గురువారం 29 అక్టోబర్ 2020
Khammam - Sep 25, 2020 , 01:29:01

ముగ్గురు ఇంజినీర్ల సస్పెన్షన్‌

ముగ్గురు ఇంజినీర్ల సస్పెన్షన్‌

  • విద్యుత్‌ లైన్లు పూర్తిగా వేయకుండానే బిల్లుల డ్రా
  • తనిఖీలో బయటపడటంతో ఉన్నతాధికారుల చర్యలు 

మామిళ్లగూడెం/ వైరా: తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌) ఖమ్మం సర్కిల్‌ పరిధిలో ముగ్గురు ఇంజినీర్లను సస్పెండ్‌ చేస్తూ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సీ.ప్రభాకర్‌ ఉత్వర్వులు జారీ చేశారు. ఖ మ్మం జిల్లాలో చేపడుతున్న పలు పనులను పరిశీలించిన ఎస్‌ఈ రమేశ్‌.. ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. వైరా డివిజన్‌ పరిధిలో జరుగుతున్న విద్యుత్‌ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నట్లుగా ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సస్పెండ్‌ అయిన వారిలో తల్లాడ ఏడీఈ హరీశ్‌, ప్రస్తుత వైరా ఏఈ ఎస్‌ఎస్‌ఎస్‌ కుమార్‌, గతంలో వైరా ఏఈగా పనిచేసి ప్రస్తుతం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు ఏఈగా పనిచేస్తున్న జగదీశ్‌ ఉన్నారు. వీరి స్థానాల్లో ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించేదుకు ఎస్‌ఈ రమేశ్‌ కొద్దిమంది పేర్లను పరిశీలిస్తున్నారు. 

విద్యుత్‌ లైన్లు పూర్తిగా వేయకుండానే..

సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ లైన్‌ను త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్‌గా పూర్తి చేయకుండానే బిల్లులు చేసిన, అందుకు సహకరించిన వైరా విద్యుత్‌శాఖలోని ముగ్గురు అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆరు నెలల క్రితం వరకు వైరా ఏఈగా పనిచేసిన జగదీశ్‌, ప్రస్తుత ఏఈ ఎస్‌ఎస్‌ఎస్‌ కుమార్‌, తల్లాడ ఏడీఈ హరీశ్‌లపై సస్పెన్షన్‌ వేటుపడింది. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయిన వైరాలో సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ లైన్లను త్రీ ఫేజ్‌ విద్యుత్‌ లైన్లుగా మార్చేందుకు విద్యుత్‌శాఖ పలు లైన్లను మంజూరు చేసింది. అందులో భాగంగా వైరాలోని ఆర్‌సీఎం చర్చీ రోడ్డు, రాజశేఖర్‌నగర్‌ ప్రాంతాల్లోని సుమారు 7 కిలోమీటర్ల దూరం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ లైన్లను త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్లుగా మార్చేందుకు ఉన్నతాధికారులు అనుమతులిచ్చారు. ఈ పనులకు ఆరు నెలల క్రితమే గతంలో జగదీశ్‌ ఏఈగా ఉన్న సమయంలోనే అనుమతులు వచ్చాయి.

అయితే ఈ రెండు ప్రాంతాల్లో 7 కిలోమీటర్లు వేయాల్సిన త్రీఫేజ్‌ లైన్‌ను 5 కిలోమీటర్ల మేరకే వేశారు. మిగిలిన 2 కిలోమీటర్ల దూరం త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్లు వేయకుండానే నిధులు గోల్‌మాల్‌ చేశారు. కిలోమీటరు లైను వేసినందుకు విద్యుత్‌శాఖ రూ.25 వేలను చెల్లించింది. అయితే 5 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్‌ వేయగా.. 7 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్‌ వేసినట్లు అధికారులు బిల్లులు చేశారు. 5 కిలోమీటర్లకు రూ.1.25 లక్షల బిల్లులు చేయాల్సి ఉండగా. 7 కిలోమీటర్లు పనులు పూర్తి చేసినట్లు రూ.1.75 లక్షల బిల్లులు చేశారు. దీంతో ఈ పనుల్లో అధికారులు రూ.50 వేలు అవినీతికి పాల్పడ్డారు. ఇటీవల విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు ఈ లైన్లను పరిశీలించగా.. స్థానిక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది. గతంలో ఏఈగా ఉన్న జగదీశ్‌ ఈ విద్యుత్‌ లైన్లకు సంబంధించిన మెటీరియల్‌ను ప్రస్తుత ఏఈ కుమార్‌కు అప్పగించకపోవడంతో అతనిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అదేవిధంగా ఈ లైన్లను పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తల్లాడ ఏడీఈ హరీశ్‌, వైరా ఏఈ ఎస్‌ఎస్‌ఎస్‌ కుమార్‌లను కూడా ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ చేశారు.  


logo