మంగళవారం 27 అక్టోబర్ 2020
Khammam - Sep 25, 2020 , 01:29:04

కరోనా సమయంలోనూ విశేష సేవలు

కరోనా సమయంలోనూ విశేష సేవలు

  • వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అవిశ్రాంత శ్రమకు పురస్కారాలు 
  • బోనకల్లు, ముస్తాఫానగర్‌ ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులు 
  • బెస్ట్‌ సర్వీస్‌ అందించిన జాబితాలో పది పీహెచ్‌సీలు, మూడు యూపీహెచ్‌సీలు

మయూరిసెంటర్‌ : విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అవిశ్రాంతంగా శ్రమించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి విశిష్ట గుర్తింపు లభించింది. ఓ వైపు కొవిడ్‌ రోగులను మెరుగైన వైద్యం అందిస్తూనే.. మరోవైపు వైద్యశాలలను పరిశుభ్రంగా ఉంచినందుకు కాయకల్ప అవార్డులు, ఉత్తమ ప్రశంసా పత్రాలు లభించాయి. వసతులు, పరిసరాల పరిశుభ్రత అంశంలో పలు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ అవార్డులను, రివార్డులను, ప్రసంశా పురస్కారాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. బోనకల్లులోని పీహెచ్‌సీ, ముస్తఫానగర్‌లోని యూపీహెచ్‌సీ కాయకల్ప బెస్ట్‌ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇందుకోసం రూ.2 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ప్రశంసా అవార్డుల కోసం 10 పీహెచ్‌సీలు, 3 యూపీహెచ్‌సీలు కూడా ఎంపికయ్యాయి. వీటికి రూ.50 వేలను రివార్డుగా ప్రకటించింది.

ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ బీ.మాలతీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల పనితీరు, సేవలు, వసతులు, గ్రీనరీ, శానిటేషన్‌, వ్యర్థాల మేనేజ్‌మెంట్‌, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ సపోర్టింగ్‌ సర్వీసెస్‌, హైజీన్‌ ప్రమోషన్‌, ఆరోగ్య విద్య వంటి అంశాలను పరిశీలించిన ప్రభుత్వం బోనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ముస్తాఫానగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఉత్తమ జాబితాలో చేర్చిందన్నారు. అలాగే ప్రశంసా అవార్డులను అందుకున్న జాబితాలో చింతకాని, ఏన్కూరు, తిరుమలాయపాలెం, సింగరేణి, కల్లూరు, పెద్దగోపతి, గంగారం, ఎంవీ పాలెం, సబ్లేడు, తల్లాడ పీహెచ్‌సీలు, మామిళ్లగూడెం, శ్రీనివాసనగర్‌, వెంకటేశ్వరనగర్‌ యూపీహెచ్‌సీలు ఉన్నాయని వివరించారు. logo