బుధవారం 23 సెప్టెంబర్ 2020
Khammam - Aug 15, 2020 , 07:12:40

నేడే జెండా పండుగ

నేడే జెండా పండుగ


n నిరాడంబరంగా పంద్రాగస్టు వేడుకలు

n కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరణ

n ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు 

 స్వతంత్రసమరయోధుడు వీరారావుకు  సన్మానం

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లాలో శనివారం నిర్వహించనున్న 74వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జాతీయ పతాకాన్ని అవిష్కరిస్తారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాడిన ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమయోధుడు కూతురు వీరారావును ఘనంగా సన్మానించనున్నారు. స్వాతంత్య్ర వేడుకలను జిల్లాలో నిరాడంబరంగా నిర్వహిస్తున్న సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌ కలిసి.. వీరారావును సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన స్వాతంత్య్ర సమరయోధులను ఢిల్లీలో సన్మానిస్తారు. అయితే ఈ ఏడాది ఖమ్మం జిల్లా నుంచి స్వాతంత్య్ర సమరయోధుడు కూతురు వీరారావు ఎంపికయ్యారు. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 10 మందిని ఎంపిక చేయగా.. అందులో ఖమ్మం నుంచి వీరారావు ఉన్నట్లు ఢిల్లీ నుంచి అధికారులు ఉత్తర్వులు పంపారు. కొవిడ్‌ కారణంగా ఆయన్ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ కర్ణన్‌లు ఖమ్మంలో ఘనంగా సన్మానించి సత్కరించనున్నారు. ఈయన స్వాతంత్య్రానంతరం ఖమ్మం మున్సిపాలిటీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. కౌన్సిలర్‌ ఉన్న కాలంలో ఖమ్మం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. 

 కలెక్టరేట్‌లో  జెండా  ఎగురవేయనున్న ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు

కొత్తగూడెం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో శనివారం పతాకావిష్కరణ జరగనుంది. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరణ జరుగనుందని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:50 గంటలకు ఎస్పీ, 9:55 గంటలకు కలెక్టర్‌, 9:58 గంటలకు ముఖ్య అతిథి విప్‌ రేగా కాంతారావు కలెక్టరేట్‌కు చేరుకుంటారని, 10 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ, 10:ం5 గంటలకు జాతీయ గీతాలాపాన జరుగుతాయని వివరించారు. 10:10 గంటలకు గౌరవ వందనం, 10:15 గంటలకు ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుందని తెలిపారు. 

బ్రిటీష్‌ పాలన చూశాం.. నిజాం నిరంకుశత్వాన్ని ఎదుర్కొన్నా.. 

స్వాతంత్య్రానికి పూర్వం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. బ్రిటీష్‌ పాలనను, తెలంగాణలో నిజాం పాలనను చూశా. పేదరికంతో ఎంత ఇబ్బంది పడేవారమో చెప్పేందుకు మాటలు చాలవు. నిరంకుశత్వాన్ని ఎదుర్కొనేందుకు ఆనాటి యువతరం నిరంతరం పోరాడేది. స్వాతంత్య్రం కోసం దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపైనే మేము నిత్యం చర్చించుకునేవాళ్లం. నిజాం పాలనలో కమ్యూనిస్టుల పక్షాన నిలిచి పోరాడడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆనాడు ప్రతిఒక్కరిలోనూ దేశం కోసం ఏదైనా చేయాలనే తపన ఉండేంది. దాని వల్లనే ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకాడక స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాం. 

-కూతురు వీరారావు, స్వాతంత్య్ర సమరయోధుడు logo