మంగళవారం 27 అక్టోబర్ 2020
Khammam - Sep 28, 2020 , 00:33:57

ఆక్రమార్కుడు

ఆక్రమార్కుడు

  • టీఎన్‌జీవోస్‌ నేతది ఆది నుంచీ బెదిరింపు ధోరణే..
  • మున్సిపల్‌ రోడ్డును ఆక్రమించి కాంప్లెక్స్‌ నిర్మాణం
  • గ్రౌండ్‌ఫ్లోర్‌ అనుమతితో అంతస్తుల కట్టడాలు
  • తరువాత పర్మిషన్‌ రికార్డులు మాయం చేయించిన నేత 
  • రోడ్డు ఆక్రమణను పశ్నించిన వారికీ బెదిరింపులు

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  టీఎస్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీ నాయకుడి భూ బాగోతాలు రోజురోజుకూ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు సం ఘాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ఆరాచాకాలన్నీ బయటకు పొక్కడంతో సదరు వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉద్యోగుల హౌసింగ్‌ సొసైటీ పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కోట్లకు పడగలెత్తిన సదరు నాయకుడి అక్రమాలు అనేకం. ఆయన వల్ల మోసపోయిన, దగా పడిన ఎంతోమంది ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్లు చేసి గోడును వెళ్లబోసుకుంటున్నారు. సదరు ఉద్యోగ సంఘ నాయకుడు తొలి రోజుల నుంచే తన సహజ ధోరణితో సభ్యులను బెదిరించేవాడు. ఆరాచకాలను నిలదీసిన ఉద్యోగ సంఘం నాయకులను ఎదో ఒక సాకుతో బయటకు వెళ్లగొట్టేవాడు. ఎవరో ఒకరు దైర్యం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చిన అధికారులను సైతం మచ్చిక చేసుకొని సంబంధిత నివేదికలను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేవాడు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించంలో, ప్రభుత్వ రోడ్లను మింగేయడంలో ఆయన దిట్ట. 

మున్సిపల్‌ రోడ్డు ఆక్రమణ

టీఎస్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీ నేత లెనిన్‌నగర్‌లో దాదాపు 15 ఏళ్ల క్రితం తన ఇంటిని నిర్మించుకున్నాడు. తనకున్న అంగ, అర్థ బలంతో మున్సిపల్‌ రోడ్డును ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాడు. అయితే మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిన సైతం బెదిరించినట్లు ఆరోపణలు లేకపోలేదు.మున్సిపల్‌ రో డ్డుపైనే తన భారీ బంగ్లా మెట్లను నిర్మించి తన ఖరీదైన వాహనాల పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నాడు. ఇదేమిటని ఇరుగుపొరుగు వారు అడిగితే వారిని తనకున్న గన్ను (ఆయుధం)తో బెదిరించినట్లు సమాచారం. ఖమ్మం మున్సిపాలిటీలో పనిచేసే తన సామాజిక వర్గానికి చెందిన ఒక ఉద్యోగి అండదండలతో ఈ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే మున్సిపల్‌ రోడ్డును ఆక్రమించిన విషయంపై సదరు ఉద్యోగ సంఘంలోని నాయకులు కొద్దిమంది గతంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నేటికీ ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆ విధంగానే ఉంది. 

రికార్డులు మాయం..

టీఎస్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీ నాయకుడి ఇంటి నిర్మాణ విషయంలో అవకతవకలపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదులు వెళ్లాయి. సరైన అనుమతులు లేకుండానే బంగ్లా నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్‌ అధికారులకు దరఖాస్తు చేసుకున్న సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌ వరకే అనుమతులు వచ్చాయి. కానీ నిబంధనలు ఉల్లంఘించి ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మున్సిపల్‌ కార్యాలయంలో పని చేసే ఒక ఉద్యోగి సహకారంతో సంబంధిత ఇంటి అనుమతులకు సంబంధించిన రికార్డులను మాయం చేసినట్లుగా ఆ శాఖలోని ఉద్యోగులు కొందరు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. 


logo