మంగళవారం 27 అక్టోబర్ 2020
Khammam - Sep 17, 2020 , 01:59:25

అర్హులందరికీ రైతుబంధు ఇవ్వాలి

అర్హులందరికీ రైతుబంధు ఇవ్వాలి

  • అసెంబ్లీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి : బ్యాంకు అకౌంట్‌ వివరాలు, భూమి వివరాలు నమోదులో హెచ్చుతగ్గులు తప్పిదాల వలన అర్హులైన రైతులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం పొందలేకపోతున్నారని దీనికి సంబంధించిన వివరాలు వ్యవసాయశాఖ మంత్రికి అందజేశామని ఈ సమస్యపై ఆలోచించాలని బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు.

రైతు బీమా పథకంలో భాగంగా జనవరి నుంచి ఆగస్టు వరకు కొత్త పాస్‌పుస్తకాలు పొందిన రైతుల వివరాలు ఇన్సూరెన్స్‌ కంపెనీలు నమోదు చేసుకోకపోవడం వలన ఆ కొత్త పాస్‌పుస్తకాలు పొందిన రైతులు చనిపోతే బీమా వర్తించడం లేదని ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి వారికి బీమా వర్తించేలా చూడాలన్నారు. అవేక్ట్‌ ప్రాపర్టీ అసైన్‌మెంట్‌ భూములు కలిగిన వారికి రైతుబంధు రావడంలేదన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50వేల ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానపంటలు పండిస్తున్నారని ఇందుకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఒక్కరే అధికారి ఉండటం వల్ల ప్రకృతి విపత్కర పరిస్థితులు నెలకొన్న సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.  ఆర్‌డబ్ల్యుఎస్‌లో 23 ఏండ్లుగా ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం పేస్కేల్‌ ఇవ్వాలన్నారు. దీనికి బదులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమాధానం ఇస్తూ.. ఖమ్మం జిల్లాలో నమోదు వివరాల తప్పిదాలు వాస్తవమేనని ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, రైతు క్లస్టర్లు శాస్త్రీయంగా లేనందున త్వరలో మరో 250 కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యానవన శాఖలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాధానం ఇచ్చారు.

ఎల్‌ఆర్‌ఎస్‌లో వారసులకు కేటాయించాలి..

జలగం వెంగళరావు, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నిరుపేదలకు పలు కాలనీలను ఇవ్వగా పలువురు చనిపోగా వారి వారసుల పేరుమీద ఎల్‌ఆర్‌ఎస్‌లో వర్తింపజేయాలని అసెంబ్లీలో సండ్ర వెంకట వీరయ్య కోరారు. 1970కు పూర్వం ఇంటి పన్నులు రశీదులు లేకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌లో వర్తించే అవకాశం లేకపోవడంతో రెగ్యులరైజేషన్‌ ఎలా చేయాలో ఆలోచన చేయాలని కోరారు. సుందరంగా తీర్చిదిద్దిన దుర్గం చెరువు తరహాలో ఖమ్మంలో బ్రిడ్జి నిర్మించాలని, మున్నేరుకు కరకట్ట ఇవ్వాలని జిల్లా మంత్రి ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  ఈ విషయమై ఐటీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసైన్‌మెంట్‌ భూముల సర్వే నెంబర్ల ద్వారా సీసీఎల్‌ఏ, చీఫ్‌ సెక్రటరీతో చర్చించి పరిష్కరిస్తామని హామీనిచ్చారు.logo