మంగళవారం 27 అక్టోబర్ 2020
Khammam - Sep 26, 2020 , 00:22:51

సంక్షోభంలోనూ ఆగని సహకారం

సంక్షోభంలోనూ ఆగని సహకారం

  • ప్రాథమిక సంఘాలు.. రైతుల చిరునామాలు
  • పరపతేతర వ్యాపారాలతో సొసైటీలు బలోపేతం
  • ఇక నుంచి సహకార బ్యాంకు పరిధిలోకి చేగొమ్మ సొసైటీ
  • 117వ మహాజన సభలో డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం
  • హాజరైన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సొసైటీల అధ్యక్షులు

ఖమ్మం వ్యవసాయం : ఒకవైపు కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ సహకార బా్ంయకులు, సొసైటీల ద్వారా రైతుల సేవలకు ఎక్కడా ఆటంకం కలుగలేదని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ కూరాకుల నాగభూణం తెలిపారు. ఖమ్మంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో డీసీసీబీ 117వ మహాజన సభ శుక్రవారం జరిగింది.

 ముఖ్య అతిథిగా చైర్మన్‌ హాజరయ్యారు. తొలుత 2019-20 ప్రగతి నివేదికను డీసీసీబీ ఏజీఏం సర్వేశ్వరరావు సొసైటీల చైర్మన్లకు, డీసీసీబీ పాలకవర్గసభ్యులకు నివేదించారు. అనంతరం ప్రగతి నివేదికలు, రాబోయే రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతం కోసం అవసరమైన చర్యలు గురించి ఆయా సొసైటీల చైర్మన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అనంతరం ఉభయ జిల్లాల సొసైటీ చైర్మన్లను ఉద్దేశించి చైర్మన్‌ ప్రసంగించారు. ఖమ్మం డీసీసీబీకి దాదాపు వందేళ్ల చరిత్ర ఉందన్నారు. తనాటి నుంచి నేటి వరకు అన్నదాతలు, ఇతర వర్గాల ప్రజలు మంచి ఆదరణ చూపెడుతున్నారని అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అంటేనే అన్నదాతలకు అడ్డాలుగా ఉంటాయన్నారు. 

రైతులకు, ప్రభుత్వానికి సొసైటీలు అనుసంధానంగా ఉండాలన్నారు. సొసైటీల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. 2019-20లో 76 సంఘాలు ధాన్యం సేకరణ కోసం రూ.560.50 కోట్ల వ్యాపారం చేయగా రూ.11.25 కోట్ల కమీషన్‌ వచ్చిందని అన్నారు. 95 సంఘాలు రూ 46.86 కోట్ల ఎరువుల వ్యాపారం చేయగా రూ 37 కోట్లు, మరో 97 సంఘాలు 12.81 కోట్ల వ్యాపారం చేయగా రూ.9 కోట్ల లాభాలు వచ్చాయని వివరించారు. ఇంతకాలం ఎస్‌బీఐ పరిధిలో ఉన్న చేగొమ్మ సొసైటీ ఇక నుంచి డీసీసీబీ పరిధిలోకి వచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. డీసీసీబీ పరిధిలో ఉన్న 1,64,499 మంది రైతులు ఉన్నారన్నారు. వారిలో 2018 సంవత్సరంలో రూ.25 వేల లోపు పంట రుణాలు తీసుకున్న 23,508 మందికి 2,610.15 లక్షల రుణాలు మాఫీ అయ్యాయని వివరించారు. మార్ట్‌గేజ్‌ కోసం రూ.16.34 కోట్లను, రైతుల పిల్లల విదేశి విద్య కోసం రూ.34.97 కోట్లను రుణంగా అందించినట్లు వివరించారు. 

రానున్న రోజుల్లో ఖాతాదారులకు, అన్నదాతలకు వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు అందించేందకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సొసైటీల అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్‌కు, వైస్‌ చైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాలువతో సత్కరించారు. డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వరరావు, డీసీఎంస్‌ చైర్మన్‌ రాయల శేషగిరిరావు, వైస్‌ చైర్మన్‌ కొత్వాల శ్రీనివాసరావు, డీసీసీబీ పాలకవర్గసభ్యులు, సీఈవో వేణుగోపాల్‌రావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల సహకార అధికారులు విజయకుమారి. మైఖేల్‌బోస్‌, డీఏవో విజయనిర్మల, ఉద్యానశాఖ అధికారి అనిత పాల్గొన్నారు. 


logo