సోమవారం 26 అక్టోబర్ 2020
Khammam - Sep 28, 2020 , 00:34:00

క‌ర్ష‌క‌లోకం.. హ‌ర్షాతిరేకం

క‌ర్ష‌క‌లోకం.. హ‌ర్షాతిరేకం

  •  నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్ల భారీ ర్యాలీ
  • ఎమ్మెల్యే కందాల ఆధ్వర్యంలో 30 కిలోమీటర్లు ప్రదర్శన
  • నాలుగు మండలాల నుంచి తరలిన రైతాంగం
  • మూడు కిలోమీటర్లు ట్రాక్టర్‌ నడిపిన ఎమ్మెల్యే
  • జయహో కేసీఆర్‌ అంటూ నినదించిన అన్నదాత
  • పటాకులు పేల్చి, సీఎం చిత్రపటాలకు  క్షీరాభిషేకం చేసిన రైతులు

నూతన రెవెన్యూ చట్టానికి సర్వత్రా మద్దతు లభిస్తున్నది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు  తెలిపేందుకు కర్షకులు కదం తొక్కుతున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శనలు చేస్తూ   హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు సహకరిస్తున్న సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. ‘జయహో కేసీఆర్‌' అంటూ నినదిస్తున్నారు. కిలోమీటర్ల పొడవునా ర్యాలీలు  నిర్వహిస్తున్నారు. పురవీధులన్నీ గులాబీమయమవుతున్నాయి. నూతన రెవెన్యూ చట్టం రావడంతో తమ కష్టాలు కడతేరిపోతాయంటూ అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పాలేరు ఎమ్మెల్యే కందాల పిలుపు మేరకు నియోజకవర్గంలోని రైతులు సుమారు 1000 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించి మూడు కిలోమీటర్లు ట్రాక్టర్‌ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. 

-కూసుమంచి 


కూసుమంచి : సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి పిలుపు మేరకు నాలుగు మండలాల రైతులు కదం తొక్కారు. వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కూసుమంచి నుంచి గట్టుసింగారం వరకు రోడ్డుపై ట్రాక్టర్‌ల కోలాహలం కనిపించింది. ప్రతి ట్రాక్టర్‌కు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తొలుత ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి సొంత గ్రామం రాజుపేట నుంచి తీసుకొచ్చిన ట్రాక్టర్‌ను సుమారు 3 కిలోమీటర్లు నడిపి క్యాంపు కార్యాలయం వరకు నడిపారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ జీప్‌లో అందరికీ అభివాదం చేశారు. క్యాంపు కార్యాలయం వద్ద పటాకులు పేల్చారు. ట్రాక్టర్ల ర్యాలీని ఎమ్మెల్యే కందాల జెండా ఊపి  ప్రారంభించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రజలు ఘనస్వాగతం పలికారు. వివిధ మండలాల నుంచి వేలాదిగా వచ్చిన ప్రజలు, రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. పచ్చటి పొలాల మధ్య ట్రాక్టర్‌ల ర్యాలీ చల్లటి వాతావరణంలో ప్రశాంతంగా జరిగింది. కూసుమంచి సీఐ మురళి ఆధ్వర్యంలో సర్కిల్‌ ఎస్సైలు ఇంద్రసేనారెడ్డి, అశోక్‌రెడ్డి, పుదూరి రఘు సర్కిల్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 

నూతన రెవెన్యూ చట్టంతో రైతుల్లో ఆనందం : ఎమ్మెల్యే కందాల

దశాబ్దాలుగా ఉన్న రైతుల భూ సమస్యలను పూర్తిగా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసిందని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయం వద్ద ట్రాక్టర్‌ల ర్యాలీకి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతులకోసం చేపట్టిన పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. నూతనంగా ప్రారంభించే ధరణి పోర్టల్‌ పారదర్శకంగా ఉంటుందన్నారు. ప్రతి రైతుకు ఉపయోగపడే చట్టంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తున్నదని తెలిపారు. ప్రతి ఊరు నుంచి తరలిన రైతులు సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మి, ఆత్మా చైర్మన్‌ రామసహాయం బాలకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, చాట్ల పరశురాం, పాశబోయిన వీరన్న, ఎంపీపీలు బానోత్‌ శ్రీనివాస్‌, బెల్లం ఉమ, బోడా మంగీలాల్‌, వజ్జా రమ్య, రూరల్‌ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ఇంటూరి శేఖర్‌, చావా వేణు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వడ్త్యి సేట్‌ట్రామ్‌నాయక్‌, మండల కార్యదర్శి వెన్నబోయిన శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.   

