మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Khammam - Aug 13, 2020 , 02:35:49

ఆన్‌లైన్‌లోకి విద్య!

ఆన్‌లైన్‌లోకి విద్య!

  • 20వ తేది నుంచి విద్యార్థులకు  డిజిటల్‌ పాఠాలు 
  • జిల్లావ్యాప్తంగా పుస్తకాల పంపిణీ పూర్తి
  • రేపు ఎంఈఓ, హెచ్‌ఎంలతో డీఈఓ సమావేశం

పిల్లల చదువెప్పుడు గాడిలో పడుతుందా? అని ఇన్నాళ్లూ తల్లిదండ్రులు మదనపడ్డారు. అరచేతిలోకి వచ్చిన ఆధునిక సాంకేతికతతో.. పిల్లల చదువును (ఆన్‌)లైన్‌లోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా కారణంగా దాదాపు ఐదు నెలలుగా బడులకు దూరంగా ఉన్న పిల్లలకు ఇంట్లోనే పాఠాలు చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఆన్‌లైన్‌ ద్వారా హైస్కూల్‌, ఇంటర్‌ విద్యార్థులకు చదువు చెప్పడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.  దూరదర్శన్‌, టీశాట్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఈ అకడమిక్‌ ఇయర్‌ను ప్రారంభించేందుకు సర్వ సన్నద్ధమైంది. 

- ఖమ్మం ఎడ్యుకేషన్‌

పిల్లల చదువెప్పుడు గాడిలో పడుతుందా? అని ఇన్నాళ్లూ తల్లిదండ్రులు మదనపడ్డారు. అరచేతిలోకి వచ్చిన ఆధునిక సాంకేతికతతో.. పిల్లల చదువును (ఆన్‌)లైన్‌లోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా కారణంగా దాదాపు ఐదు నెలలుగా బడులకు దూరంగా ఉన్న పిల్లలకు ఇంట్లోనే పాఠాలు చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఆన్‌లైన్‌/డిజిటల్‌ ద్వారా హైస్కూల్‌, ఇంటర్‌ విద్యార్థులకు చదువు చెప్పడానికి ప్రణాళిక రెడీ చేసింది ప్రభుత్వం. దూరదర్శన్‌, టీశాట్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఈ అకడమిక్‌ ఇయర్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసింది. 

 కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితులతో విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ‘బోధన’ తరగతి గది నుంచి డిజిటల్‌ తెరలపైకి, బ్లాక్‌బోర్డు చాక్‌పీస్‌ నుంచి మార్కర్‌కు వరకూ.. పుస్తకాల నుంచి టీవీలు, ఫోన్ల వరకూ వచ్చింది. డిజిటల్‌ విధానంలో వచ్చిన మార్పులను, ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అడుగులు వేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కరోనా వైరస్‌ దృష్ట్యా పాఠశాలలకు భౌతికంగా హజరయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఆన్‌లైన్‌ బోధనకు మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో తొలి విడతగా దూరదర్శన్‌, టీశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాఠాలు బోధించనున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా నేర్చుకునే పాఠాలకు ఉపయోగపడేలా ఉచిత పాఠ్యపుస్తకాలను సైతం ప్రభుత్వం అందజేసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ పుస్తకాల పంపిణీ పూర్తయింది. 

17నుంచి ఇంటర్‌..20 నుంచి హైస్కూల్‌, 

డిజిటల్‌ బోధనకు ప్రత్యేక షెడ్యూల్‌ రూపొందించి వాటిని రాష్ట్రస్థాయిలో అమలుపర్చనున్నారు. 20వ తేదీ నుంచి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు, ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి వచ్చిన విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేలా షెడ్యూల్‌ను రూపకల్పన చేశారు. జిల్లాలో ఉన్నత పాఠశాలలు మోడల్‌ స్కూల్స్‌-02, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు-21, జిల్లా పరిషత్‌ పాఠశాలలు-190, కేజీబీవీలు-14, వీటితో పాటు సంక్షేమ పాఠశాలలున్నాయి. ఇంటర్‌ విద్యకు 19 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి.

