బుధవారం 23 సెప్టెంబర్ 2020
Khammam - Aug 15, 2020 , 07:12:40

రెండు వసంతాలు పూర్తి చేసుకున్న ‘రైతుబీమా’

రెండు వసంతాలు  పూర్తి చేసుకున్న ‘రైతుబీమా’

  • u ప్రతిష్టాత్మకంగా అమలు 
  • u ఆర్థికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం
  • u ఇప్పటివరకు 2,350 మంది రైతులు మృతి
  • u బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున 
  • రూ.111.65 కోట్ల పరిహారం జమ
  • u సీఎం కేసీఆర్‌ను ఆరాధ్యదైవంగా కొలుస్తున్న అన్నదాతలు

ఖమ్మం ప్రతినిధి నమస్తే తెలంగాణ : సమాజానికి అన్నం పెట్టే అన్నదాత కుటుంబానికి అండగా ఉండాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేలాది రైతు కుటుంబాలకు ఆపన్నహస్తంగా నిలుస్తున్నది. సబ్బండ వర్గాల మన్ననలు చూరగొంటున్నది. సాగు చేసే రైతులకు అన్ని విధాల సంపూర్ణ సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నేడు దేశానికి మార్గదర్శకం అయింది. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంతో రైతులు సరైన సమయంలో సాగు పూర్తి చేసుకున్నారు. ఆధునిక పద్ధతిలో సాగు చేసుకునేందుకు యంత్ర పరికరాలు, మద్దతు ధర కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ చేసిన సర్కార్‌ పంటల పెట్టుబడిని సైతం ప్రభుత్వమే అందించడంతో అప్పుల బాధలు తొలగిపోయాయి. దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మృతి చెందిన రైతు కుటుంబాలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రైతు బీమా పథకం ప్రవేశపెట్టింది. ప్రతి ఏటా ఒక్కో రైతుకు బీమా ప్రీమియం రూ. 2వేల 771ను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. దీంతో  జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.66 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్లయింది. 2018  ఆగస్టు 14 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది.   నేటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1,537  మంది రైతులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరిలో నేటి వరకు 1,456  మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి వరకు 813 మరణించగా,  777 కుటుంబాలకు బీమా పరిహారం అందింది. ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున నేటి వరకు రూ. 111.65  కోట్లను అధికారులు సంబంధిత నామినీ ఖాతాల్లో  జమ చేశారు. రైతు మరణించిన మరుక్షణమే సంబంధిత ఏఈవో అతని ఇంటిని సందర్శించి పూర్తి వివరాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ వ్యవహారాలు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో నోడల్‌ అధికారులను నియమించారు. దీంతో రైతు మృతిచెందిన పది రోజుల లోపే సంబంధిత నామినీ అకౌంట్‌లో రూ.5 లక్షల పరిహారం అందుతున్నది. దళారులు, పైరవీలకు తావులేకుండా చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో లబ్ధిదారులు

