బుధవారం 02 డిసెంబర్ 2020
Khammam - Sep 28, 2020 , 00:33:57

‘డబుల్‌' పథకం గొప్పవరం

‘డబుల్‌' పథకం గొప్పవరం

  • రఘునాథపాలేన్ని నెంబర్‌ వన్‌ మండలంగా తీర్చిదిద్దుతా
  • చింతగుర్తిలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది
  • గృహ ప్రవేశాల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌

రఘునాథపాలెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఇండ్లు లేని నిరుపేదలకు ఈ ‘డబుల్‌' పథకం ఒక వరమని అన్నారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామం లో పూర్తయిన 20 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు లబ్ధిదారులతో గృహ ప్రవేశం కార్యక్రమం ఆదివారం పండుగ వాతావరణంలో జరిగింది. మంత్రి అజయ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. పలువురు లబ్ధిదారుల ఇండ్లలోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేయించారు. సొంతింటికి వచ్చిన సంతోషంలో ఉన్న లబ్ధిదారులను పలుకరించి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2016లో జిల్లా పర్యటకు వచ్చిన సమయంలో ఖమ్మం నగరంలో అత్యధికంగా నిరుపేదలు ఉన్నట్లు గుర్తించి నియోజకవర్గానికి 2వేల ఇళ్లను మంజూరు చేశారన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ కేటాయించనన్ని డబుల్‌ ఇళ్లు ఒక్క ఖమ్మానికే కేటాయించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఖమ్మంలో 2వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఈ దసరా నాటికి గృహప్రవేశాలు జరిగేలా పనులు శరవేగంగా సాగుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం పథకం ద్వారా ఒక్కో ఇంటికి స్థల వ్యయాన్ని కలుపుకొని రూ.10 లక్షల విలువైన ఇంటిని నిరుపేదలకు అందజేస్తుందన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందన్నారు. అలాగే అనుమతి పొందిన 5వేల ఇండ్లు ఖాళీ జాగా కలిగిన పేదలు ఇండ్లు కట్టుకునేందుకు నిధులు తెస్తానని అన్నారు. అనంతరం డబుల్‌ ఇండ్ల ప్రాంగణంలో మొక్కలను నాటారు.

జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, ఎంపీపీ గౌరి, వైస్‌ ఎంపీపీ గుత్తా రవికుమార్‌, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, సుడా డైరెక్టర్‌ మందడపు నర్సింహారావు, అజ్మీరా వీరూనాయక్‌, ఎంపీటీసీ మాళోతు లక్ష్మి, మాజీ ఎంపీటీసీ మాళోతు రాంబాబు, మాజీ సర్పంచ్‌ తమ్మిన్ని నాగేశ్వరరావు, ఉప సర్పంచ్‌ కేవీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు యాసా రామారావు, గుడిపుడి రామారావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ దొంతు సత్యనారాయణ, సూదగాని సంగయ్య, కొత్తా కొమరయ్య, తాతా వెంకటేశ్వర్లు, పెంట్యాల శ్రీనివాసరావు, మాదంశెట్టి హరిప్రసాద్‌, నున్నా శ్రీనివాసరావు, గుడిపుడి రామారావు, తమ్మినేని సీతరామయ్య, ఐటీడీఏ అధికారులు, ఎంపీడీవో అశోక్‌కుమార్‌, తహసీల్దార్‌ నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.