వెబినార్‌ల ద్వారా శిక్షణ...

స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఆన్‌లైన్‌/డిజిటల్‌ బోధనపై శిక్షణ కల్పించారు. పాఠ్యపుస్తకాల్లో వచ్చిన మార్పులను జిల్లాల వారిగా ఆన్‌లైన్‌ విధానంలోనే సదస్సులు నిర్వహించారు. డిజిటల్‌ బోధన చేసేందుకు ఐసీటీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కెపాసిటీ బిల్డింగ్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమం, విద్యార్థులను డిజిటల్‌ విధానంలో సన్నద్ధం చేసేందుకు నిపుణులతో మెళుకువలు నేర్పించారు. ఇంటర్‌ అధ్యాపకులకు సైతం జూలై 14వ తేదీ నుంచి 15 రోజుల పాటు ఆన్‌లైన్‌ విధానంలో బోధనా సామర్థ్యాల పెంపునకు శిక్షణనిచ్చారు. శిక్షణలో బోధనతో పాటు గ్రాఫిక్స్‌, యానిమేషన్‌, పోస్టింగ్‌ అసైన్‌మెంట్స్‌పై బోర్డు డిజిటల్‌ దిశ పేరిట కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆన్‌లైన్‌ శిక్షణ ద్వారా ఉపాధ్యాయులకు డిజిటల్‌ బోధనా సామర్థ్యాలు మెరుగుయ్యాయి.

పర్యవేక్షణకు వాట్సాప్‌ గ్రూప్‌లు 

ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థుల ఆన్‌లైన్‌ బోధనా పద్ధతిని పర్యవేక్షించేందుకు వాట్సాప్‌ గ్రూప్‌లు వినియోగించనున్నారు. ఇప్పటికే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తరగతుల వారిగా పాఠశాలల వారిగా వాట్సాప్‌ గ్రూప్‌లను క్రియోట్‌ చేశారు. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఒక్కో తరగతికి ఒక్కో టీచర్‌ను నియమించి పర్యవేక్షణ చేసేలా వాట్సాప్‌ గ్రూప్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఆరోజు జరిగిన పాఠాలకు హాజరైన విద్యార్థుల వివరాలు, వర్క్‌షీట్స్‌ ఇవ్వడం వాటిని పూర్తి చేయించడం వంటివి చేయనున్నారు. జిల్లాలో సబ్జెక్ట్‌ నిపుణులు సైతం ఆయా సబ్జెక్ట్‌ టీచర్లను గైడ్‌ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికే పూర్తిస్థాయిలో ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

జిల్లాలో ఉన్న ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఈ నెల 17వ తేదీ నుంచి 50శాతం టీచర్లు బడులకు హాజరుకావాలని విద్యాశాఖ సూచించింది. పాఠశాలల్లో ఉన్న టీచర్లలో సగం మంది పాఠశాలకు హాజరై అకడమిక్‌కు సంబంధించిన రికార్డులను, ఇతర అంశాలను మార్గదర్శకాలు వెలువరించాల్సి ఉంది. 

మార్గదర్శకాలకు అనుగుణంగా.. 

డిజిటల్‌ విధానంలో జరిగే బోధనకు జిల్లాలో ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నాం. ఎస్‌సీఈఆర్‌టీ సూచనల మేరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం.  గురువారం జిల్లాలోని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో నిర్వహించే సమావేశానికి సన్నద్ధంగా ఉండాలని సూచిం చాం. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన వివరాలను సేకరించాం. దూరదర్శన్‌, టీ శాట్‌తో పాటు యూట్యూబ్‌ లింక్‌లు సైతం విద్యార్థుల మొబైల్‌ఫోన్‌లకు పంపిస్తాం.

  -  డీఈఓ మదన్‌మోహన్‌logo