, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సమగ్ర కార్యాచరణకు నడుంబిగించింది. ప్రధానంగా ‘ఉమ్మడి’ పాలనలో దగాపడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు యావత్‌ భారతదేశమే ఆశ్చర్యపోతున్నది. వాటిలో భాగంగానే పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని భావించిన ముఖ్యమంత్రి ‘డబుల్‌ బెడ్‌రూం’ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా మంత్రి పువ్వాడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను త్వరతిగతిన పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. పనులు వేగవంతం అయ్యేలా కృషి చేస్తున్నారు. కాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి అజయ్‌, టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు, కార్పొరేటర్లు, నగర ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. శరవేగంగా నిర్మాణాలు..

మొదటి విడత ఒక్కో నియోజకవర్గానికి 400 ఇండ్లను మంజూరు చేసిన ప్రభుత్వం.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరిక మేరకు ఖమ్మానికి 2000 ఇండ్లను కేటాయించింది. ఆ తరువాత మరో వెయ్యి ఇండ్లను మంజూరు చేశారు. ప్రస్తుతం 3 వేల ఇండ్ల నిర్మాణాలు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని టేకులపల్లి, వైఎస్‌ఆర్‌నగర్‌, అల్లీపురం, రఘునాథపాలెం మండలంలోని రఘునాథపాలెం, వీవీ పాలెం, మంచుకొండ, కోయచెలక, రేగులచెలక, పాపటపల్లి, చింతగుర్తి గ్రామాల్లో డబుల్‌ ఇండ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాటిని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దసరాకు గృహ ప్రవేశాలు.. టేకులపల్లిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక్కడ 42 బ్లాక్‌లలో జీ ప్లస్‌ టూలో మూడు ఫ్లోర్‌లను నిర్మిస్తున్నారు. ఒకొక్క బ్లాక్‌లో 24 ప్లాట్స్‌ ఉన్నాయి. ఒకొక్క ఇంటికి ప్రభుత్వం రూ.5.30 లక్షలను ఖర్చు చేస్తుంది. టేకులపల్లిలో నిర్మిస్తున్న 1,648 ఇండ్లకు గాను 87కోట్ల 34 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. వైఎస్‌ఆర్‌ నగర్‌లో జీప్లస్‌ 2 పద్ధతిలో నిర్మించిన డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లు గతంలో లబ్ధిదారులకు అందజేశారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్లతో పాటు ఆ కాలనీకి సీసీ రోడ్లు, టాయిలెట్స్‌, ప్లంబింగ్‌, విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వాటర్‌ కనెక్షన్‌ మాత్రం ఇవ్వాల్సి ఉంది. మంత్రి ఆదేశాలతో సకాలంలో నిర్మాణాలు పూర్తి ఖమ్మం సమీపంలోని టేకులపల్లిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల సముదాయాలు దాదాపు పూర్తికావొచ్చాయి. మంత్రి ఆదేశాలతో ఈ దసరా నాటికి మిగిలి ఉన్న పనులు కూడా పూర్తి చేస్తాం. నిధులకు ఎలాంటి కొరత లేదు. జిల్లా కలెక్టర్‌ వారంలో రెండు సార్లు పనులను పరిశీలిస్తున్నారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు గాను చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంది. అవి కూడా నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - శ్యామ్‌ప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ, ఖమ్మం