ఆదివారం 24 జనవరి 2021
Khammam - Aug 22, 2020 , 02:02:20

జై బొజ్జ గణపయ్య..!

జై బొజ్జ గణపయ్య..!

  • గణేశ్‌ పూజలకు సిద్ధమైన భక్తులు
  • నేడు వినాయక చవితి
  • ఇళ్లకే పరిమితం కానున్న పూజలు
  • కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి
  • కరోనా నేపథ్యంలో గృహాలకే పరిమితం కానున్న వినాయక పూజలు 
  • బహిరంగ మండపాల్లో నవరాత్రి ఉత్సవాలు నిషేధం.. 
  • ఉమ్మడి జిల్లాలో పత్రి.. పూజా ద్రవ్యాల క్రయవిక్రయాల సందడి.. 

  ‘ సర్వ శుభాల్ని కలిగించేవాడు. సకల విఘ్నాలను తొలగించేవాడు...  వరసిద్ధ్ది వినాయకుడు  భక్తులచేత విశేష  పూజలందుకునేందుకు సిద్ధ్దమయ్యాడు. భాద్రపద శుద్ధ్ద చవితి శనివారం  వినాయక చవితి పర్వదినాన్ని  జిల్లా వ్యాప్తంగా  అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ మండపాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రభుత్వం నిషేధించడంతో ఇండ్ల వద్దనే గణనాథుడిని సేవించడానికి సమాయత్తమయ్యారు. ఈసారి ఎలాంటి ఆర్భాటాలు, సెట్టింగ్‌లు, మండపాలు, భారీ విగ్రహాలు, ఊరేగింపులు లేకుండానే వినాయక చవితి ఉత్సవాలు జరుగనున్నాయి. .  

- ఖమ్మం కల్చరల్‌ / కొత్తగూడెం

ఈ పండుగ నాడు భక్తులు వేకువజామునే నిద్రలేచి, పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.  ఇండ్లను శుభ్రం చేసుకుని, మామిడి తోరణాలతో అలంకరిస్తారు. గదిలో ఈశాన్యమూల స్థలాన్ని శుద్ధి చేసి అలికి,  బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు వేస్తారు. పాలవెల్లి కట్టి, దేవుడికి పీట వేసి, ఆ పీటకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేస్తారు. దానిపై యథాశక్తి  గణపతి విగ్రహాన్ని పెడతారు. తొలుత గణపతికి ప్రార్థన చేస్తారు. కలశాన్ని నూతన వస్త్రంతో అలంకరించి, గణపతిని ఆవాహన చేస్తారు. అనంతరం ఆచమనం, దీపారాధన, సంకల్పం, షోడశోపచార పూజ, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యపాద్యాలు, అథాంగపూజ, శ్వేతగంధాక్షతలు, నానావిధ ఫల, పుష్పాలు,  21 పత్రాలతో పూజ చేస్తారు. అనంతరం ధూపదీప నైవేధ్యాలతో గణపయ్యను ప్రసన్నం చేసుకుంటారు. గణపయ్యకు ఇష్టమైన  ఉండ్రాళ్లు, తెల్లనువ్వులు కలిపిన మోదకాలు, అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు తదితర 21 ప్రసాదాలను నైవేధ్యంగా సమర్పిస్తారు. 

పత్రి...ఫలపుష్పాల క్రయ విక్రయాలు.. 

 భక్తులు  21 పత్రులతో గణపతిని పూజించి ప్రసన్నం చేసుకుంటారు. మారేడు, వాకుడు, గరికె, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, మర్రి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మధుపం, సింధువారం, జాజీపత్రం, గండకి, శమీ, రావి, మద్ది, తెల్లజిల్లేడు పత్రాలతో పూజిస్తారు. పత్రాలే కాకుండా పలు రకాల పూలు, పండ్లతో సేవిస్తారు.  దీంతో వందలాది మంది భక్తులు  పత్రులు, పాలవెల్లి, పూలు, పండ్లు కొనుగోలు  చేశారు.  ఈ సంవత్సరం కరోనా కారణంగా పెవిలియగన్‌ గ్రౌండ్‌ను మూసివేయడంతో నగరంలోని పలు రహదారుల వెంట  పత్రి, ఫలపుష్పాలు, పాలవెల్లి క్రయవిక్రయాల సాగాయి. 

మట్టి వినాయకుల పంపిణీ 

   కాలుష్యనియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టివినాయక ప్రతిమలతో పూజలు చేసుకునే విధంగా కొత్తగూడెం పట్టణంలో మట్టివినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. శ్రీనగర్‌ ఉపసర్పంచ్‌ లగడపాటి రమేశ్‌, ప్రశాంతినగర్‌ రాధాకృష్ణ కోలాట బృందం మారబోయిన పద్మ, అనిత, స్థానిక మహిళలు  తయారు చేసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ప్రశాంతినగర్‌ వార్డు మెంబర్‌ హేమంత్‌, శివ పాల్గొన్నారు.

పండుగను మంచిగా జరుపుకోవాలి 

 వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే మంచిగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఒక ప్రకనటలో తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని వినాయకచవితిని ఇంటి వద్దనే ఘనంగా జరుపుకోవాలని సూచించారు.  వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్‌ చైర్‌పర్స్‌న్‌ కాపు సీతాలక్ష్మి జిల్లా, పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 

భద్రాద్రి  కలెక్టర్‌ ఎంవీ రెడ్డి


logo