శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Khammam - Aug 13, 2020 , 02:35:49

పల్స్‌ను పసిగట్టే..ఆక్సీమీటర్‌

పల్స్‌ను పసిగట్టే..ఆక్సీమీటర్‌

  • కరోనా గుర్తింపులో పెద్దాయుధం..
  • ఆక్సీజన్‌ స్థాయిని తెలిపే పరికరం 
  • చికిత్సలో కీలకం 

మయూరిసెంటర్‌ : మనిషి శరీరంలోని ఆక్సీజన్‌ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా కరోనా ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పల్స్‌ ఆక్సీమీటర్‌ అత్యంత కీలకంగా మారింది. ఎవరైనా ఉపయోగించడానికి వీలుగా ఉండే ఈ చిన్న పరికరం కరోనాపై యుద్ధ్దంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. కరోనా సోకి హోంక్వారంటైన్‌లో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ రక్తంలోని ఆక్సీజన్‌ స్థాయి తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఒకప్పుడు దవాఖానలకే పరిమితమైన  ఈ పరికరం ప్రస్తుతం చాలా మంది ఇండ్లల్లో కన్పిస్తున్నది. 

కరోనా రోగుల్లో ఊపిరి అందకపోవడం అతిపెద్ద సమస్య. దీంతో రక్తంలోకి చేరే ఆక్సీజన్‌ శాతం తగ్గి పోతుంది. ఇలా వేగంగా ఆక్సీజన్‌ లెవల్స్‌ పడిపోవడాన్ని హైపోక్సియా అంటారు. కరోనా రోగుల్లో చాలా మందికి (అసింటమాటిక్‌) కొవిడ్‌ లక్షణాలు బయటికి కనిపించడం లేదు. దీంతో వారికి ఆక్సీజన్‌ స్థాయి పడిపోతున్న విషయం తెలియదు. ఫలితంగా ఒకటి రెండు రోజుల్లోనే పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్నది. కరోనా మరణాల్లో సగం వరకు హైపోక్సియా లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. హైపోక్సియాను వెంటనే గుర్తించి, దవాఖానకు వెళ్లగలిగితే ప్రాణాలు కాపాడుకోగలమని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిందని భావించేవారు. హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పాందేవారు పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పనిసరిగా వినియోగించాలని సూచిస్తున్నారు. 

పనిచేసే విధానం..  

పల్స్‌ ఆక్సీమీటర్‌ను వినియోగించడం చాలా సులువు. ఏదో ఒక చేతి వేలు కొసకు ఈ మీటర్‌ను అమర్చుకుని బటన్‌ నొక్కితే వెనువెంటనే ఆన్‌ అవుతుంది. కొన్ని సెకన్ల ద్వారా డిస్‌ప్లేలో మనం తీసుకుంటున్న శ్వాసలో ఆక్సీజన్‌ శాతం, పల్స్‌ రేట్‌ను చూపిస్తుంది. ఈ రీడింగ్‌ ఆధారంగా రోగులను వర్గీకరించి చికిత్స అందిస్తారు. 

పెరిగిన డమాండ్‌..తగ్గిన ధర

సాధారణంగా పల్స్‌ ఆక్సీమీటర్‌ ధర రూ. 2 వేలకు పైగా ఉండేది. ప్రస్తుతం డిమాండ్‌ నేపథ్యంలో ఉత్పత్తి బాగా పెరిగింది. ఫలితంగా ధర దిగివచ్చింది. రూ. 500 నుంచి రూ. 1000 మధ్య లభిస్తుంది. 

ఆక్సీజన్‌ స్థాయి.. 

మన శరీరంలో  ఉన్న రక్తంలో ఎంత మోతాదులో ఆక్సీజన్‌ సరఫరా అవుతున్నదో పల్స్‌ ఆక్సీమీటర్‌ గుర్తిస్తుంది. సాధారణంగా ఆక్సీజన్‌ లెవల్స్‌ 95-100 శాతం వరకు ఉండాలి. పల్స్‌ రేట్‌ 60-100 మధ్య ఉండాలి. ఆక్సీజన్‌ స్థాయి 90 శాతం కన్న తక్కువకు పడిపోయినా, గుండె పల్స్‌ రేట్‌ 100 కన్నా పెరిగిన బాధితుడు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టే. కరోనా పాజిటివ్‌ ఉండి ఆక్సీజన్‌ లెవల్స్‌ 95 ఆ పైన ఉంటే తక్కువ లక్షణాలున్నట్లు భావిస్తారు. ఆక్సీజన్‌ లెవల్స్‌ 90-94 మధ్య ఉంటే మధ్యస్తంగా ఉన్న వారిని దవాఖానకు తరలించాల్సి ఉంటుంది. ఆక్సీజన్‌ లెవల్స్‌ 90 కంటే తక్కువకు పడిపోతే వారిని క్రిటికల్‌ కేర్‌ దవాఖానాకు తరలించాల్సి ఉంటుంది.

మనోధైర్యమే మందు..


పాజిటివ్‌ వచ్చినా భయపడవద్దు. కరోనా బారినపడ్డ వారు భయాందోళనకు గురికావద్దు. ప్రభుత్వం మందులు, చికిత్సలు అందిస్తూ హోం ఐసొలేషన్‌, ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నాం. అనుమానిత లక్షణాలతో వచ్చి, టెస్టుల అనంతరం పాజిటివ్‌ వచ్చినా కూడా భయపడవద్దు మనోధైర్యమే సగం బలం. జిల్లా ఆసుపత్రిలో 200 పడకల సామర్థ్యంతో వసతులున్నాయి. 24 గంటల పాటు వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉంటూ సెంట్రలైజ్‌ ఆక్సీజన్‌, వెంటిలెటర్ల సదుపాయంతో ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం.  

- డాక్టర్‌ బి. వెంకటేశ్వర్లు, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి


logo