జిల్లా వ్యాప్తంగా రెండేళ్లలో బీమా అర్హత కలిగిన రైతులు  1,537 మంది చనిపోగా, వారిలో నేటి వరకు 1,456 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం రూ. 5లక్షల చొప్పున అందింది. మిగిలిన మరో 81 మంది రైతుల కుటుంబాలకు పరిహారం మరికొద్ది రోజుల్లో అందనుంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. కామేపల్లి మండలంలో 61 మంది చనిపోగా 56 మంది కుటుంబాలకు పరిహారం అందింది. ఖమ్మం అర్బన్‌లో 8 మందికి 7 కుటుంబాలకు, రఘునాథపాలెంలో 80 మందికి 74 కుటుంబాలకు, ఖమ్మం రూరల్‌లో 76 మందికి 70 కుటుంబాలకు, కూసుమంచిలో 80 మందికి, 76 కుటుంబాలకు పరిహారం జమ చేశారు. నేలకొండపల్లి మండలంలో 107 మంది చనిపోగా 103 కుటుంబాలకు, టీ పాలెంలో 116 మందికి 111 కుటుంబాలకు, బోనకల్‌లో 64 మందికి 62 కుటుంబాలకు, చింతకానిలో 82 మందికి 78 కుటుంబాలకు, మధిరలో 105 మందికి 101 కుటుంబాలకు, ముదిగొండలో 84 మందికి 80 కుటుంబాలకు, ఎర్రుపాలెంలో 90మందికి 89 కుటుంబాలకు, ఏన్కూర్‌లో 52 మందికి 48 కుటుంబాలకు, కొణిజర్లలో 70 మంది చనిపోగా, 66 కుటుంబాలకు, సింగరేణిలో 54 మందికి 51 కుటుంబాలు, వైరాలో 79 మందికి 74 కుటుంబాలకు, కల్లూరులో 88 మందికి 87 కుటుంబాలకు, పెనుబల్లిలో 53 మందికి 51 కుటుంబాలకు, సత్తుపల్లిలో 51 మందికి 48 కుటుంబాలకు, తల్లాడలో 65 మందికి 58 కుటుంబాలకు, వేంసూర్‌ మండలంలో 72 మంది రైతులు చనిపోగా నేటి వరకు 66 మంది బాధిత కుటుంబాలకు రూ.  5లక్షల చొప్పున బీమా పరిహారం అందజేశారు. 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేటి వరకు 813 మంది రైతులు చనిపోగా నేటి వరకు 777 మంది బాధిత కుటుంబాలకు బీమా పరిహారం అందజేశారు. మరో 36 మంది నామినీలకు మరికొద్ది రోజుల్లోనే బీమా పరిహారం అందనుంది. మండలాల వారీగా పరిశీలిస్తే.. చుంచుపల్లి మండలంలో 10 మంది రైతు కుటుంబాలకు, జూలూరుపాడులో 46, కొత్తగూడెంలో 6, లక్ష్మీదేవిపల్లిలో 21, పాల్వంచలో 34, సుజాతనగర్‌లో 18 , టేకులపల్లిలో 44 మంది బాధిత కుటుంబాలకు పరిహారం నామినీ ఖాతాల్లో జమచేశారు. ఇల్లెందు మండలంలో 45, అన్నపురెడ్డిపల్లిలో 13,  అశ్వారావుపేటలో 50, చంద్రుగొండలో 32, దమ్మపేటలో 75 కుటుంబాలకు, ముల్కలపల్లిలో 47, ఆళ్లపల్లిలో 13, అశ్వాపురంలో 40 కుటుంబాలకు, బూర్గుంపాడులో 34, గుండాలలో 34, కరకగూడెంలో 23, మణుగూర్‌లో 28, పినపాకలో 31, భద్రాచలంలో 2, చర్లలో 58, దుమ్మగూడెం మండలంలో 77 మంది రైతు కుటుంబాలకు రూ .5లక్షల చొప్పున మొత్తం రూ. 38,85 కోట్ల పరిహారం అందజేశారు. 

 ఏటేటా పెరుగుతున్న అర్హులు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా(సామూహిక రైతుబీమా) పథకంలో లబ్ధిదారుల సంఖ్య నేటి వరకు పెరుగుతూ వస్తోంది. పథకం ఆరంభంలో ఇంటి పెద్ద ఒక్కరిపైనే సాగుభూమి మొత్తం పట్టా అయి ఉండేది. అయితే సీఎం కేసీఆర్‌ ఎంతో దూర దృష్టితో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ప్రతి నెలా వందలాది మంది రైతులకు ఉచిత బీమా పరిహారం అందుతుండటంతో పట్టాదారుల సంఖ్య సైతం పెరుగుతున్నది. ఇంట్లో పెద్దల పేరుతో కుమారులు తమ సొంత భూమిని పట్టా చేస్తున్న సంఘటనలూ ఆనేకం ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణించడంతో పాటు సాధారణ మరణాలకు సైతం బీమా పరిహారం అందుతోంది. గ్రామాలకు ఏఈవోలు వెళ్లి ఉచిత బీమా చేయించడం, బీమా ప్రీమియం సైతం ప్రభుత్వుమే చెల్లిస్తుండటంతో రైతులకు ఎలాంటి ఆర్థిక భారం పడటం లేదు. అదే విధంగా పరిహారం పొందే సమయంలోనూ పైరవీలకు తావు లేకుండా నేరుగా నామినీల ఖాతాల్లో సొమ్ము జమ అవుతున్నాయి. 2018 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచి ఈ పథకం అమల్లోకి రాగా, మరో ఏడాదికి సైతం ప్రభుత్వం ముందస్తుగానే జీవిత బీమా సంస్థకు ప్రీమియం చెల్లించింది.

ఖమ్మం జిల్లాలో సాగు రైతుల సంఖ్య : 2,99,854

‘రైతుబీమా’కు అర్హులైనవారు : 1,66,380

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల సంఖ్య : 1,33,550

‘రైతుబీమా’కు అర్హత కలిగిన వారు : 74,827

అందుతున్న బీమా పరిహారం : రూ. 5లక్షలు   

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మృతిచెందిన రైతులు:  2,350 మంది

పరిహారం పొందిన కుటుంబాలు :  2,233

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా : 1,456 కుటుంబాలు (రూ.72.80 కోట్లు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో : 777  కుటుంబాలు (రూ. 38.85 కోట్లు)logo