మంగళవారం 27 అక్టోబర్ 2020
Khammam - Sep 17, 2020 , 01:59:25

ఎర్ర బంగారం ధరకు రెక్కలు..

ఎర్ర బంగారం ధరకు రెక్కలు..

  • క్వింటా ఏసీ రకం మిర్చి రూ.16,600 
  • నిల్వలు తగ్గడంతో  పెరుగుతున్న ధరలు
  • ఖాళీ అవుతున్న కోల్డ్‌స్టోరేజీలు

ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చి పంటకు రెక్కలొస్తున్నాయి. కొద్ది రోజులుగా ధర పెరుగుతూ వస్తోంది. ఇంతకాలం పంటను కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్న రైతులకు.. ఎండుమిర్చి ఇప్పుడు సిరులు కురిపిస్తోంది. బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో క్వింటా మిర్చి రూ.16,600 పలికింది. మధ్య ధర రూ.12,500, కనిష్ట ధర రూ.10 వేలు చొప్పున ఉంది. దీంతో మార్కెట్లో పంటను అమ్మకానికి పెట్టిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన పక్షం రోజుల నుంచి మార్కెట్లో ఎండు మిర్చి ధర రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

జాతీయ మార్కెట్లో మిర్చి పంటకు డిమాండ్‌ పెరడంతో ఆ ప్రభావం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌పై కూడా పడుతోంది. ఈ ఏడాది పంట చేతికి వచ్చే సమయానికి సరిగ్గా కరోనా ప్రారంభం కావడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో పచ్చి సరుకును అప్పట్లో కొందరు రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు మార్కెట్‌ వెలుపల అమ్ముకున్నారు. అప్పట్లో మిర్చిలో మొదటి రకం పంటకు సైతం క్వింటాకు రూ 10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే ధర పలికింది. దీంతో రైతుల ప్రయోజనం కోసం మార్కెట్‌ పాలకవర్గం రైతుబంధు పథకం ద్వారా వడ్డీలేని రుణాలు అందించారు. రుణాలు తీసుకున్న రైతులు పంటను కోల్డ్‌స్టోరేజీల్లో భారీగా నిల్వ చేసుకున్నారు. ఖమ్మం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోల్డ్‌స్టోరేజీలూ మిర్చిపంటతో కిక్కిరిసి పోయాయి. ఇప్పుడు పంటలకు పెట్టుబడి సీజన్‌ ప్రారంభం కావడం, మార్కెట్లో పంటకు మంచి డిమాండ్‌ రావడం వంటి కారణాలతో..

ఇప్పటికే పంటను నిల్వ చేసుకున్న రైతులు తిరిగి ఖరీదుదారులకు విక్రయించడం ప్రారంభించారు. ఆశించిన మేర ధర వస్తుండటంతో పొరుగు జిల్లాల రైతులు సైతం ఖమ్మం మార్కెట్‌లో పంటను అమ్మకానికి పెడుతున్నారు. ప్రస్తుతం యార్డులో రోజుకు 15వేల వరకు మిర్చి బస్తాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. పంటను తీసుకొచ్చిన రైతులకు మద్దతు ధరను అందేలా ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, మార్కెట్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ మార్కెట్లో పంట ఉత్పత్తులు తగ్గుతుండటంతో రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఇతర రాష్టాలకు చెందిన ఖరీదుదారులు సైతం పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. 


logo