శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Khammam - Aug 13, 2020 , 02:35:49

టీఎస్‌-బీపాస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

టీఎస్‌-బీపాస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

  • ఆన్‌లైన్‌లో ఇంటి నిర్మాణ అనుమతులు
  •  21 రోజుల్లో ప్రక్రియ పూర్తి 
  •  త్వరలో అమలు చేసేందుకు ఏర్పాట్లు
కొత్తగూడెం అర్బన్‌: భనవ నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం చేయబోతున్నది. ఇందుకోసం బిల్డింగ్‌ పర్మిషన్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌(బి-పాస్‌)కు ప్రవేశపెట్టబోతున్నది. ఇల్లు/షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి అనుమతుల కోసం మున్సిపల్‌ కార్యాలయాల చుట్ట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం వంటి ఇబ్బందులు ఇకపై ఉండవు. మున్సిపల్‌ చట్టం-2019 ప్రకారం టీఎస్‌-బీపాస్‌ విధానాన్ని ఏప్రిల్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో లాంఛనంగా ప్రారంభించాలని మున్సిపల్‌ శాఖ భావించింది. కొన్ని సాంకేతిక అవాంతరాల కారణంగా దీనిని వాయిదా వేసింది. ఈ విధానానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది. దీంతో త్వరలోనే బీ-పాస్‌ అమల్లోకి రానుంది.
21 రోజుల్లోనే నిర్మాణ అనుమతులు
 ఇల్లు, భవంతి, షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి దరఖాస్తు చేసిన తేదీ నుంచి 21 రోజుల లోపులో ప్రభుత్వం అనుమతి ఇస్తుంది (పత్రాలన్నీ సక్రమంగా ఉంటేనే). అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నట్లయితే ఎవరికి వారు ఆన్‌లైన్‌లో స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిని సంబంధిత అధికారులు పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అనుమతి ఇస్తారు. ఇందుకు అనుగుణంగా బీ-పాస్‌ రూపొందించారు.
అతిక్రమిస్తే జరిమానా
బీ-పాస్‌ నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించేందుకు రూపకల్పన చేశారు.  సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ (స్వీయ ధ్రువీకరణ) ఇచ్చిన వివరాలతో ఇంటిని నిర్మిస్తే యజమానులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుమతులు ఇచ్చిన తర్వాత మున్సిపల్‌, పోలీస్‌, రెవెన్యూ, ఫైర్‌ శాఖల అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తారు. భవన నిర్మాణానికి అనుమతి తీసుకునేందుకు ముందు సమర్పించిన ధ్రువపత్రాలు, భవన నిర్మాణాల పరిధి వివరాలు సక్రమంగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌లో దరఖాస్తుదారు సమర్పించిన ధ్రువపత్రాలు, నిర్మాణ స్థలంలో తేడాలు ఉన్నట్లయితే జరిమానా విధిస్తారు, లేదా నోటీసు ఇవ్వకుండానే నిర్మాణాన్ని కూల్చివేస్తారు. ఈ రెండూ కాకపోతే ఆ ఇంటిని/భవనాన్ని సీజ్‌ చేస్తారు.
నియమ నిబంధనలు ఇలా..
75, అంతకన్నా తక్కువ గజాల విస్తీర్ణంలో నిర్మాణానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. నేరుగా నిర్మాణం చేపట్టవచ్చు. కాకపోతే.. వీరు ఒక్క పని మాత్రం చేయాలి. తమ స్థలం చెరువు/కుంట/ప్రభుత్వ స్థలం/నిషేధిత స్థలం కాదంటూ స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో చేసి రూ.1 చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. 76 నుంచి 600 గజాల లోపు నిర్మాణానికి సంబంధిత ధృవపత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌ చేయాలి. ఏరియానుబట్టి, స్థల విస్తీర్ణాన్ని బట్టి, మార్కెట్‌ విలువనుబట్టి ముందుగా సాధారణ ఫీజు చెల్లించాలి. అనుమతి వచ్చిన తరువాత 14 నుంచి 21 రోజుల లోపు మిగతా ఫీజు చెల్లించిన తరువాత నిర్మాణం చేపట్టవచ్చు. ఒకవేళ 21 రోజుల్లో అనుమతి రాకపోయినా ఇబ్బందేమీ లేదు. 21వ రోజు వరకు కూడా అనుమతి రాకపోతే వచ్చినట్లుగానే భావించి, ఆ మరుసటి రోజు(22వ రోజున)నే నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అనధికార కట్టడాలు, లే ఔట్లను గుర్తించేందుకు కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీం పనిచేస్తుంది. అనుమతులు వచ్చిన ఆరు నెలల్లోపు భవన నిర్మాణాన్ని ప్రారంభించి, రెండేళ్లలోపు పూర్తి చేయాలి.

త్వరలో అమలు చేస్తాం


టీఎస్‌-బీ పాస్‌ విధానాన్ని కొత్తగూడెం మున్సిపాలిటీలో అమలు చేసేందుకు త్వరలో అవసరమైన చర్యలను చేపడుతాం. ఇప్పటికే టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి ఈ విధానంపై అవగాహన కల్పించాం. సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఆధారంగానే, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇస్తాం. పురపాలక శాఖ పరిధిలో భవనాలను నిర్మించుకునేవారు మీ సేవా ద్వారాగానీ, సీనియర్‌ సిటిజెన్‌ సర్వీస్‌ సెంటర్‌లోగానీ సంబంధిత ఇంటి ధృవపత్రాలను సమర్పించి ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చు. 
- అరిగెల సంపత్‌కుమార్‌, కొత్తగూడెం మున్సిపల్‌ కమిషనర్‌


logo