సోమవారం 30 నవంబర్ 2020
Khammam - Sep 21, 2020 , 01:26:36

నీట మునిగి యువకుడు దుర్మ‌ర‌ణం

 నీట మునిగి యువకుడు దుర్మ‌ర‌ణం

అశ్వారావుపేట రూరల్‌: ఈత సరదా.. ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన  చిందిరాల అన్నవరం కూతరు-అల్లుడు సురేశ్‌(25) పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామంలో ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. మనవడి జన్మదిన వేడుకను ఆదివారం నారాయణపురం గ్రామంలో ఆ కుటుంబ సభ్యులంతా ఆనందంగా జరుపుకున్నారు.

ఆ తరువాత అంతా కలిసి పెదవాగు ప్రాజెక్టును చూసేందుకు వెళ్లారు. అక్కడ లాకుల వద్ద స్నానం చేసేందుకు ప్రయత్నించారు. నీటిపారుదల శాఖ అధికారులు మందలించడంతో వెళ్లిపోయారు. అక్కడి నుంచి రంగాపురం-గుమ్మడవల్లి గ్రామాల మధ్యన ఉన్న లోలెవల్‌ బ్రిడ్జి వద్దకు ఆటోలో వెళ్లారు. ఆ వాగులో స్నానాలకు దిగారు. అక్కడ ఒకచోట లోతుగా ఉన్నచోట సుడిగుండంలో సురేశ్‌ చిక్కుకుని నీట మునిగాడు. కుటుంబ సభ్యులు భయంతో గట్టిగా  కేకలు వేయటంతో దగ్గరలోని పొలాల నుంచి రైతులు పరుగు పరుగున వచ్చారు. సురేశ్‌ను బయటకు తీశారు. అప్పటికే అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని అశ్వారావుపేట ప్రభత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగుపాటుకు ఒకరు...

దమ్మపేట: పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందాడు. ఆర్‌ఐ భిక్షమయ్య తెలిపిన వివరాలు... మండలంలోని రెడ్యాలపాడు గ్రామస్తుడు గుర్రాల రాము(44) ఆదివారం సాయంత్రం తన వరి పొలానికి వెళ్లాడు. అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లేసరికి రాము నిర్జీవంగా కనిపించాడు. పిడుగుపాటుతో మృతిచెందినట్లుగా అందిన సమాచారంతో ఆ ప్రదేశాన్ని పోలీసులు, ఆర్‌ఐ భిక్షమయ్య పరిశీలించారు. రాముకు భార్య అన్నపూర్ణ, పిల్లలు లావణ్య, సంతోశ్‌ ఉన్నారు.