శాశ్వత పరిష్కారం కోసమే రెవెన్యూ చట్టం

నేలకొండపల్లి: గ్రామాల్లో భూములకు సంబంధించిన పంచాయతీలు లేకుండా శాశ్వత పరిష్కారం లభించేందుకే సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తెలిపారు. కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా రైతు రథయాత్ర ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కందాల పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో గతంలో భూ తగాదాలు ఉండేవని, వాటిని పరిష్కరించి రైతులందరూ  ప్రశాంతంగా ఉండాలనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. త్వరలోనే రైతులందరికి మంచి రోజులు వస్తాయన్నారు. కొత్త రెవెన్యూ చట్టానికి సంఘీభావంగా అందరూ కలిసిరావడం ఎంతో సంతోషంగా ఉందని, రైతు రథయాత్రను విజయవంతం చేసినందుకు అందరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. 

250 ట్రాక్టర్లతో పాలేరుకు తరలిన ఖమ్మం రూరల్‌ రైతన్నలు

ఖమ్మం రూరల్‌: సీఎం కేసీఆర్‌ ఆలోచనతో రూపు దిద్దుకున్న నూతన రెవెన్యూ చట్టం నేడు అందరి మన్ననలు పొందుతున్నది. అందులో భాగంగానే ఆదివారం ఖమ్మం రూరల్‌ మండల రైతాంగం కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రశంచిస్తూ భ్యారీ ర్యాలీ చేపట్టింది. మండలంలోని రైతు సోదరులు 250 ట్రాక్టర్లతో పండుగ వాతావరణంలో ఊరేగింపుగా ర్యాలీగా పాలేరు కేంద్రానికి వెళ్లారు. కేసీఆర్‌కు జై కొడుతూ కేరింతలతో ఆనందోత్సవాలతో రైతులు ర్యాలీ చేపట్టారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బెల్లం వేణు ఉమ ట్రాక్టర్ల ర్యాలీ జెండా ఊపి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం ప్రజలకు వరంగా మారిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సీఎంకేసీఆర్‌ నాయకత్వంలో రైతు సంక్షేమానికి చేపడుతున్న పథకాలు దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పరిష్కారానికి నోచుకుని భూ సమస్యలను కూడా పరిష్కరించేందుకు బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలను రద్దు చేసి నూతన రెవెన్యూ చట్టాన్ని రూప కల్పన చేశారన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని, తెలంగాణ ప్రాంత రైతులు ఆయనకు రుణపడి ఉంటారన్నారు. ఖమ్మం రూరల్‌ మండల ఎంపీపీ బెల్లం ఉమ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజలకు  సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తున్నారననారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే దీర్ఘకాలికంగా పడావు పడిన ప్రజా సమస్యలను కేసీఆర్‌ పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ఖమ్మం రూరల్‌ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌ మాట్లాడుతూ అవినీతిలో కురుకుపోయిన రెవెన్యూ వ్యవస్థను బాగుచేసేందుకు నూతన రెవెన్యూ చట్టం వచ్చిందన్నారు.  కార్యక్రమంలో సుడా సలహా మండలి సభ్యుడు గూడ సంజీవరెడ్డి, ఏదులాపురం సొసైటీ డైరెక్టర్‌ ఏనుగు ధర్మారెడ్డి, ఖమ్మం రూరల్‌ వైస్‌ ఎంపీపీ గుడిబోయిన దర్గయ్య, తీర్థాల సర్పంచ్‌ బాలునాయక్‌, ఆరెకోడు సర్పంచ్‌ వెంకటనారాయణ, ఆరెకోడు తండా సర్పంచ్‌ జగదీశ్‌, కొండాపురం సర్పంచ్‌ విజయలక్ష్మీ, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి రెడ్యానాయక్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మంకేన నాగేశ్వరరావు, నల్లపునేని భాస్కర్‌రావు, ముత్యం పెద్ద కృష్ణారావు, కొప్పుల అంజేయులు, రేంటాల ఆనంద్‌, అక్కినేపల్లి వెంకన్న, పేరం వెంకటేశ్వర్లు, నాగండ్ల నాగేశ్వరరావు, బీ సతీశ్‌, బుర్రా మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. logo