మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Khammam - Aug 12, 2020 , 02:40:53

మహిళా సమాఖ్యలను బలోపేతం చేస్తాం

మహిళా సమాఖ్యలను బలోపేతం చేస్తాం

రఘునాథపాలెం : ఖమ్మం జిల్లాలో మహిళా సమాఖ్యలనన్నింటినీ బలోపేతం చేస్తానని రాష్ట్ర రవాణాశాఖా మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మహిళా సమాఖ్యను బలోపేతం చేసేందుకు అవసరమైన మౌళిక సదుపాయాలను సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరం 6వ డివిజన్‌ పరిధి టేకులపల్లిలో రూ.97లక్షలతో నూతనంగా నిర్మించిన జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని కలెక్టర్‌ కర్ణన్‌తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. అనంతరం గౌతమి మహిళా సమాఖ్యలోని 12వేల 79సంఘాలకు గానూ రూ.154.45కోట్ల విలువైన కొవిడ్‌-19 రుణాలకు సంబంధించిన చెక్కులను మంత్రి జిల్లా మహిళా సమాఖ్య బాధ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా అసంపూర్తిగా ఉన్న మహిళా సమాఖ్య భవనాన్ని పూర్తి చేసేందుకు డీఎంఎఫ్‌టీ నుంచి రూ.46లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సమాఖ్యలు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని వసతులతో నిర్మాణం చేసినట్లు తెలిపారు. దీనితో పాటు జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మండల సమాఖ్య భవన నిర్మాణాలను సైతం త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

రూ.150కోట్ల రుణాలు : ఖమ్మం కలెక్టర్‌ కర్ణన్‌

కొవిడ్‌-19 నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్న మహిళా సమాఖ్య లను ఆదుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో రూ.150కోట్లు రుణాలుగా అందిస్తున్నట్లు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. మహిళా సమాఖ్యలకు మరితం ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు మాస్క్‌ల తయారీ, పండ్ల ఉత్పత్తుల వంటి పనులను సైతం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని పూర్తి చేసేందుకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ మెప్మా పరిధిలోని మహిళా సమాఖ్యలను సైతం భాగస్వాములను చేసుకొని జిల్లా మహిళా సమాఖ్య కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రవీణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, కార్పొరేటర్లు ఆత్కూరి హనుమాన్‌,  టీఆర్‌ఎస్‌ నాయకులు దొంగల తిరుపతిరావు, పొదిల పాపారావు, చిలకల    వెంకటనర్సయ్య పాల్గొన్నారు.

66 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత..

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సృష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోని రఘునాథపాలెం మండలంలో 66 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.66, 07,656 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కేవలం రఘనాథపాలెం మండలంలోనే ఇప్పటి వరకు రూ.8.84 కోట్ల కల్యాణలక్ష్మి చెక్కులను అందించినట్లు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేద వారిని సంపన్నులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పువ్వాడ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, నగర మేయర్‌ పాపాలాల్‌, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, ఖమ్మం రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీద్రనాథ్‌, రఘనాథపాలెం ఎంపీపీ భూక్యా గౌరి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నగర పాలక సంస్థ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 


logo