గురువారం 22 అక్టోబర్ 2020
Khammam - Sep 19, 2020 , 00:44:40

ఇంటింటికీ శుద్ధజలం

ఇంటింటికీ శుద్ధజలం

  • రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం: ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు ఖమ్మం నగరంలో వడివడిగా సాగుతున్నాయని, దసరా నాటికి మంచినీరు సరఫరా చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పథకం కోసం ప్రభుత్వం రూ.230 కోట్లు కేటాయించిందన్నారు. ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఉన్న నల్లా కనెక్షన్లతో పాటు కొత్తగా 45 వేల నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇప్పటి వరకు 25 వేల ఇండ్లకు నల్లాలు బిగించామని, మొత్తం 75 వేల నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి ప్రతిరోజు తాగునీటి సరఫరా జరుగుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు.  త్వరలో పనులు పూర్తి చేసి 75,000 నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్నారు. కొవిడ్‌ కాలం అయినప్పటికీ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రూ.61.47 కోట్ల నిధులు విడుదల చేయించారన్నారు. ఈ చెక్కును ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టు మేనేజర్‌ హరిప్రసాద్‌కు మంత్రి అందజేశారు అందజేస్తున్నట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ పనులు ఇప్పటికే ముగింపు దశలో ఉన్నాయని నెలరోజుల వ్యవధిలో పనులన్నీ పూర్తి చేసి నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీటిని అందిస్తామని మంత్రి తెలిపారు.

పాత ఆస్తిపన్ను బకాయిలు, పెనాల్టీ వడ్డీలపై 90శాతం రాయితీ కాలపరిమితిని అక్టోబర్‌ 31 వరకు పొడిగించామని, నగర ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని మంత్రి అన్నారు.  నగర పాలక, పురపాలక సంఘాల పరిధిలో గల శాసనసభ్యులందరూ ప్రజల విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు గాను ఎల్‌ఆర్‌ఎస్‌ విధానంలో ఇది వరకు జారీ చేసిన ప్రభుత్వ మార్గదర్శకాలను సవరిస్తూ జి.ఓ. 135 ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ అమృత్‌ పథకం కింద ఖమ్మం నగరంలోని చేపట్టిన మంచినీటి సరఫరా పనులు ముగింపు దశలో ఉన్నాయని, పైప్‌లైన్‌ పనులు 99శాతం పూర్తయ్యాయన్నారు. మంత్రి ప్రత్యేక చొరవతో మంచినీటి వసతికి నిధులు విడుదలయ్యాయన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌, నగర కమిషనర్‌ అనురాగ్‌ జయంతి తదితరులున్నారు. logo